పాఠాలు మానేసిన‌ ప్రొఫె‘సర్స్‌’

ABN , First Publish Date - 2021-07-30T06:40:33+05:30 IST

ఆయనో ప్రొఫెసర్‌. నెలకు లక్షల్లో వేతనం.

పాఠాలు మానేసిన‌ ప్రొఫె‘సర్స్‌’

అకడమిక్‌ నిర్వహణ గాలికి

సుమారు 25 మంది పనితీరు జీరో

హైదరాబాద్‌ సిటీ, జూలై 29 (ఆంధ్రజ్యోతి)

ఆయనో ప్రొఫెసర్‌. నెలకు లక్షల్లో వేతనం. కానీ పాఠాలు బోధించడంపై ఆసక్తి తగ్గింది. భూముల వ్యహారాలు చూసుకునుడే ఎక్కువైంది. ఆన్‌లైన్‌ క్లాస్‌లో కనిపించరు. అడ్మినిస్ర్టేషన్‌ బిల్డింగ్‌లోని ఆఫీసులోనూ కనిపించరు. మొబైల్‌ ఔటాఫ్‌ కవరేజ్‌ ఏరియా. ఇదీ ఉస్మానియా యూనివర్సిటీలో ఓ విభాగ డైరెక్టర్‌ తీరు.

ఈ ఒక్క ప్రొఫెసరే కాదు.. ఉస్మానియా యూనివర్సిటీలోని రెగ్యులర్‌ ప్రొఫెసర్లలో కొందరు పాఠాలు బోధించడం కంటే పాలనా వ్యవహారాలను చూసుకోవడానికే తహ తహలాడుతున్నారు. వారానికి 16 క్లాస్‌లు చెప్పాలనే నిబంధనలకు కూడా కొందరూ ప్రొఫెసర్లు తూట్లు పొడుస్తున్నారు. ఆఫ్‌లైన్‌ క్లాస్‌ల సందర్భంలో అడ్మినిస్ర్టేషన్‌లో వివిధ హోదాలను తగిలించుకొని క్లాస్‌లకు దూరమవ్వగా, ఆన్‌లైన్‌ క్లాస్‌లలోనూ అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. కొందరైతే ఆన్‌లైన్‌ క్లాస్‌లో వీడియోలను అప్‌లోడ్‌ చేసి 45 నిమిషాల క్లాస్‌లను 15 నిమిషాల్లోపే ముగిస్తున్నారు.

ఆ సీట్లపైనే ఆసక్తి

ఓయూకు కొత్తగా వచ్చిన వైస్‌ చాన్స్‌లర్‌ కొన్నేళ్లుగా వివిధ హోదాలతో సీట్లకు అంటిపెట్టుకొని క్లాస్‌ రూమ్‌లకు దూరంగా ఉన్న ప్రొఫెసర్లను తిరిగి తరగతి గదికి తరలించారు. పలువురు ప్రొఫెసర్లకు వివిధ బాధ్యతలను అప్పగించారు. వర్సిటీ పాలనాపరంగా, అకాడమీపరంగా మెరుగైన పనితీరు కనబర్చాలంటే ఎక్కడ ఏ ప్రొఫెసర్‌ను నియమించాలనేది వైస్‌ చాన్సలర్‌దే తుది నిర్ణయం. కానీ కొన్నేళ్లుగా అడ్మినిస్ర్టేషన్‌ పరమైన పలు విభాగాలకు డైరెక్టర్లుగా, ఇన్‌చార్జిలుగా, విభాగాధిపతులుగా ఉంటున్న ప్రొఫెసర్లలో అత్యధికులు తరగతి గదికి సరైన న్యాయం చేయడం లేదనే విమర్శలు వచ్చాయి. తరగతి బోధన కంటే ప్రత్యేక చాంబర్లలోని సీట్లపైనే ఆసక్తి చూపుతున్నారు. ఆ సీట్ల కోసం ఉన్నతస్థాయిలో, అవసరమైతే పలుకుబడి కలిగిన నేతలతో పైరవీలు చేసుకుంటున్నారు.

కమిటీ ప్రశ్నలకు సమాధానాలు కరువు

వర్సిటీలోని అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్లకు పదోన్నతులు కల్పించడానికి ఇటీవల కెరీర్‌ అడ్వాన్స్‌ స్కీమ్‌ (సీఏఎస్‌)ను నిర్వహించారు. ఉన్నత స్థాయి కమిటీ పలువురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను, అసోసియేట్‌ ప్రొఫెసర్లను ఇంటర్వ్యూలు చేసింది. ఆయా సబ్జెక్టుల వారాగా, వారు రచించిన పలు జర్నల్స్‌ ఆధారంగా పరిణితిని అంచనా వేసింది. సీఏఎస్‌కు హాజరైన అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్లలో సుమారు 25 మంది పనితీరు జీరోగా ఉన్నట్లు తేలింది. కమిటీ వేసిన ప్రశ్నలకు వారి నుంచి సమాధానలు రాలేదు. వారు ప్రొఫెసర్లుగా ఎలా కొనసాగుతున్నారని, అప్‌గ్రేడ్‌ చేయడం కుదరదని తీవ్రంగా మందలించినట్లు సమాచారం. పలువురు అయితే తమ జర్నల్స్‌ను స్థానికంగా ముద్రించి ఇంటర్నేషనల్‌ జర్నల్స్‌లో వచ్చినట్లుగా చూపించినట్లు సమాచారం. జర్నల్స్‌ను ఇతరులతో రాయించుకొని తమ పేర్లను ముద్రించుకున్నవారు కూడా ఉన్నారు. ఇప్పుడీ అంశం ఓయూలో చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2021-07-30T06:40:33+05:30 IST