ఇతరుల కష్టములెవ్వడెరుగునో...

ABN , First Publish Date - 2020-10-02T07:07:45+05:30 IST

లక్ష్మణాచార్య రచించిన శ్రీ నామరామాయణం నుంచి స్వీకరించిన ‘రఘుపతి రాఘవ రాజారాం’ భజన మహాత్ముడి నోట సర్వదా వినిపించేది. అలాగే ఆయనకు ప్రీతిపాత్రమైన మరో భజన గీతం ‘వైష్ణవ జనతో’...

ఇతరుల కష్టములెవ్వడెరుగునో...

  • నేడు గాంధీ జయంతి


‘‘నా మతానికీ, అభిమతానికీ ఆధారం సత్యం, అహింస. సత్యమే దైవం. దాన్ని సాకారం చేసుకొనే మార్గం అహింసే! ప్రపంచానికి నేను కొత్తగా చెప్పేదేమీ లేదు. సత్యం, అహింస పర్వతాలంత పురాతనమైనవి. నేను చేసిందల్లా ఆ రెండిటి మీదా నాకు వీలైనన్ని ప్రయోగాలకు ప్రయత్నించడమే!’’ అని ప్రకటించిన మహనీయుడు మహాత్మా గాంధీ. 


లక్ష్మణాచార్య రచించిన శ్రీ నామరామాయణం నుంచి స్వీకరించిన ‘రఘుపతి రాఘవ రాజారాం’ భజన మహాత్ముడి నోట సర్వదా వినిపించేది. అలాగే ఆయనకు ప్రీతిపాత్రమైన మరో భజన గీతం ‘వైష్ణవ జనతో’.  పదిహేనవ శతాబ్దంలో గుజరాతీ కవి నరసింహ్‌ మెహతా సంస్కృతంలో రచించిన ఈ గేయాన్ని ప్రతిరోజూ పూజా సమయంలో మహాత్మా గాంధీ వినేవారు. ఎందరో గొప్ప సంగీతకళాకారులు ‘వైష్ణవ జనతో’ను ఆలపించారు. మహాత్ముని 150వ జయంతి సందర్భంగా 2018లో 124 దేశాలకు చెందిన గాయకులు ఈ భజనను ఆలపించడం ఒక రికార్డు. సరస్వతీ పుత్రుడిగా ఖ్యాతి పొందిన పుట్టపర్తి నారాయణాచార్యులు ఆలిండియా రేడియో కోసం ఈ గేయాన్ని సుమారు యాభయ్యేళ్ళ కిందట తెలుగులోకి అనువదించారు. ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు వోలేటి వెంకటేశ్వరులు గానం చేశారు.

బాపూజీ గీతం!

వైష్ణవ జనతో తేనే కహియే

జే పీడ పరాయీ జాణే రే

పర దుఃఖే ఉపకార కరే తో యే

మన అభిమాన న ఆణే రే...


పుట్టపర్తివారి అనువాదంలో స్పష్టంగా లభ్యమవుతున్న నాలుగు చరణాలు ఇవి:


ఇతరుల కష్టములెవ్వడెరుగునో 

అతడే వైష్ణవుడూ.. అతడే వైష్ణవుడూ..

సతతము పరులకు సాయము చేయుచు 

గతి తానేయని గర్వము పడడో

అతడే వైష్ణవుడూ... అతడే వైష్ణవుడూ..


సకల లోకముల సన్నుతి చేయుచు

అపనిందలచే అపచారము చేయడొ

మనసున వాక్కున నిశ్చలుడెవ్వడో

యోగ్యురాలతని కన్న జననియే

అతడే వైష్ణవుడూ... అతడే వైష్ణవుడూ..


సర్వము సమముగ ఎవ్వడెంచునో

ఆశవీడి పర స్త్రీ మాతగ చూచునో

నాలుక వ్రీలిన అసత్యము పల్కడో

పరధనమునకై పాకులాడడో

అతడే వైష్ణవుడూ... అతడే వైష్ణవుడూ..


మోహము మాయయు మనమున నుండవో

గృహ వైరాగ్యము ధ్రువముగ కుదురునో

రామ నామమున లీనుడై పోవునో

రాజిల్లు వాని లో సకల క్షేత్రములు

అతడే వైష్ణవుడూ... అతడే వైష్ణవుడూ..

Updated Date - 2020-10-02T07:07:45+05:30 IST