Abn logo
Aug 8 2020 @ 23:54PM

టాప్‌లో ఉన్నారండోయ్‌!

Kaakateeya

  • కళాకారులు కోరుకునేది ప్రేక్షకుల కరతాళ ధ్వనులే!
  • కోట్లాదిమంది చూసే వెండితెర చిత్రాలు అయితేనేం?
  • కోటానుకోట్లమంది చూస్తున్న వెబ్‌ చిత్రాలు అయితేనేం?
  • కాసులతో పాటు కరతాళ ధ్వనులు తీసుకొస్తాయంటే.... 
  • ‘కమాన్‌... చేసేద్దాం!’ అంటూ ఓటీటీకి ఓటు వేస్తున్నారు!
  • వెండితెరపై స్టార్‌డమ్‌ను పక్కనపెట్టి మరీ...
  • డిజిటల్‌ తెరపై ప్రయోగాలకు ప్రాముఖ్యం  ఇస్తున్నారు!
  • ఓవర్‌ ది టాప్‌ చిత్రాలతో టాప్‌లో ఉన్నారు!


ఇప్పుడు వెండితెర, బుల్లితెర, డిజిటల్‌ తెర వంటి తేడాల్లేవ్‌! ఉన్నదల్లా ఒక్కటే తెర... ప్రేక్షకులు మెచ్చిన, వాళ్లకు నచ్చిన చిత్రం ఏ తెరలో వస్తే అదే మంచి తెర!! కరోనా కాలంలో వెండితెర బోసిపోయింది. అయితేనేం? ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌) వేదికలు ఉన్నాయిగా!!! జీ 5, నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌, ఆహా వగైరా. ప్రస్తుతం వాటిలో చిత్రాలను ప్రేక్షకులు చూస్తున్నారు. తద్వారా ఓటీటీల్లో నటించిన తారలు టాప్‌లో, ట్రెండింగ్‌లో ఉన్నారు. కొందరు కథానాయికలు ఓటీటీ వేదికలలో వినోదం అందిస్తున్నారు. మరికొంతమంది  ఎప్పుడెప్పుడు అందిద్దామా? అని ఎదురుచూస్తున్నారు.


రెండు మూడేళ్ల క్రితం వరకూ వెబ్‌ కోసం రూపొందే చిత్రాల్లో నటించడానికి అగ్ర తారలు సందేహించేవారు. బహుశా... ఓటీటీ చిత్రాల్లో నటిస్తే వెండితెరపై అవకాశాలకు ఆగిపోవచ్చనే అనుమానాలు అందుకు కారణం కావచ్చు. అయితే, ‘లస్ట్‌ స్టోరీస్‌’ అటువంటి అనుమానాలను పటాపంచలు చేసింది. అందులో నటించిన కియారా అడ్వాణీ, భూమి ఫెడ్నేకర్‌ తర్వాత హిందీ చలనచిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికల స్థాయికి వెళ్లారు. ‘సేక్రెడ్‌ గేమ్స్‌’ సైతం ఓటీటీ వైపు ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ రెండిటిలోనూ రాధికా ఆప్టే నటించడం విశేషం.


నాలుగు కథల సంకలనం (యాంథాలజీ)గా ‘లస్ట్‌ స్టోరీస్‌’ రూపొందింది. ప్రతి కథ శృంగార ప్రధానాంశమైనదే. లైంగిక కోరికల నేపథ్యంలో రూపొందినదే. కథానుగుణంగా ఒక్కో కథలో కియారా అడ్వాణీ, భూమి ఫెడ్నేకర్‌, రాధికా ఆప్టే, మనీషా కోయిరాలా బోల్డ్‌ సన్నివేశాల్లో నటించారు. ‘లస్ట్‌ స్టోరీస్‌’ తర్వాతే తెలుగులో... మహేశ్‌బాబు సరసన ‘భరత్‌ అనే నేను’లో సంప్రదాయబద్దమైన తెలుగు అమ్మాయి పాత్రలో కియారా నటించారు. ఆ తర్వాత హిందీలో ‘గుడ్‌ న్యూస్‌’లో సంప్రదాయ పంజాబీ భార్యగా నటించారు. ‘సంజు’లో సంజయ్‌ దత్‌ తల్లి నర్గిస్‌ పాత్రలో మనీషా కోయిరాలా మెప్పించారు. రోజుల వ్యవధిలో విడుదలైనా ‘సంజు’లో మనీషా పాత్రపై ‘లస్ట్‌ స్టోరీ్‌స’లో పాత్ర ప్రభావం పడలేదు. నవతరం ప్రేక్షకులు కథలో పాత్రలను పాత్రలుగా చూస్తారనే ధైర్యాన్ని ‘లస్ట్‌ స్టోరీస్‌’ కథానాయికలకు ఇచ్చింది. దాంతో పలువురు తారలు ప్రయోగాల బాట పట్టారు. కొత్త తరహా కథలు, పాత్రల కోసం ఎదురుచూసే తమలో నటిని సంతృప్తి పరిచే చిత్రాలను చేయడం ప్రారంభించారు.


హిందీలో మూడేళ్ల క్రితమే ఓటీటీ కోసం ప్రత్యేకంగా చిత్రాలు రూపొందించే ధోరణి, ఓటీటీ చిత్రాల్లో కథానాయికలు నటించే ప్రక్రియ మొదలైంది. తెలుగునాట ‘యప్‌ టీవీ ఒరిజినల్స్‌’ కోసం 2017లో దర్శకురాలు నందినీరెడ్డి ‘మన ముగ్గురి లవ్‌ స్టోరీ’ రూపొందించారు. పేరున్న వ్యక్తులు రూపొందించినదీ, చెప్పుకోదగ్గది అదే. శశాంక్‌ ఏలేటి దర్శకత్వం వహించిన ఆ సిరీ్‌సలో తేజస్వి మదివాడ నటించారు. ఆ తర్వాత ‘గ్యాంగ్‌స్టార్స్‌’లో ‘కొత్త బంగారు లోకం’ ఫేమ్‌ శ్వేతా బసు ప్రసాద్‌ నటించారు. అయితే, అగ్ర తారలు ఎవరూ అప్పట్లో ఓటీటీ వైపు చూడలేదు. ఏడాదిన్నరగా ఓటీటీ ట్రెండ్‌ మన తెలుగునాట సైతం ఊపు అందుకుంది. ఇప్పుడిప్పుడే చెప్పుకోదగ్గ స్థాయికి వస్తోంది.


‘ది ఫ్యామిలీ మేన్‌ 2’లో తీవ్రవాదిగా అక్కినేని కోడలు సమంత ప్రతినాయిక పాత్రలో నటించారు. త్వరలో విడుదల కానుందీ సిరీస్‌. ఈ మధ్య తక్కువగా కెమెరా ముందుకొస్తున్న అక్కినేని అమల ‘హై ప్రీస్టె్‌స’లో నటించారు. ‘ఫ్యామిలీ మేన్‌’ తొలి సీజన్‌లో ప్రియమణి నటించారు. మలి సీజన్‌లోనూ ఆమె కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ‘బ్రీత్‌: ఇన్‌టు ది షాడో్‌స’ తో నిత్యా మీనన్‌ ఓటీటీలోకి ప్రవేశించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, కథానాయిక జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన ‘క్వీన్‌’ సిరీ్‌సలో రమ్యకృష్ణ నటించారు. ఆమె జయలలిత పాత్ర పోషించారు. తెలుగు ‘లస్ట్‌ స్టోరీ్‌స’లో ఈషా రెబ్బా ఓ కథలో నటించారు. ‘పిల్ల జమిందార్‌’, ‘భాగమతి’ ఫేమ్‌ అశోక్‌ దర్శకత్వంలో హన్సిక ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారు.  హిందీలో ‘జీ 5’  సిరీస్‌ ‘పాయిజన్‌-2’లో రాయ్‌ లక్ష్మీ, ‘రిజెక్ట్‌ ఎక్స్‌-2’లో ఈషా గుప్తా నటించారు.


ఒరిజినల్‌ తెలుగు కంటెంట్‌పై ‘జీ 5’ దృష్టి పెట్టడం, తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇస్తుండటంతో కొందరు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ‘ఆహా’ సిరీ్‌సల ద్వారా మరికొంతమంది కథానాయికలు ఇటువైపు అడుగులు వేస్తున్నారు. తమిళంలో వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో వైభవ్‌కు జోడీగా కాజల్‌ ఓ వెబ్‌ సిరీస్‌ చేయనున్నారని టాక్‌. అలాగే, ‘క్వాంటికో’ ఇండియన్‌ రీమేక్‌లోనూ కనిపించనున్నారట. ఇప్పుడు అగ్ర తారలు, కథానాయికలు ఓటీటీ చిత్రాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే చేసినవాళ్లు ఓటీటీ రంగంలో తారాస్థాయిలో ఉన్నారు.

సినిమాలు తగ్గాయ్‌... ఓటీటీలోవి వచ్చాయ్‌!

తెలుగునాట సినిమా అవకాశాలు తగ్గినా... కొందరు కథానాయికలకు ఓటీటీ అవకాశాలు మస్తుగా వస్తున్నాయి. ‘కుమారి 21 ఎఫ్‌’తో యువతలో హెబ్బా పటేల్‌కు క్రేజ్‌ ఏర్పడింది. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో విజయాలు, అవకాశాలు రాలేదు. అయితే, ‘మస్తీ్‌స’లో ఆమెకు మంచి అవకాశం వచ్చింది. దీని ద్వారా ప్రేక్షకులు తనను మర్చిపోకుండా చూసుకుంది. ‘ఆవకాయ్‌ బిర్యానీ’తో కథానాయికగా ప్రయాణం ప్రారంభించి, తెలుగులో కొన్ని చిత్రాలు చేశాక... తమిళ చిత్ర పరిశ్రమకు వెళ్లిన బిందు మాధవి కొంత విరామం తర్వాత ‘మస్తీ్‌స’తో తెలుగు ప్రజలను పలకరించారు. పరభాషా నాయికలకు సైతం ఓటీటీ ద్వారా తెలుగు వీక్షకుల ముందుకొచ్చే అవకాశం దక్కుతోంది. ‘మస్తీ్‌స’తో చాలా రోజుల తర్వాత తెలుగులోకి వచ్చిన కన్నడ భామలు సంయుక్తా హోర్నాడ్‌, అక్షరా గౌడ. గతంలో ప్రకాశ్‌ రాజ్‌ దర్శకత్వం వహించిన ‘ఉలవచారు బిర్యానీ’లో సంయుక్త నటించారు. ఇటీవల ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’లో హీరో సోదరి పాత్ర పోషించారు. ‘మన్మథుడు 2’లో అతిథి పాత్ర చేయడంతో పాటు కొన్ని తమిళ చిత్రాలు చేసిన అక్షరా గౌడకి ‘మస్తీస్‌’ తొలి తెలుగు ఓటీటీ. ‘ఆహా’లో వచ్చిన ‘సిన్‌’ చాలామందిని ఆకట్టుకుంది. నాలుగేళ్ల క్రితం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ హీరోగా పరిచయమైన ‘జాగ్వార్‌’తో కథానాయికగా పరిచమైన దీప్తీ సతి, కొంత విరామం తర్వాత ‘సిన్‌’తో తెలుగు ప్రజల ముందుకొచ్చారు. ‘కొత్త బంగారు లోకం’ ఫేమ్‌ శ్వేతా బసు ప్రసాద్‌, ‘సిద్ధూ ఫ్రమ్‌ సికాకుళం’ ఫేమ్‌ మంజరీ ఫడ్నీస్‌, ‘యువత’ ఫేమ్‌ అక్షా పార్ధసాని సహా అడివి శేష్‌ ‘కిస్‌’, నారా రోహిత్‌ ‘అసుర’లో నటించిన ప్రియా బెనర్జీ తదితరులు ప్రస్తుతం హిందీలో వెబ్‌ సిరీ్‌సలు చేస్తున్నారు. సినిమా రంగంలో విజయాలు అందుకోలేకపోయినా... వెబ్‌ సిరీస్‌లలో అవకాశాలు అందుకుంటున్నారు.


వెయిటింగ్‌!

అగ్ర తారల జాబితాలో సమంత, తమన్నా, కాజల్‌ అగర్వాల్‌ పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోల సరసన వీళ్ళిద్దరూ చిత్రాలు చేస్తున్నారు. అదే సమయంలో ఓటీటీ చిత్రాలు చేయడానికీ సిద్ధమంటున్నారని సమాచారం. తమిళ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీ్‌సలో తమన్నా నటించనున్నారనేది ఏడాది క్రితం వార్త. అది ప్రారంభం కాలేదు. అయితే, తమన్నా ప్రధాన పాత్రలో ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్‌ చేయాలని ‘ఆహా’ చర్చలు జరుపుతోంది. సమంతతో ఓ టాక్‌ షో ప్లాన్‌ చేసింది. ఈ రెండూ త్వరలో ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. వీళ్లిద్దరి ఓటీటీ అరంగేట్రం గురించి ప్రేక్షకులు వెయిటింగ్‌. అలాగే, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌తో ‘ఆహా’ ఓ ఒరిజినల్‌ మూవీ ప్లాన్‌ చేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలో చిత్రీకరణ ప్రారంభం అవుతుందట. మరో ‘ఆహా’ షోలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.


తెలుగమ్మాయిలూ... అదరగొడుతున్నారు!

హిందీలో ‘లస్ట్‌ స్టోరీస్‌’ ట్రెండ్‌ సెట్టర్‌ అయితే... తెలుగులో ‘లూజర్‌’ నెట్టింట ట్రెండ్‌ సెట్టర్‌ అని చెప్పాలి. శృంగార సన్నివేశాలు, అమ్మాయిల అందాల ప్రదర్శన లేకుండా కథ, కథనం, భావోద్వేగాలతో వీక్షకులను ఆకట్టుకోవచ్చని ‘జీ 5’లో ప్రసారమైన ఈ సిరీస్‌ నిరూపించింది. దీని ద్వారా తెలుగమ్మాయిలు కల్పికా గణేశ్‌, కోమలీ ప్రసాద్‌, పావనీ గంగిరెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారు. డిజిటల్‌ తెరపై వెలుగమ్మాయిలుగా నిలిచారు. ‘ఆహా’లో వచ్చిన ‘మస్తీ్‌స’తో మరో ఇద్దరు తెలుగమ్మాయిలు చాందినీ చౌదరి, బిందు మాధవి మెరిశారు. ఒరిజినల్‌ సిరీస్‌ ‘మిస్సెస్‌ సుబ్బలక్ష్మి’తో లక్ష్మీ మంచు వీక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సిరీస్ ను ‘జీ 5’ పలు భాషలలో అనువదించింది. ‘జీ 5’ సిరీస్‌ ‘గాడ్స్‌ ఆఫ్‌ ధర్మపురి’ (గాడ్‌)లోనూ చాందినీ చౌదరి ఆకట్టుకున్నారు. ‘చదరంగం’లో కథానాయికగా చిన్న చిత్రాలు చేస్తున్న తెలుగమ్మాయి రమ్యా పసుపులేటి నటించారు. సాధారణంగా ఇంట గెలిచి రచ్చ గెలవాలని పెద్దలు చెబుతారు. ఓ తెలుగమ్మాయి ఓటీటీ విభాగంలో రచ్చ గెలిచింది. ‘గూఢచారి’లో నటించిన శోభితా ధూలిపాళ్ల గుర్తున్నారు కదా! గత ఏడాది ‘మేడిన్‌ హెవెన్‌’ సిరీ్‌సతో తొలి ఓటీటీ విజయం అందుకున్నారు. ‘బార్డ్‌ ఆఫ్‌ బ్లడ్‌’, ‘ఘోస్ట్‌ స్టోరీ్‌స’లోనూ ఆమె నటించారు. హిందీ చిత్రాలతో కథానాయికగా ప్రయాణం ప్రారంభించిన శోభిత, హిందీ సిరీ్‌సలతోనే ఓటీటీ ప్రయాణం ప్రారంభించారు. పలు విజయాలు అందుకున్నారు. తెలుగులోకి ఎప్పుడు వస్తారో? ‘లస్ట్‌ స్టోరీస్‌’తో తెలుగమ్మాయి ఈషా రెబ్బా ఓటీటీ ఓ వెలుగు వెలగాలని ఆశిస్తున్నారు. త్వరలో ‘ఆహా’లో విడుదల కానున్న యాంథాలజీ ఫిల్మ్‌ ‘మెట్రో కథలు’లో ‘పలాస’ ఫేమ్‌ నక్షత్ర, నందినీ రాయ్‌ నటించారు.

బాలీవుడ్‌ బ్యూటీస్‌... ఓటీటీకి ‘ఓ... యస్‌’!

సీనియర్‌ కథానాయికలు సుస్మితా సేన్‌ మొదలుకుని మనీషా కోయిరాలా, కరీనా కపూర్‌ వరకూ, యువ కథానాయికలు కియారా అడ్వాణీ నుండి స్వర భాస్కర్‌ వరకూ పలువురు బాలీవుడ్‌ బ్యూటీలు ఓటీటీ చిత్రాలకు ‘ఓ... యస్‌’ అంటున్నారు. ‘లస్ట్‌ స్టోరీ్‌స’ తో వెబ్‌ వినోద పరిశ్రమలో కాలు పెట్టిన కియారా, ఆ తర్వాత మరో వెబ్‌ చిత్రం ‘గిల్టీ’ చేశారు. ‘మేడిన్‌ హెవెన్‌’ సహా ‘షాకర్స్‌’, ‘సేక్రెడ్‌ గేమ్స్‌ 2’లో కల్కి కొచ్చిన్‌ నటించారు. ‘మేడిన్‌ హెవెన్‌’తో తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ హిందీలో సత్తా చాటారు. ‘ఇట్స్‌ నాట్‌ దట్‌ సింపుల్‌’ వెబ్‌ సిరీ్‌సలో నటించిన స్వరా భాస్కర్‌, తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌ సిరీస్‌ ‘రసభరీ’లో మెరిశారు. ఈ సిరీ్‌సపై ఓ సన్నివేశాన్ని ఉద్దేశిస్తూ సెన్సార్‌ బోర్ట్‌ ఛైర్మన్‌ ప్రసూన్‌ జోషి ‘బాధ్యతా రాహిత్యమైన కంటెంట్‌’ అని ట్వీట్‌ చేయడం, దానికి స్వర వివరణ చర్చనీయాంశం అయ్యాయి. ఓ వైపు సినిమాలు, మరో వైపు నాటికలు, ఇంకా వెబ్‌ సిరీ్‌సలతో రాధికా ఆప్టే ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ బిజీగా ఉంటారు. ‘లస్ట్‌ స్టోరీస్‌’, ‘సేక్రెడ్‌ గేమ్స్‌’ కంటే ముందు ‘స్టోరీస్‌ బై రవీంద్రనాథ్‌ ఠాగూర్‌’లో ఆమె నటించారు. హారర్‌ సిరీస్‌ ‘ఘోల్‌’ ఆమె ఖాతాలో ఉంది. ఇండియాలో వెబ్‌ సిరీస్‌లు చేస్తున్న నాయికలలో రాధికా ఆప్టే ముందు వరుసలో ఉంటారు. ఇటీవల ‘ఆర్య’ సిరీ్‌సతో మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌ వెబ్‌లో అడుగు పెట్టారు.


-సత్య పులగం

Advertisement
Advertisement