ఉస్మా‘నయా’ పంచాయితీ.. అడ్డంకులు తొలిగేనా...!?

ABN , First Publish Date - 2022-03-19T12:09:37+05:30 IST

ఉస్మా‘నయా’ పంచాయితీ.. అడ్డంకులు తొలిగేనా...!?

ఉస్మా‘నయా’ పంచాయితీ.. అడ్డంకులు తొలిగేనా...!?

  • నూతన భవన నిర్మాణానికి.. 
  • పాత భవన పటిష్టతను పరిశీలించేందుకు ప్రభుత్వ కమిటీ
  • 15 రోజుల్లో నివేదిక 

హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్‌ : శతాబ్ద కాలంగా పేద ప్రజలకు సేవలందించిన ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం కూల్చివేత వ్యవహారం మళ్లీ చర్చల్లోకి వచ్చింది.  ప్రభుత్వం తాజాగా భవన పటిష్టతను పరిశీలించేందుకు కమిటీని నియమించడంతో ఈ వ్యవహారం ఇప్పటికైనా ఓ కొలిక్కి వస్తుందా, లేక గతంలో మాదిరిగానే మళ్లీ మరుగున పడుతుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 


నిజాం కాలంలో నిర్మించిన ఉస్మానియా పాత భవనం శిథిలావస్థకు చేరడంతో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న ఆరెకరాల స్థలంలో నూతన భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. సీఎం రోశయ్య నూతన భవన నిర్మాణానికి నిధులు సైతం మంజూరు చేశారు. తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల కారణంగా ఆ నిధులు ల్యాప్స్‌ అయ్యాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ 2015 జూలై 21న ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించి వారం రోజుల్లో పాత భవనాన్ని పూర్తిగా ఖాళీ చేయించి వెంటనే రెండు టవర్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు హామీ ఇచ్చారు. పాత భవనాన్ని కూల్చవద్దంటూ కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హామీ కార్యరూపం దాల్చలేదు. 


పటిష్టత వైపా.. కూల్చివేత వైపా?

రెండోసారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్‌ మొదటిసారి ఉస్మానియాను సందర్శించి పాత భవనం మరమ్మతుల పనులు చేపడుతున్నట్లు ప్రకటించారు. ఆగాఖాన్‌ ట్రస్ట్‌ సహకారంతో పనులు మొదలు పెట్టేందుకు రూ.25 కోట్లు మంజూరు చేసి పాత భవనంలోని రోగులను సగం వరకు ఇతర భవనాల్లోకి తరలించారు. ఆగాఖాన్‌ ట్రస్ట్‌ వేరే  కాంట్రాక్ట్‌లతో బిజీగా ఉండడంతో తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది. దీంతో చేసేది లేక టెండర్లకు వెళ్లేందుకు సిద్ధమైనప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. ఇది జరిగిన కొద్ది కాలానికే జూలై 14, 2020న కురిసిన భారీ వర్షం కారణంగా ఉస్మానియా పాత భవనంలోకి పూర్తిగా వర్షపు నీరు చేరింది. ప్రభుత్వం స్పందించి రోగులను ఇతర భవనాల్లోని వార్డులకు తరలించింది. అనంతరం భవనాన్ని పూర్తిగా సీజ్‌ చేసింది.


రెండేళ్లుగా ఖాళీగా ఉన్న పాత భవనాన్ని కూల్చి వేసి అదే స్థలంలో ట్విన్‌ టవర్స్‌ నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టగా కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. భవనాన్ని కూల్చరాదని కొందరు, కూల్చాలంటూ మరికొందరు కేసులు వేయడంతో ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలోకి వెళ్లింది. తాజాగా ప్రభుత్వం ఆర్‌అండ్‌బీ, ఎంఏ అండ్‌ యూడీ విభాగం, పంచాయితీరాజ్‌ అండ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ విభాగపు చీఫ్‌ ఇంజినీర్లతోపాటు జీహెచ్‌ఎంసీ చీఫ్‌ సిటీ ప్లానర్లతో ఈనెల 10న ఓ కమిటీని నియమిస్తూ జీవో జారీ చేసింది. ఈ కమిటీ ఉస్మానియా పాత భవనాన్ని కూల్చాలని నివేదిక ఇస్తే, మరో కమిటీ వేస్తామని న్యాయస్థానం తాజాగా చెప్పడంతో చర్చ జరుగుతోంది. పాత భవనాన్ని కూల్చివేసేందుకు మొగ్గు చూపుతారా, లేక అదే భవనాన్ని పటిష్టం చేసి ఇతర అవసరాలకు వినియోగంలోని తీసుకువస్తారా? అనేది ఆస్పత్రి వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.


ఆరెకరాల్లో నిర్మాణం జరిగేనా..?

పాత భవనం వ్యవహారం కోర్టు పరిధిలో ఉండడంతో ఖాళీ స్థలంలో నూతన భవనం నిర్మించాలని పలువురు వైద్య సిబ్బంది కోరుతున్నారు. 27 ఎకరాల స్థలంలో ఉన్న ఉస్మానియా ఆస్పత్రిలో ప్రస్తుతం ధోబీ ఘాట్‌ ప్రాంతంలో ఆరెకరాల స్థలం ఖాళీగా ఉంది. స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌, బీఎస్సీ నర్సింగ్‌ హాస్టల్‌ భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. వీటిని కూల్చేసి ధోబీ ఘాట్‌ మొదలుకొని క్యూక్యూడీసీ భవనం వరకు మొత్తం ఆరెకరాల స్థలంలో నూతన భవనం నిర్మిస్తే మరో వెయ్యి పడకల భవనం అందుబాటులోకి వస్తుందని ఆస్పత్రి అధికారులు భావిస్తున్నారు. 

Updated Date - 2022-03-19T12:09:37+05:30 IST