Jul 23 2021 @ 22:10PM

సీఎం స్టాలిన్ కోరికను ధిక్కరిస్తోన్న హీరో

తమిళ చిత్రపరిశ్రమలో ఘనవిజయాలు సొంతం చేసుకున్న సినిమాలకు కథ, మాటలు సమకూర్చిన మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి. ఈయన సినీ వారసులుగా రాణిస్తున్న ఆయన మనవళ్లు ఉదయనిధి, అరుళ్‌నిధి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కరుణానిధి ఉన్న సమయంలో సినిమాలకు తమిళ పేర్లు మాత్రమే పెట్టేలా చర్యలు తీసుకున్నారు. అలాంటి సినిమాలకు రాయితీలిచ్చి ప్రోత్సహించారు కూడా. అయితే, ఒకే దేశం ఒకే పన్ను చట్టమైన జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత సినిమాలకు పన్ను రాయితీ లేకుండా పోయింది. దీంతో నిర్మాతలు తమ చిత్రాలకు ఇతర భాషల పేర్లను కూడా పెడుతున్నారు. ముఖ్యంగా ఆంగ్ల టైటిల్స్‌తో సినిమా పేర్లు ఖరారు చేస్తున్నారు. 


ఈ నేపథ్యంలో ప్రస్తుతం కరుణానిధి తనయుడు స్టాలిన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన కూడా సినిమాలకు తమిళంలోనే పేర్లు పెట్టాలని కోరుతున్నారు. కానీ, కరుణానిధి కుటుంబానికి చెందిన హీరో అయిన అరుళ్‌నిధి తాజాగా ప్రకటించిన మూడు చిత్రాలకు ఇతర భాష పేర్లనే పెట్టారు. ఇందులో రెండు ఆంగ్ల టైటిల్స్‌ కాగా, మరొకటి ఫ్రెంచ్‌ టైటిల్‌. వీటిలో ఒక చిత్రానికి ‘డైరీ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ చిత్రం టీజర్‌ కూడా ఇటీవల రిలీజైంది. రెండో చిత్రానికి ‘డి బ్లాక్‌’ అనే పేరు పెట్టగా, మూడో చిత్రానికి ‘డెజావు’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఇది ఫ్రెంచ్‌ పదం. గతంలో అగ్రహీరో విజయ్‌ తన చిత్రాలకు వరుసగా ఆంగ్ల పేర్లు పెట్టడంతో విమర్శలు వచ్చాయి. ఇపుడు అరుళ్‌నిధి చిత్రాలకు తమిళ టైటిల్స్‌ పెట్టకపోవడం కూడా కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Otherwoodsమరిన్ని...