ఉస్మానియాలో అసలేం జరుగుతోంది?

ABN , First Publish Date - 2020-07-05T13:43:30+05:30 IST

కొద్ది రోజుల క్రితం కొవిడ్‌ అనుమానితురాలు ఒకరు తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలతో ఉస్మానియా ఆస్ప త్రికి వెళ్లారు. అప్పటికే ఆమెను పలు ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లినా ఎవరూ చేర్చుకోలేదు. దీంతో ఉస్మానియా ఆస్ప త్రికి.....

ఉస్మానియాలో అసలేం జరుగుతోంది?

ఆర్తనాదాల వెనుక ఏముంది?

రోగులకు అత్యంత సన్నిహితంగా కుటుంబీకులు 

అక్కడే అందరూ కలిసి భోజనాలు.. విశ్రాంతి

వైరస్‌ వాహకాలుగా రోగుల కుటుంబ సభ్యులు 

వార్డుల్లోకి వెళ్లక ముందే ప్రాణాలు వదులుతున్న వైనం

ఆఖరి నిమిషంలో వస్తున్న రోగులతో కొత్త సమస్యలు


(హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రతినిధి, ఆంధ్రజ్యోతి): కొద్ది రోజుల క్రితం కొవిడ్‌ అనుమానితురాలు ఒకరు తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలతో ఉస్మానియా ఆస్ప త్రికి వెళ్లారు. అప్పటికే ఆమెను పలు ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లినా ఎవరూ చేర్చుకోలేదు. దీంతో ఉస్మానియా ఆస్ప త్రికి తీసుకెళ్లగా, అక్కడి సిబ్బంది ఆమెను వార్డుకు తీసుకె ళ్లారు. ఆమె అక్కడి పరిస్థితుల్ని చూసి భయపడిపోయారు. తనను వెంటనే బయటకు తీసుకెళ్లమని కుటుంబసభ్యుల్ని కోరారు. బలవంతం మీద తీసుకెళ్లిన తర్వాత ఆమె చనిపో యారు. మరణం ముంచుకొచ్చిన వేళలోనూ ఉస్మానియాలో వైద్యం చేయించుకునేందుకు నిరాకరించిన వైనం కలకలం సృష్టించింది. ఇలాంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఉస్మాని యా ఆస్పత్రిలో ఏం జరుగుతోంది? పరిస్థితులు ఎలా ఉన్నా యి? రోగులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? ఉస్మాని యాకు వెళ్లిన అనుమానితులు ఎక్కువమంది మరణించటా నికి కారణం ఏమిటి? ఆస్పత్రిలో అసలేం జరుగుతోందన్న అంశాలను ‘ఆంధ్రజ్యోతి‘ ప్రత్యేకంగా పరిశీలించింది. లోటుపాట్లపైనా దృష్టి సారించింది. ఈ సందర్భంగా సరికొత్త విషయాలు బయటకు వచ్చాయి.


ఉస్మానియాకు వచ్చే కేసుల్లో అత్యధిక భాగం రోగ తీవ్రత ఎక్కువగా ఉన్నవారు కావటం గమనార్హం. కొవిడ్‌ అనుమానిత లక్షణాలు తీవ్రస్థాయిలో ఉండటం, అప్పటివర కూ ఎక్కడా టెస్టు చేయించుకోకుండా ఉన్నవారు వస్తున్నా రు. దీంతో, వారికి వైద్యం చేయటం వైద్యులకు తలకు మిం చిన భారంగా మారింది. పేరుకు అనుమానితులే కానీ, రోగ లక్షణాలు తీవ్రమైన పరిస్థితుల్లోనే వస్తున్న వారే ఎక్కువ.


గణాంకాలు చెప్పేది ఇదే..

అనుమానిత లక్షణాలతో ఉస్మానియాకు వచ్చే వారికి ఓవైపు చికిత్స చేస్తూనే, మరోవైపు నిర్ధారణ పరీక్ష చేస్తు న్నారు. ఫలితాలు వచ్చేందుకు రెండు నుంచి మూడు రోజులు పడుతోంది. అప్పటికే వైరస్‌ లోడ్‌ ఎక్కువైన తర్వా త ఆస్పత్రిలో చేరడంతో వారి పరిస్థితి ఇబ్బందికరంగా మా రుతోంది. ఉస్మానియాలో చేరిన రోగుల్లో పది మందికి పరీక్షలు చేయగా, ఏడెనిమిది మందికి పాజిటివ్‌గా తేలడం ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. మరో విషాదకరమైన విష యం ఏమంటే పరీక్ష చేసి ఫలితాలు వచ్చే లోపు ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారు కూడా ఎక్కువేనని చెప్పాలి. అనధి కారిక వర్గాల సమాచారం ప్రకారం పాజిటివ్‌గా ఫలితాలు రాకముందే మరణిస్తున్న వారు రోజుకు పది నుంచి పదిహే ను మంది వరకు ఉంటున్నట్లు తెలుస్తోంది.


పడకలు తక్కువ.. రోగులు ఎక్కువ

ఉస్మానియాను మొదట్నించి కొవిడ్‌ ఆస్పత్రిగా పరిగణిం చలేదు. రోగుల సంఖ్య పెరుగుతున్న వేళ పాజిటివ్‌గా తేలిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. అనుమానితులుగా ఉన్న వారిని ఉస్మానియాతోపాటు ఫీవర్‌, కింగ్‌ కోఠి తదితర  ఆస్పత్రుల్లో చేర్చుకొని చికిత్స చేస్తున్నారు. నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన వెంటనే వారిని గాంధీకి తరలిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మూడు అంబులెన్సులను ఏర్పాటు చేశారు. ఉస్మానియాలో తొలుత పదిహేను పడకలతో కొవిడ్‌ అనుమానితుల కోసం వార్డును సిద్ధం చేశారు. రోగుల తాకి డి పెరిగే కొద్దీ పడకల్ని పెంచారు. ప్రస్తుతం 79 పడకలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం మూడు వార్డుల్లో సేవలు అందిస్తున్నారు. అనుమానితులను ఒక వార్డులో, ఇతర అనా రోగ్య సమస్యలతోపాటు లక్షణాలు ఉన్న వారిని మరో వార్డు లో, అత్యవసర సేవలు అవసరమైన  అనుమానితుల కోసం ఇంకో వార్డును ఏర్పాటు చేశారు. ఈ మూడు వార్డుల్లో 79 పడకలు మాత్రమే ఉన్నా, తొంభై వరకు పేషెంట్లు ఉన్నారు.  వీరితో పాటు వైద్యసేవల కోసం మరికొందరు ఎదురుచూస్తున్న పరిస్థితి.


గోల్డెన్‌ అవర్‌లో వస్తున్నోళ్లే ఎక్కువ..

 ఉస్మానియాకు ఆఖరి క్షణాల్లో వస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అప్పటికే బెడ్లు ఖాళీగా లేకపోవటం, ఆఖరి గంటల్లో వచ్చే వారికి వైద్యం అందించలేక విమర్శ లకు గురి అవుతున్న వైనాలూ పెరుగుతున్నాయి. ‘‘శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఒక పేషెంట్‌ వచ్చా డు. అప్పటికే కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నాయి.  శ్వాస సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు రక్తంతో కూడిన వాంతి చేసుకున్నాడు. అతనికి అత్యవసరంగా వైద్యం చేయటానికి బెడ్లు ఖాళీగా లేవు. అప్పటికే బెడ్ల కోసం ఎదురుచూస్తున్న వారు ఐదారుగురికి మించే ఉన్నారు. ఇలాంటప్పుడు మేమేం చేయాలి?’’ అంటూ ఒక వైద్యుడు ఆవేదన వ్యక్తం చేశారు.


కుటుంబ సభ్యులతోనూ సమస్యే

ఉస్మానియా కొవిడ్‌ ఆస్పత్రి కాకున్నా, ప్రస్తుత పరిస్థితు ల్లో  ఆ విధివిధానాల్ని తూచా తప్పకుండా పాటించాల్సిందే. కానీ, అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తాయి. రెండో ఫ్లోర్‌లో ప్రతి వార్డులోనూ ఒక్కో పేషెంట్‌ వెంట కనిష్ఠంగా ఇద్దరు, గరిష్ఠంగా నలుగురు ఉన్నారు. వారు రోగికి అత్యంత సమీపంగా ఉండటం, అక్కడే భోజనాలు చేయటం, నిద్ర పోవటం లాంటివి చేస్తున్నారు. వైరస్‌ అధికంగా ఉండే ఈ వార్డుల్లో పీపీఈ కిట్లు లేకుండా వైద్యులు, వైద్య సిబ్బంది వెళ్లే సాహసం చేయని చోట రోగి సంబంధీకులు కేవలం  మాస్కులతో అక్కడే ఉండటం చూస్తే షాక్‌ తినాల్సిందే.


కట్టడి సాధ్యం కాదా?

రోగుల వెంట ఉండే వారి సంబంధీకులు తాము వెంట ఉన్న వారు వైరస్‌తో నిండి ఉన్నారన్న విషయాన్ని పట్టన ట్లుగా వ్యవహరిస్తున్నారు. ‘‘మీరింత దగ్గరగా ఉన్నారు. మా స్క్‌ మాత్రమే పెట్టుకున్న మీకు ముప్పుంది కదా?’’ అన్న ప్రశ్నకు వారి సమాధానం విస్మయానికి గురి చేస్తోంది. ‘‘పాజిటివ్‌ అని రిపోర్టు రాలేదు కదా?’’ అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. రిపోర్టు పాజిటివ్‌ వస్తే మీకు ప్రమాదం కదా? అన్న ప్రశ్నకు ‘‘అంత దూరం ఆలోచించటం లేదు. ఇలా ఎలా వదిలేసి వెళతాం. పాజిటివ్‌ వచ్చిన తర్వాత చూద్దాం’’ అంటున్నారు. వాస్తవానికి కొవిడ్‌ పేషెంట్లకు కానీ, అనుమా నితులకు కానీ వైద్యం అందించే సమయంలో ఎవరూ వెంట ఉండకూడదు. అందుకు భిన్నంగా ఉస్మానియాలో పెద్ద ఎత్తున రోగులతోపాటు, వారి సంబంధీకులు ఉంటున్నారు. వీరంతా బయటకు వెళ్లి వస్తున్నారు. ఒక రకంగా వైరస్‌ వాహకాలుగా వారు మారుతున్నారన్న విషయాన్ని అక్కడి వైద్యులు అంగీకరిస్తున్నారు. ‘‘మేం ఎంతగానో చెబుతున్నాం.  మా మాట వినటం లేదు. గట్టిగా చెబితే గొడవకు దిగుతున్నారు. మేమేం చేయలేకపోతున్నాం. సెక్యూరిటీ మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే కట్టడి సాధ్యం.  కఠినంగా వ్యవహరిస్తేనే రోగి సం బంధీకుల్ని వార్డుల్లోకి రాకుండా చేయగలం. అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం’’ అంటూ తమ అశక్తతను వ్యక్తం చేశారో ఉస్మానియా అధికారి.


ఇప్పుడు పరామర్శ.. తర్వాత అనారోగ్యం

అనుమానితుల వెంట ఉన్న వారి నిర్లక్ష్యం ఆయా కుటుం బాలను ప్రమాదంలోకి నెట్టేస్తోంది. అదే సమయంలో కేసుల సంఖ్య అంతకంతకూ విస్తరించటానికి కారణమవుతోంది. అనుమానితులకు సన్నిహితంగా ఉన్న వారు తర్వాతి రోజు ల్లో పేషెంట్లుగా వస్తున్న చాలామందిని తాము చూస్తున్నట్లు ఉస్మానియా సిబ్బంది కొందరు పేర్కొంటున్నారు. ‘‘మాకన్నా చదువుకున్నోళ్లు ఇక్కడికి వస్తారు. వైరస్‌తో ఎంత డేంజరో మాకంటే వాళ్లకే బాగా తెలుసు. కానీ, వారు పట్టించుకోరు. ఇప్పుడేమో తమ వారి కోసం ఆరాటపడతారు. తర్వాత వీరి కోసం ఇంకొకరు వీరి మాదిరే వస్తున్నారు. ఇదో గొలుసులా మారుతోందే తప్పించి ఇది తెగడం లేదు’’ అని పేర్కొన్నారు.


ఆర్తనాదాలు.. ఆవేదన దృశ్యాలు

కొవిడ్‌ లక్షణాలతో ఉస్మానియాకు వస్తున్న వారిలో ఎక్కు వమంది తీవ్ర అనారోగ్యంతో ఉండటంతో వారి అరుపులు.. ఆర్తనాదాలు ఆవేదనతో ఉంటున్నాయి. వారి పరిస్థితిని చూస్తున్న పేషెంట్ల కుటుంబ సభ్యులు సైతం పెద్ద ఎత్తున విలపిస్తున్న దృశ్యాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. దీంతో, మిగిలిన పేషెంట్లు భయాందోళనకు గురవుతున్నారు.  తమ కళ్ల ముందే విలవిలలాడుతున్న పేషెంట్ల తీరుకు.. కుటుంబ సభ్యుల ఆవేదన తోడు కావటంతో ఉద్విగ్నభరిత మైన వాతావరణం చోటు చేసుకుంటోంది. ఇలాంటి సమయాల్లో రోగులకు వైద్యం చేయటం వైద్యులకు, వైద్య సిబ్బందికి ఇబ్బందిగా మారుతోంది.


కనిపించని ప్రభుత్వ వ్యూహం

గాంధీ ఆస్పత్రి కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చిన నేపథ్యంలో  నగరంలోని మిగిలిన ఆస్పత్రుల్లో కొన్నింటికి కొవిడ్‌ అను మానితులకు వైద్యం చేయటానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. అయితే.. కొవిడ్‌ ప్రొటోకాల్‌ను పక్కాగా అమలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయటంలో ప్రభుత్వం విఫలమైంద న్న మాట వినిపిస్తోంది. ఉస్మానియా, కింగ్‌ కోఠి ఆస్పత్రితో పాటు ఇంకొన్ని ఆస్పత్రుల్లో కొవిడ్‌ అనుమానితులతో పాటు, మిగిలిన వారు కలిసిపోయి ఉండటం వైరస్‌ వ్యాప్తికి అవకా శం ఇచ్చినట్లు అవుతోంది. అంతేకాదు, రోగి వద్దకు సంబం ధీకులు రాకుండా నిరోధించాలి. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత వైద్యాధికారుల మీద ఉంది. ఆస్పత్రుల వద్దకు వచ్చే వారి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసు కోవాలన్న విషయాలు ప్రొటోకాల్‌ పేరుతో ఉన్నాయే తప్పించి.. ఆచరణకు నోచుకోకపోవటం అసలు సమస్య. ఈ లోపమే.. వైరస్‌ వ్యాప్తికి మరింత అవకాశం ఇస్తోంది.

Updated Date - 2020-07-05T13:43:30+05:30 IST