మా ఊరి ఆకుకూరలు

ABN , First Publish Date - 2020-11-22T18:10:30+05:30 IST

ఆకుకూరలంటే మన కళ్ల ముందు మెదిలేవి.. పాలకూర, తోటకూర, మెంతికూర, బచ్చలి, గోంగూర... ఇలాంటివే కదా! ఇవన్నీ పొలాల్లో సాగు చేసి పండించేవి. సాగు చేయకపోయినా ప్రకృతిలో వాటంతట అవే పెరిగే

మా ఊరి ఆకుకూరలు

ఆకుకూరలంటే మన కళ్ల ముందు మెదిలేవి.. పాలకూర, తోటకూర, మెంతికూర, బచ్చలి, గోంగూర... ఇలాంటివే కదా! ఇవన్నీ పొలాల్లో సాగు చేసి పండించేవి. సాగు చేయకపోయినా ప్రకృతిలో వాటంతట అవే పెరిగే ఆకుకూరలు 160 రకాలు ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇవన్నీ మన ఇళ్ల చుట్టుపక్కల, పొలాలు, వంకలు, వాగులు, చెరువు గట్లపైన పెరుగుతాయి. పంటపొలాల్లో అయితే కలుపు మొక్కల్లా పీకి పారేస్తుంటారు. అయితే వీటిలో చాలా వరకు తినే ఆకుకూరలే!. సూక్ష్మపోషకాలలో వాణిజ్య రకాలైన పాలకూర, తోటకూరలకు ఏ మాత్రం తీసిపోవు. అత్యధిక దిగుబడితోపాటు కంటికి ఇంపుగా, నాలుకకు రుచిగా తోచే ఆకుకూరలనే ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో పూర్వం నుంచీ వాడుకలో ఉన్న సంప్రదాయ ఆకుకూరలు కనుమరుగు అవుతున్నాయి. ఇవన్నీ ఇప్పటికీ లభ్యమవుతున్నా... తినేవాళ్లు తగ్గిపోయారు. పట్టణాలు, నగరాల్లో డిమాండ్‌ ఉన్న కొన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలనే రైతులు ఎక్కువగా పండిస్తున్నారు.. అమ్ముతున్నారు. ఫలితంగా కూరల కొరత కూడా ఏర్పడుతోంది. పల్లెల్లో అందుబాటులో ఉన్న అన్‌ కల్టివేటెడ్‌ (సాగు చేయని) ఆకుకూరలను రూపాయి ఖర్చు లేకుండా తినవచ్చు... గ్రామీణులు అందరికీ చిరపరిచితమైన ఈ ఆకుకూరలను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు తెలంగాణలోని ‘దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ’ కృషి చేస్తోంది. అలాంటి ఆకుకూరలతో రకరకాల కూరలను చేసి... నగరవాసులకు వడ్డించింది కూడా. అలాంటి ఆకుకూరల్లో కొన్నింటి గురించి తెలుసుకుందాం..   


ముల్లు దొగ్గలి

ఇది నాటు తోటకూర అని చెప్పుకోవచ్చు. తోటకూర జాతికి చెందినదే. ఆకులు పొడవుగా, కాస్త వెడల్పుగా ఉంటాయి. పొడువాటి పూలు (కొర్ర కంకుల్లా) పూస్తాయి, విత్తనాలు కాస్తాయి. చిన్న కంకిలాంటి పూలు పూయడం వల్ల ‘కోడిజుట్టు కూర’ అని కూడా పిలుస్తారు. ఈ మొక్క ముదిరితే కాండానికి ముల్లు పెరుగుతాయి. అందుకనే దీన్ని ముల్లు దొగ్గలి అంటారు. లేతగా ఉన్నప్పుడు కాండాలతో సహా తెంపుకుని పప్పు లేదా వేపుడు చేసుకోవచ్చు. కాస్త ముదిరితే కేవలం ఆకుల్ని శుభ్రంగా కడిగి కూరలో వాడుకోవచ్చు. ఇందులోని సూక్ష్మ పోషకాలు శరీరంలో రక్తప్రసరణ సులువుగా సాగేందుకు దోహదపడతాయి. చర్మంపై ఏర్పడ్డ గాయాలను నయం చేయడానికి ముల్లు దొగ్గలి తోడ్పడుతుంది. 

ప్రత్యేకత : రక్త ప్రసరణ సవ్యంగా సాగుతుంది. 


గునుగు

మెత్తటి నేలల్లో ఏపుగా పెరుగుతుంది. ముదిరితే కాండం లావుగా, ఆకులు వెడెల్పుగా తయారవుతాయి. తెల్లటి పూలు పూస్తాయి. దీన్ని తెలంగాణలో గునుగు, రాయలసీమలో గురుగు, మిగిలిన చోట్ల తురాయి, అడవి తురాయి అని పిలుస్తారు. ఒకరకంగా చెప్పాలంటే మెత్తటినేలల్లో ఇదొక కలుపు మొక్క. దీనివల్ల పంటలు దెబ్బతింటాయని పెరికేస్తారు. లేత మొక్కగా ఉన్నప్పుడే గునుగును వంటల్లోకి వాడతారు. గునుగును చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని... నీళ్లు పోయకుండా వేపుడు చేసుకోవచ్చు. ఒకవేళ పప్పు చేసుకోవాలనుకుంటే కందిపప్పు లేదా శనగపప్పుతో కలిపి వండుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు కరువు కాటకాలు ఎక్కువగా ఉన్నప్పుడు... ఈ గునుగే పోషకాహారం.

ప్రత్యేకత : కంటిచూపు మెరుగుపడుతుంది, హైపర్‌టెన్షన్‌ తగ్గుతుంది. 


తుమ్మి కూర

కొన్ని ఆకులు, పూలలోని ఔషధ, ఆరోగ్య విశిష్టతలకు ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని కల్పించారు మన పూర్వీకులు. అలాంటి ఆకుల్లో తుమ్మి కూడా ఒకటి. చవితి పూజల్లో కనిపిస్తుంది. ల్యూకస్‌ అస్పేరా దీని శాస్త్రీయ నామం. వర్షాకాలం వస్తే చాలు... పొలాల్లో ఎక్కడపడితే అక్కడ తుమ్మి గుంపులు గుంపులుగా పైకి లేస్తుంది. తెల్లపూలు పూస్తాయి. లేతగా ఉన్నప్పుడు ఆకుల్ని తెంపుకుని... కందిపప్పు, చింతపండు లేదంటే పచ్చి చింతకాయతో కలిపి వండుతారు. కార్తీకమాసంతో పాటు శివరాత్రి, వినాయకచవితిలకు తుమ్మికూరను వండుకుని తినడం తరతరాల నుంచీ ఆనవాయితీగా వస్తోంది. 

ప్రత్యేకత : అజీర్తిని తరిమేస్తుంది, తలనొప్పిని తగ్గిస్తుంది.


ఎర్రపుండి

తోటల్లో సాగు చేయకముందే అడవులు, పొలాల్లో విరివిగా పెరిగేది. ఎర్ర, పొడి నేలల్లో ఎక్కువ. ఆకులు పచ్చగా ఉన్నా... కాండం, ఆకులకొసలు ఎర్రగా ఉంటాయి. కాబట్టి దీన్ని ‘ఎర్రపుండి’ అంటారు. వార్షాకాలం మొదలై, వానలు సమృద్ధిగా కురిసినప్పుడు పొలాల్లో ఏపుగా పెరుగుతుంది. దీనిని నాటురకం గోంగూర అనుకోవచ్చు. చలికాలం మొదలైంది కదా. ఇలాంటి సమయంలో చలికి, మంచుకు పెరిగే ఎర్రపుండి ఆకుకూర ప్రత్యేక రుచి కలిగి ఉంటుంది. పప్పుతోపాటు చట్నీలు కూడా చేసుకుంటారు. తోటల్లో ప్రత్యేకంగా సాగుచేసే గోంగూరను పోలి ఉన్నప్పటికీ... రుచిలో మాత్రం కొంత వ్యత్యాసం ఉంటుంది. ఇందులో పులుపుతో పాటు పోషకవిలువలు కూడా అధికమే!. ఎర్రపుండిని ఈ సీజన్‌లో తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

ప్రత్యేకత : చలికాలంలో మందగించే జీర్ణశక్తి చురుగ్గా మారుతుంది.


సన్నపాయల కూర

ఇసుక నేలల్లో నేలపై పరుచుకుని పెరగడం దీని లక్షణం. ఆకులు చాలా చిన్నగా ఉంటాయి. తీగల్లా అల్లుకుని విస్తరిస్తుంది. సన్నపాయల కూర తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇసుక, చౌడు నేలల్లో అయితే మరీ ఎక్కువ. దీనిని జాగ్రత్తగా పెరకాలి. లేకపోతే తెగిపోతుంది. ఈ ఆకుకూరను అక్కడక్కడ కూరగాయల దుకాణాల్లో అమ్ముతుంటారు. ఇదొక అరుదైన ఆకుకూర. చాలా రుచిగా ఉంటుంది. పప్పుతో కలిపి వండుకోవచ్చు. ఆకులు, తీగలతో సహా వండితే అనేక పోషకాలను పొందవచ్చు. సీజనల్‌ ఆకుకూరల్లో ఇది విలువైనది.  

ప్రత్యేకత : శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.


ఎలుక చెవుల కూర

దీని ఆకులు అచ్చం ఎలుక చెవుల్లా నిక్కపొడుచుకుని పెరుగుతాయి కాబట్టి.. ఆ పేరు వచ్చింది. పూర్వం దీనిని ఆయుర్వేద ఔషధ కోణంలో పప్పుతో కలిపి వండుకునేవారు. మలబద్దకం, కడుపులో నులి పురుగులు ఉన్న వాళ్లకు ఇది చక్కగా పనిచేస్తుంది. దీని ఆకులను తెంపుకుని... కందిపప్పు లేదా శనగపప్పు, పెసరపప్పులతో కలిపి వండుకోవచ్చు. పచ్చి ఆకులను అనేక రకాల రుగ్మతలకు వాడతారు. ఇది అన్ని ప్రాంతాల్లోనూ దొరుకుతుంది.  

ప్రత్యేకత : అల్సర్లు, దగ్గు, జలుబులకు ఉపశమనం కలిగిస్తుంది.


బుడ్డకాశ

పల్లెల్లో బాల్యం గడిచిన తరానికి బుడ్డకాశ గుర్తుంటుంది. దీనిని కుంపటి చెట్టు అని కూడా పిలుస్తారు. ఇది కంపచెట్లు, ముళ్ల పొదల్లో అల్లుకుంటుంది. దీనికి విచిత్రమైన గాలిబుడగల్లాంటి కాయలు కాస్తాయి. వీటిని పిల్లలు నలిపేస్తూ ఆడుకునేవారు. ఈ బుడ్డల్లో లోపల నల్లటి విత్తనాలు ఉంటాయి. బుడ్డకాశి విత్తనాలను తినకూడదు. అయితే ఈ మొక్క ఆకులతో కూరలు వండుకోవచ్చు. ఈ ఆకు కూరను తింటే కంటిచూపు మెరుగుపడుతుంది, నేత్ర వ్యాధులు రావని గ్రామీణులు నమ్ముతారు. ఇందులో ఎంత వరకు శాస్త్రీయత ఉందో అధ్యయనం చేస్తే కానీ తెలీదు. 

ప్రత్యేకత : కంటిచూపునకు, పైల్స్‌ నివారణకు.


జొన్న చెంచలి

తెలంగాణలో జొన్న చెంచలి, రాయలసీమలో చెంచలాకు. ఇది సీమలో ఒకప్పుడు ప్రధాన ఆకుకూర. మెట్టపొలాల్లో వర్షాలప్పుడు పెరుగుతుంది. కాస్త తోటకూరను పోలి ఉంటుంది. అయితే కాండం తక్కువ, ఆకులు ఎక్కువ. పింక్‌, తెలుపు రంగుల్లో చిన్న చిన్న పూలు పూస్తాయి. చెంచలాకుతో పప్పు చేసుకుంటారు. దీని ఆకులు, విత్తనాలను మూత్రసంబంధిత వ్యాఽధుల నివారణకు వాడుతుంటారు. చెంచలిలో అనేక సూక్ష్మపోషకాలు ఉన్నాయి. కిడ్నీల ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. జీర్ణశక్తి మందగించి, అజీర్తి దోషంతో బాధపడేవాళ్లకు ... చెంచలి ఎంతో మేలు చేస్తుంది. 

ప్రత్యేకత : మూత్ర సంబంధిత వ్యాధుల నివారణకు.


పొన్నగంటి

మార్కెట్‌లో పాలకూర, తోటకూరలతో పాటు పొన్నగంటి కూరను కూడా అమ్ముతున్నారు. ఒకప్పుడు పొలాల్లో తప్పిస్తే మార్కెట్‌లో దొరికేది కాదు. ఇది కూడా సాగుచేయని ఆకుకూరల్లో ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, బావులు, వంకలు, కుంటల పక్కన చలువ వాతావరణం ఉన్న చోట మాత్రమే గుబురుగా పెరుగుతుంది. పెలుసుగా ఉన్న కాండానికి గుత్తులుగా ఆకులు పెరుగుతాయి. రుచిలో పొన్నగంటికి ఏదీ సాటి రాదు. అయితే తరచూ తినలేరు. దీన్ని పప్పులో కలిపి వండుకునే కంటే... వేపుడుగా చేసుకుని తింటే మహా రుచిగా అనిపిస్తుంది. జీర్ణశక్తి సవ్యంగా లేనప్పుడు, అజీర్తితో బాధపడుతున్నప్పుడు పొన్నగంటి తింటే చాలు. ఉదరానికి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.

ప్రత్యేకత : ఊబకాయం తగ్గిస్తుంది, బీపీ, షుగర్‌లను కంట్రోల్‌ చేస్తుంది.


గంగవాయిలి కూర

ఇది కూడా ఇసుక నేలల్లో నేలను పాకుతూ పెరిగే ఆకుకూర. దీనిని కొన్ని చోట్ల పాయల కూర, పప్పు కూర అంటారు. సాధారణ ఆకుకూరల్లో లేని అరుదైన సూక్ష్మపోషకాలు ఇందులో ఉన్నాయి. తుంచితే సులువుగా విరిగిపోతుంది. దీని ఆకులను నమిలితే నాలుకకు పులుపు తగులుతుంది. గంగవాయిలిలోని ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు మేలు చేస్తాయి. చెడుకొవ్వును తొలగించే గుణం దీనికుంది. ఇందులోని అరుదైన పోషకాలు నాడీవ్యవస్థను చురుగ్గా ఉంచుతాయి. కొన్నేళ్ల నుంచీ మన ఆహారంలో భాగమైంది. ఈ ఆకులను తెంపి పప్పుతో వండుకుంటే ఎంతో రుచి.

ప్రత్యేకత : మూత్రపిండాలు, కాలేయం శక్తి పెరుగుతుంది.


అడవి పుల్లకూర

ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుంది. రూపాయి బిళ్లంత సైజులో మూడు రేకుల ఆకులు ఉంటాయి. చూడటానికి అందంగా ఉంటుంది. పసుపు రంగు పూలు పూస్తాయి. ఈ మొక్క సారవంతమైన భూముల్లో, నదీపరీవాహక ప్రాంతాల్లో పెరుగుతుంది. గోదావరి జిల్లాల్లో ఎక్కువ. మొక్క ఆకుల్ని తెంపి తింటే కొంచెం పుల్లగా ఉంటుంది. అందుకే దీనికి పుల్లకూర అని పేరు. కొన్ని చోట్ల ‘చిన్న పిల్లి అడుగు ఆకు’ అని అంటారు. ఒక పిల్లి కాలి ముద్రను పోలి ఉంటుంది కాబట్టి.. అలా పిలుస్తారు. ఈ ఆకుకూరతో పచ్చడి చేసుకుంటారు. కొన్ని దేశాల్లో సలాడ్స్‌ మీద చల్లుతారు.

ప్రత్యేకత : విరేచనాలను తగ్గిస్తుంది..


 ప్రపంచ ఎగుమతుల మార్కెట్‌లో మన దేశం వాటా అత్యల్పం. కూర గాయలు, పండ్లలో మన వాటా కేవలం 1 శాతమే!. 2019-20లో ఇండియా నుంచి ఎగుమతి అయిన పండ్లు, కూరగాయల విలువ రూ.9,182 కోట్లు.


ఆకుకూరల్ని తింటే మీకు ఇన్నేసి క్యాలరీల శక్తి వస్తుంది అని నిత్యం వింటుంటాం, చదువుతుంటాం. అసలు క్యాలరీ అంటే ఏమిటి? అంటే - మన తీసుకునే ఆహారం ద్వారా అందే శక్తిని క్యాలరీలలో కొలుస్తాం. ఒక క్యాలరీ అంటే.. ఒక గ్రాము నీటిని ఒక సెంటీగ్రేడు ఉష్ణోగ్రతకు పెంచగలిగే శక్తికి సమానం.


అన్ని రాష్ట్రాల్లో కలిపి సుమారు వెయ్యి రకాల ఆకుకూరల్ని తింటున్నారు జనం. ఇందులో ఎక్కువగా పాలకూర, తోటకూర, మెంతికూర, గోంగూర, పుదీన, బచ్చలి, చుక్కకూర, కొత్తిమీర, కరివేపాకు... ఇవి ముఖ్యమైనవి.


జాతీయ ఉద్యాన వన శాఖ సమాచారం ప్రకారం - అత్యధిక ఆకుకూరలు, కూరగాయలు పండించే దేశం చైనా. రెండో స్థానంలో ఉన్నది మన దేశమే!.


ఉత్తర, దక్షిణ భారత దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో అత్యధిక మోతాదులో తినే ఆకుకూర పాలకూర. దీంతో ఏ వంట అయినా సులభంగా చేసుకునే సౌలభ్యం, రుచిగా ఉండటమే కారణం.


ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అల్లం పండించే దేశం భారత్‌. మన దేశంలో సాగు చేసే కూరగాయల్లో బంగాళదుంపలదే తొలిస్థానం. ఆ తరువాత ఉల్లి, కాలీఫ్లవర్‌, వంకాయ, క్యాబేజీ.


భారత్‌లో ఎక్కువ దిగుబడి సాధించే పండ్లలో అరటి టాప్‌. బొప్పాయి, మామిడిలది ద్వితీయ, తృతీయ స్థానం.


మన దేశం నుంచీ ఎగుమతి అయ్యే కూరగాయల్లో వరుసగా - ఉల్లి, బంగాళదుంపలు, టొమాటో, మిరప.. ఇవే ఎక్కువ.


మన దగ్గర నుంచి కూరగాయలను అధికంగా దిగుమతి చేసుకునే దేశాలు... బంగ్లాదేశ్‌, యూఏఈ, నెదర్లాండ్‌, నేపాల్‌,మలేషియా, 

యూకే, శ్రీలంక, ఒమన్‌, ఖతార్‌.


రోజుకు 325 గ్రాములు తినాలి..

ఒక మనిషి రోజుకు 325 గ్రాముల ఆకుకూరలు, కూరగాయలను   తినాలి. ఇందులో 50 గ్రా. ఆకుకూరలు, 100 గ్రా. దుంపలు, మరో 100 గ్రా. కూరగాయలు... మిగిలిన 75 గ్రా. ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి ఇతర రకాలను తీసుకోవాలి. అయితే ఇప్పుడు 250 గ్రా. మాత్రమే తింటున్నారు. తెలంగాణలో ఏడాదికి 46 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆకుకూరలు, కూరగాయలు అవసరం. ఐదు లక్షల ఎకరాల్లో సాగు చేస్తే తప్ప... ఇంత దిగుబడి సాధించలేం. ప్రస్తుతం 2.5 లక్షల ఎకరాల్లో మాత్రమే ఆకుకూరలు, కూరగాయలు సాగవుతున్నాయి. ప్రజలకు సరిపడా కావాలంటే... పల్లెల్లో సహజసిద్ధంగా పండే కూరలను కూడా తినవచ్చు. అప్పుడు కొంత వరకు కొరత తీరుతుంది. ఏ ఆకు కూర అయినా కోసిన 24 గంటల్లో వండుకుంటే సంపూర్ణ పోషకాలు అందుతాయి. ఆకుకూరలంటే కేవలం మనకు అందుబాటులో ఉండేవే కావు. పంట పొలాల్లో పెరిగే సంప్రదాయ ఆకుకూరలతో కూడా కూరలు చేసుకోవచ్చు. మునగలాంటి ఆకుల్నీ తీసుకోవచ్చు. మన దేశంలో అత్యధిక పోషక విలువలున్నది కేవలం మునగ ఒక్కటే!. రోజుకు ఒక స్పూను మునగ పొడి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మునగలో 96 రకాల పోషకవిలువలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మునగకు ప్రపంచ వాణిజ్య పంటగా గుర్తింపు లభిస్తోంది. ఇంగ్లండ్‌, అమెరికా, జర్మనీ దేశాలు కూడా మన దేశం నుంచే మునగ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. కానీ, మన పల్లెల్లో మాత్రం మునగ తినడం తగ్గిపోయింది. అన్‌ కల్టివేటెడ్‌ ఆకుకూరల్లో మునగ కూడా ఒకటి.

- వెంకటరామిరెడ్డి, కమిషనర్‌, ఉద్యానవనశాఖ, తెలంగాణ


కొత్తపేర్లతో ప్రచారం చేయాలి

కొనుగోలు సంస్కృతిలో ఆర్థికలాభం వచ్చేవి నిలబడుతున్నాయి, ఆరోగ్యలాభం ఉన్నవి కనుమరుగవుతాయి.  ఇదివరకు పల్లెల్లో పొలం గట్లపైన, వాగులు, వంకల పక్కన, బావుల దగ్గర అనేక రకాల ఆకుకూరలు దొరికేవి. పొలం పనులకు వెళ్లి ఇంటికి వస్తూ వస్తూ... నాలుగైదు రకాల ఆకుకూరల్ని తెంపుకొచ్చి కూరలు చేసుకునేవారు. ఎలాంటి రసాయనాలు వాడని అసలుసిసలు ఆర్గానిక్‌ ఆకుకూరలంటే అవే!. నోటికి ఏది రుచిగా అనిపిస్తే... దాన్ని మాత్రమే తింటున్నారు. మిగిలినవి వదిలేస్తున్నారు. పాలకూర, తోటకూరలే కూరలు కాదు. మన పూర్వీకులు తింటూ వచ్చిన ఇతర ఆకుకూరలు చాలానే ఉన్నాయి. వాటన్నిటినీ ఈ కొత్తరకం వ్యాపార కూరలు వచ్చాక మరిచిపోయాం. పల్లెల్లో పొలాల్లో పెరిగే సంప్రదాయ ఆకుకూరలు వాణిజ్యమార్పును పొందలేదు. ప్రభుత్వ వ్యవసాయ, ఉద్యానవన, పోషకాహార సంస్థలు... పల్లెల్లోని ఆకుకూరలపై ప్రత్యేక అధ్యయనం చేయాలి. పోషక విలువలను గుర్తించి, ఆ వివరాలను అందుబాటులో ఉంచాలి. ఆకుకూరలకు ఇదివరకున్న పాతపేర్లను తొలగించి... కొత్తపేర్లు పెట్టి ప్రచారం చేయాలి. నేటి జీవనశైలికి ఏది అవసరం? ఏది అనవసరం? ప్రజలకు వివరించాలి. 

- వై. వెంకటేశ్వరరావు, రైతునేస్తం


పల్లెల్లో ఇవే తింటున్నాం...

ఊళ్లలో పొలాలు, వాగులు, వంకలు, బావులు, సెలయేర్ల పక్కన... బంజరు భూముల్లో, ఎర్ర నేలల్లో... ఎక్కడ చూసినా ఏదో ఒక ఆకుకూర కనిపిస్తుంది. ఏది తినాలి? ఏది తినొద్దు? అనేది పూర్వీకుల నుంచి తెలుసుకున్నదే!. మనం ఇప్పుడు కొంటున్న ఆకుకూరలన్నీ సాగుచేస్తే దొరికేవి. కానీ, సాగు చేయకున్నా... ప్రకృతిలో వాటంతట అవే పెరిగే ఆకుకూరలే ఒకప్పటి ఆహారం. ఇప్పటికీ చాలా పల్లెల్లో అలా పండిన ఆకుకూరల్ని తింటున్నాం. ఒక్కో ఆకుకూరకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొన్ని రుతువులను బట్టి వస్తాయి. వాటిని గుర్తించి ఇంటికి తీసుకొచ్చేవాళ్లం. ముల్లు దొగ్గలి, గోరుమాడి, ఎర్రపుండి, పొన్నగంటి, అడవి పుల్లకూర... ఇలా చాలానే ఉన్నాయి. కనుమరుగైపోతున్న ఇలాంటి 160 రకాల ఆకుకూరల్ని తిరిగి ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో... దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ కృషి చేస్తోంది. తోటి మహిళా రైతులతో కలిసి ఈ ఆకుకూరల్ని గుర్తించి... కొంత ప్రచారం కల్పించాం. వీటిని పొలాల నుంచీ తీసుకొచ్చి.. వండి నగరవాసులకు రుచి చూపించాం. వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఇలాంటి పల్లె ఆకుకూరలకు ప్రచారం కల్పిస్తే... ఎంతోమందికి ఆరోగ్యసేవ చేసినట్లు అవుతుంది.

- లక్ష్మి, డీడీఎస్‌ కార్యకర్త

Updated Date - 2020-11-22T18:10:30+05:30 IST