Osmania university వీసీ కీలక నిర్ణయం.. ఇదే జరిగితే...!!

ABN , First Publish Date - 2021-07-31T17:20:09+05:30 IST

ఉస్మానియా యూనివర్సిటీలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా...

Osmania university వీసీ కీలక నిర్ణయం.. ఇదే జరిగితే...!!

  • ఉద్యోగ ఆధారిత కోర్సులకు ప్లాన్‌
  • ఆధార్‌తో విద్యార్థులకు యూనిక్‌ కోడ్‌
  • అడ్డదారులను మూసేస్తాం
  • కొవిడ్‌-19తో తగ్గిన విదేశీ విద్యార్థులు
  • రోడ్‌మ్యాప్‌ ప్రకటించిన వీసీ డి.రవీందర్‌

హైదరాబాద్‌ సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగ ఆధారిత కోర్సులకు ప్లాన్‌ చేస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని ఓయూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ డి.రవీందర్‌ తెలిపారు. వర్సిటీలోని విద్యార్థులను సివిల్‌ సర్వీసె్‌సకు సన్నద్ధం చేయడానికి ప్రత్యేక శిక్షణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇతర వర్సిటీలోని ఫీజుల కంటే ఉస్మానియా వర్సిటీలో పలు కోర్సుల ఫీజులు చాలా తక్కువగా ఉన్నాయని, ఆయా కోర్సుల ఫీజులను పెంచి ఆదాయం పొందేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉస్మానియా వర్సిటీలోని గెస్ట్‌ హౌజ్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన యూనివర్సిటీ అభివృద్ధికి రోడ్‌ మ్యాప్‌ను ప్రకటించారు. 


రాబోయే రోజుల్లో యూనివర్సిటీని ఉన్నతస్థాయిలో నిలిపేందుకు, అత్యున్నతమైన న్యాక్‌ గుర్తింపు వచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉస్మానియా వర్సిటీకి వందేళ్లు పూర్తయిన సందర్భంగా సెంచురీ మెమోరియల్‌ భవనం లేదని, ఇందుకోసం ప్రత్యేకంగా ప్లాన్‌ చేశామని, వందేళ్ల నాటి రికార్డులను డిజిటలైజ్‌ చేయడంతో పాటు ఆర్ట్స్‌, సైన్స్‌ ఇలా అన్ని విభాగాల డేటాను సెంట్రలైజ్‌ చేస్తామని చెప్పారు. యూనివర్సిటీలో అడ్మిషన్‌ పొందిన విద్యార్థుల ఆధార్‌ నెంబర్‌తో యూనిక్‌ కోడ్‌ తీసుకోస్తామని, ఆ కోడ్‌ ఆధారంగా స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తు నుంచి హాస్టల్‌కు, మెస్‌కు తదితర అవసరాలకు వినియోగించేందుకు వీలుగా రూపొందిస్తామని చెప్పారు.


యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకుల పరిశోధనలు విస్తృతపరిచేందుకు చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా పరిశోధనలు ప్రజలకు తెలిసేవిధంగా పారదర్శకత చేపడతామని చెప్పారు. పరిశోధనలపై రిసర్చ్‌ ఛైర్‌ ఏర్పాటు చేయడానికి అవసరమైన నిధుల సహకారం కోసం అలూమినీ నరోత్తంరెడ్డి ముందుకొచ్చారని తెలిపారు. యూనివర్సిటీ భూములు, స్థలాలను పూర్తిగా డిజిటలైజ్‌ చేస్తామని, ఏమాత్రం ఆక్రమణకు గురవ్వకుండా తగిన చర్యలు చేపడుతామని చెప్పారు. యూనివర్సిటీలోకి వచ్చే దారులన్నీ మూసేసి కేవలం ప్రధాన ద్వారం నుంచే ప్రవేశ, నిష్క్రమణకు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థుల నుంచి ప్రొఫెసర్ల వరకు ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన పాస్‌లను జారీ చేస్తామని, బయటి వ్యక్తులకు ఇతర వాహనాలకు వర్సిటీలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. 


యూనివర్సిటీలోని భవనాలను మరమ్మతులు చేయడంతోపాటు హ్యూమన్‌ క్యాపిటల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 500ల మంది విద్యార్థులకు సరిపడా ప్రత్యేకంగా రీడింగ్‌ రూమ్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనున్నామన్నారు. కరోనా మహమ్మారి కారణంగా విదేశీ విద్యార్థులు తగ్గారని, సాధారణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత విదేశీ విద్యార్థులను ఆకర్షించే విధంగా చర్యలు చేపడతామని చెప్పారు. త్వరలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని, ఇందుకు ఇప్పటికే ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు.  ఈ సమావేశంలో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ, ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ శ్రీరాం వెంకటేశ్‌ తదితరులు పాలొన్నారు.

Updated Date - 2021-07-31T17:20:09+05:30 IST