Abn logo
Dec 1 2020 @ 00:42AM

అరుదైన గౌరవం..

ప్రపంచ వారసత్వ సంపదగా కేసీ కాలువ, పోరుమామిళ్ల చెరువు

150 ఏళ్లనాటి కర్నూలు-కడప కాలువ

650 ఏళ్ల క్రితం విజయనగర రాజులు తవ్వించిన పోరుమామిళ్ల చెరువు

ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడాల జాబితాలో స్థానం

ఐసీఐడీ సంస్థ వెల్లడి

దేశంలో నాలుగింటికి చోటు దక్కితే.. రెండు జిల్లావే


కడప ముంగిట అరుదైన రికార్డు కొలువుదీరింది. కరువు నేలను సస్యశ్యామలం చేస్తూ.. రైతు మోమున దరహాసం నింపే కర్నూలు-కడప (కేసీ) కాలువ, పోరుమామిళ్ల చెరువులకు అరుదైనం గౌరవం దక్కింది. వీటికి ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కింది. ప్రపంచ సాగునీటి వారసత్వ సంపదగా చరిత్రను సొంతం చేసుకున్నాయి. దేశంలో నాలుగింటిని గుర్తిస్తే మూడు మన రాష్ట్రానికి చెందినవి కాగా.. అందులో రెండు మన జిల్లాలో ఉండడం కొసమెరుపు. ఈ సందర్భంగా ఆయా కట్టడాలపై ప్రత్యేక కథనం. 


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలోని విజయనగర రాజుల కాలం నాటి పోరుమామిళ్ల చెరువు, బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన కేసీ కాలువలకు ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడాలు (వరల్డ్‌ హెరిటేజ్‌ ఇరిగేషన స్ట్రక్చర్స్‌)గా గుర్తింపు దక్కింది. ఇంటర్నేషనల్‌ కమిషన ఇన ఇరిగేషన అండ్‌ డ్రెయినేజ్‌ (ఐసీఐడీ) సంస్థ అంతర్జాతీయంగా వచ్చిన ఎంట్రీలను పరిశీలించి ఎంపిక చేసింది. 


పోరుమామిళ్ల చెరువుకు 650 ఏళ్లు

పోరుమామిళ్లకు వెళ్లామంటే 650 ఏళ్ల క్రితం నిర్మించిన చెరువును చూడాల్సిందే. నేటి పాలకుల నిర్లక్ష్యానికి గుర్తుగా మట్టికట్ట పొడవునా కంపచెట్లు పేరుకుపోయినా.. ఈ చెరువు అరుదైనం రికార్డునే సొంతం చేసుకుంది. ఏ మాత్రం సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో నాలుగు కొండల మధ్య పాయలకు మట్టితో అడ్డుకట్ట కట్టి 0.7 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. 1369 అక్టోబరు 15న విజయనగర రాజులైన మొదటి బుక్కరాయలకు నలుగురు కొడుకుల్లో భాస్కరరాయులు (భవదూరుడు అని పిలిచేవారు) నెల్లూరు సీమలో ఉదయగిరి రాజ్యాధిపతిగా ఉండేవాడు. శాసనాలను బట్టి ఆయన కాలంలోనే ఈ చెరువును నిర్మించారని తెలుస్తోంది. పోరుమామిళ్లకు తూర్పున 4 కి.మీల దూరలో 11 కి.మీల పొడవు, 13 మీటర్ల వెడల్పు, 12 మీటర్ల ఎత్తుతో నాలుగు చిన్న కొండల మధ్య మూడు మట్టిఆనకట్టలు వేసి చెరువును నిర్మించారు. చెరువు లోపలి భాగంలో కంకర రాళ్లతో స్టోన రివిట్‌మెంట్‌ (రాతి పరుపు) ఉంది. చెరువుకట్ట దిగువ భాగంలో కోతకు గురికుండా 150 అడుగుల వెడల్పుతో దృఢమైన నిర్మాణం చేశారు. అనంతసాగరమని ిపిలిచే ఈ చెరువు నిర్మాణానికి ఆనాడే ప్రతి రోజు 1000 మంది కూలీలు, వంద ఎడ్లబండ్లతో రెండేళ్లు శ్రమించారని తెలుస్తోంది. అంటే.. 7.30 లక్షల పనిదినాలు, 73 వేల ఎడ్లబండ్లు పని చేశాయి. 1367లో ప్రారంభించి 1369 అక్టోబరు 15 నాటికి పూర్తి చేశారు. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని రోజుల్లో ఇలాంటి చెరువును నిర్మించడం నిజంగా ఓ అద్భుతమే. నేటికీ 3,865 ఎకరాలకు సాగునీరు అందుతోంది. చెరువు కట్టపై ఉన్న భైరవస్వామి ఆలయానికి ఎదురుగా రెండు శిలాశాసనాలు ఉన్నాయి. 1903లో శాసన పరిశోధకులు శాసనాల నకలు తీసి పరిశీలించారు. విజయనగర ప్రభువులైన మొదటి హరిహరరాయులు, బుక్కరాయల కాలంలో నిర్మించినట్లు గుర్తించారు. 


మూడు నదుల అనునంధానం కేసీ కాలువ

తుంగభద్ర, కుందూ, పెన్నా నదులను అనుసంధానం చేస్తూ 150 ఏళ్లకిత్రం డచ పాలకులు నిర్మించిన మరో అరుదైన నీటిపారుదల కట్టడం కర్నూలు-కడప (కేసీ) కాలువ. జల రవాణా కోసం డచ కంపెనీ 1863లో పనులు చేపట్టి 1870లో కాల్వ పనులు పూర్తి చేశారు. దీని పొడవు 306 కి.మీలు. సామర్థ్యం 84.9 క్యూబిక్‌ మీటర్లు. కృష్ణా నది పరీవాహక ప్రాంతమైన తుంగభద్ర నుంచి పెన్నాను కలుపుతూ నిర్మించారు. మధ్యలో కుందూ నదికి కలిపారు. నిర్మాణంలో భాగంగా తుంగభద్రపై సుంకేసుల ఆనకట్ట, కుందూపై రాజోలి ఆనకట్ట, పెన్నాపై ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట కూడా  నిర్మించారు. జల రవాణా (నౌకాయానం) కోసం డచ దేశానికి చెందిన మద్రాసు ఇరిగేషన అండ్‌ కెనాల్‌ కంపెనీ లిమిటెడ్‌ సంస్థ కాలువ నిర్మాణం చేపట్టింది. తుంగభద్ర నది ఒడ్డున సుంకేసుల దగ్గర ప్రారంభమై బానకచర్ల సమీపంలో నిప్పుల వాగులో కలుస్తుంది. కొంత దూరం వెళ్లాక కుందూ నదిలో కలుస్తుంది. అనంతరం ఆదినిమ్మాయపల్లె ఎగువన పెన్నాలో కలుస్తుంది. కర్నూలు, నంద్యాల, కడప నగరాల మీదుగా ప్రవహిస్తూ కడప సమీపంలో కృష్ణాపురం వద్ద ముగుస్తుంది. సముద్ర పట్టానికి 134 మీటర్ల ఎత్తులో ఉంది. ఈస్ట్‌ ఇండియా కంపెనీ వాణిజ్య కార్యకలాపాల కోసం డచ సంస్థ నుంచి దీనిని 1882లో 3.02కోట్లకు కొనుగోలు చేసింది. 


సాగునీటి కాలువగా..

అనంతరం కేసీ కాలువపై 1933లో నాటి బ్రిటిష్‌ పాలకులు నౌకాయానాన్ని పూర్తిగా నిలిపివేసి సాగునీటి కాలువగా మార్చారు. ప్రస్తుతం కర్నూలు, కడప జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, పలు పట్టణాలు, గ్రామాలకు తాగునీరు అందిస్తోంది. రాజోలి, ఆదినిమ్మాయపల్లె ఆనకట్టల నుంచి కేసీ కాలువకు సాగునీటిని అందిస్తున్నారు. జిల్లాలో 92 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. మైదుకూరు సబ్‌ డివిజన పరిధిలో 82 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నట్లు ఇంజనీర్లు తెలిపారు. ఎప్పుడో బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన కేసీ కాలువకు అడుగడుగున గండ్లు పడి శిథిలావస్థకు చేరడంతో 1998లో ఆధునికీకరణ పనులు చేపట్టారు. 1996-2004 మధ్యలో జపాన బ్యాంక్‌ నిధులు సుమారుగా రూ.9,620 కోట్లతో సీసీ లైనింగ్‌ చేశారు. కేసీకి అనుబంధంగా చాపాడు, ఏటూరు, కొండపేట, చెన్నూరు ఉప కాలువలు ఉన్నాయి. అంటే.. 150 ఏళ్లనాడు కాలువ నిర్మాణం పూర్తిచేసుకొని తుంగభద్ర, కుందూ, పెన్నా నదులను అనుసంధానం చేస్తూ.. నాడు జలరవాణా, నేడు సాగు, తాగునీరు అందించే కేసీ కాలువ  ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడాల (వరల్డ్‌ హెరిటేజ్‌ ఇరిగేషన స్ట్రక్చర్స్‌) జాబితాలో చోటు దక్కించుకుంది. జిల్లాకు అరుదైన గౌరవాన్ని అందించింది.


నేటి ఇంజనీర్లకు స్ఫూర్తిదాయకం

- శ్రావణ్‌కుమార్‌రెడ్డి, సీఈ, జలవనరుల శాఖ (ప్రాజెక్ట్‌), కడప

జిల్లాకు చెందిన కేసీ కాలువ, పోరుమామిళ్ల చెరువుకు ప్రపంచ చారిత్రక నీటి కట్టడాల జాబితాలో చోటు దక్కడం, ప్రపంప వారసత్వ సంపదగా గుర్తింపు పొందండ ఓ ఇంజనీరుగా గర్వపడుతున్నాను. నేటి తరం ఇంజనీర్లకు స్ఫూర్తిదాయకం. దేశంలో నాలుగు కట్టడాలు ఎంపికైతే.. రెండు మన జిల్లాలోనే ఉండడం ఆనందంగా ఉంది.

ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట నుంచి ప్రవహిస్తున్న కేసీ కాలువ


Advertisement
Advertisement
Advertisement