Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఓటీఎస్‌ నిలుపుదల చేయాలని వాకౌట్‌

మండపేట, నవంబరు 29: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరిట లబ్ధిదారుల నుంచి ఓటీఎస్‌ పేరిట రుణ బకాయిలు వసూలు చేయడాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ సభ్యులు వాకౌట్‌ చేశారు. చైర్‌పర్సన్‌ పతివాడ నూకదుర్గారాణి అధ్యక్షతన మండపేట మునిసిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం సోమవారం జరిగింది.  ఓటీఎస్‌ పేరిట బలవంతంగా వసూళ్లు చేస్తున్నారని టీడీపీ కౌన్సిలర్లు కాళ్లకూరి స్వరాజ్యభవాని, యారమాటి గంగరాజు తదితరులు ఆరోపించారు. దీనిపై కమిషనరు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని పట్టుబట్టారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కూడా కలుగజేసుకుని ఓటీఎస్‌పై స్సష్టత ఇవ్వాలని కమిషనరును కోరారు. దీనికి కమిషనరు రామ్‌కుమార్‌ సమాధానం ఇస్తూ తాము ఎవరినీ బలవంతపెట్టడం లేదని, ప్రభుత్వ ఆదేశాల మేరకే కట్టించుకుంటున్నారని సమాధానం చెప్పారు. దీనికి సంతృప్తి చెందని సభ్యులు కమిషనరును నిలదీశారు. ఎమ్మెల్యే కూడా పలు ప్రశ్నలు సంధించారు. ఓటీఎస్‌ చెల్లించిన లబ్ధిదారునికి ఇల్లు రిజిస్ట్రేషన్‌ అవుతుందా, బ్యాంకు రుణం ఇస్తుందా అని కమిషనరును అడిగారు. నగదు చెల్లించిన వారికి రిజిస్ట్రేషన్‌ అవుతుందని, ఆ ప్రక్రియను త్వరలో చేపడతామని కమిషనరు చెప్పారు. దీనిని నిరసిస్తూ టీడీపీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే వాకౌట్‌ చేశారు. టిడ్కో గృహాలకు సంబంధించి కూడా టీడీపీ సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. చైర్‌పర్సన్‌ నూకదుర్గారాణి మాట్లాడుతూ ఓటీఎస్‌ ద్వారా మేలు చేయాలని చూస్తుంటే టీడీపీ సభ్యులు అడ్డుపడడం సరికాదన్నారు. వైసీపీ కో-ఆప్షన్‌ సభ్యుడు రెడ్డి రాధాకృష్ణ మాట్లాడుతూ ఓటీఎస్‌పై అభిప్రాయం చెప్పకుండానే సమావేశం నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్‌ చేయడం దారుణమన్నారు. పట్టణంలో దోమలు, కుక్కల  నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పలువురు కౌన్సిలర్లు కోరారు. సమావేశంలో వైస్‌ చైర్మన్లు పిల్లి గణేశ్వరరావు, వేగుళ్ల నారయ్యబాబు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement