ఓటీఎస్‌ను రద్దుచేయాలి

ABN , First Publish Date - 2021-12-07T06:31:56+05:30 IST

ఓటీఎస్‌ పేరుతో ప్రభుత్వం పేదలను దోపిడీ చేస్తోందని పలుప్రాంతాల్లో టీడీపీ నేతలు విమర్శించారు.

ఓటీఎస్‌ను రద్దుచేయాలి
ఒంగోలులోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న టీడీపీ శ్రేణులు

జిల్లావ్యాప్తంగా టీడీపీ నిరసనలు 

అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు

పేదలను ప్రభుత్వం దోపిడీ చేస్తున్నదని విమర్శ

ఒంగోలు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఓటీఎస్‌ పేరుతో ప్రభుత్వం పేదలను దోపిడీ చేస్తోందని పలుప్రాంతాల్లో టీడీపీ నేతలు విమర్శించారు. అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకొని టీడీపీ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా తెలుగుతమ్ముళ్లు సోమవారం రాజ్యాంగ నిర్మాత విగ్రహాలకు వినతిపత్రాలు అందజేసి నిరసన తెలిపారు. ఎర్రగొండపాలెంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు, జడ్పీ మాజీ వైస్‌చైర్మన్‌ డాక్టర్‌ మన్నే రవీంద్ర పాల్గొన్నారు. గిద్దలూరులో మాజీ ఎమ్మెల్యే ఎం.అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో ఓటీఎస్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఒంగోలులోని హెచ్‌సీఎం ఎదుట ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో టీడీపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి జి.రాజ్‌విమల్‌, మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ పాల్గొన్నారు. తాళ్లూరు ఎస్సీ కాలనీలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద దర్శి ఇన్‌చార్జి పమిడి రమేష్‌, పామూరులో మాజీ జడ్పీటీసీ బొల్లా మాల్యాద్రి   ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. కనిగిరి, వెలిగండ్ల, టంగుటూరు అద్దంకి, పర్చూరు, మార్టూరు, ఇంకొల్లు, ఎస్‌ఎన్‌పాడు, కొండపి, యద్దనపూడి తదితర పలు పట్ఠణాలు, మండల కేంద్రాల్లో టీడీపీశ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ  ఇళ్ల లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం బలవంతంగా వసూళ్లకు పాల్పడుతుందని మండిపడ్డారు. ఓటీఎస్‌ విధానాన్ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2021-12-07T06:31:56+05:30 IST