మా అమ్మను పోలీసులే కొట్టి చంపారు!

ABN , First Publish Date - 2021-06-22T08:44:39+05:30 IST

’అడ్డగూడూరు పోలీసుస్టేషన్‌లో మా అమ్మను పోలీసులే కొట్టి చంపేశారు.

మా అమ్మను పోలీసులే కొట్టి చంపారు!

  • నన్ను, స్నేహితుడిని హింసించారు 
  • నాలుగు రోజులు నరకం చూపారు
  • మేం దొంగతనం చేయలేదు
  • ‘ఆంధ్రజ్యోతి’తో మరియమ్మ కుమారుడు ఉదయ్‌కిరణ్‌
  •  

ఖమ్మం, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ’అడ్డగూడూరు పోలీసుస్టేషన్‌లో మా అమ్మను పోలీసులే కొట్టి చంపేశారు. చేయని దొంగతనం నేరాన్ని మాపై మోపి మా అమ్మను, నన్ను, నా స్నేహితుడిని పోలీసులు విపరీతంగా కొట్టారు.  నాలుగు రోజులు మాకు నరకం చూపారు. దెబ్బలకు తాళలేక మా అమ్మ పోలీసు స్టేషన్‌లోనే నా ఒడిలో చనిపోయింది’ అని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసుస్టేషన్‌లో మృతి చెందిన ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడేనికి చెందిన అంబడిపూడి మరియమ్మ కుమారుడు ఉదయ్‌ కిరణ్‌ కన్నీరు మున్నీరయ్యాడు. ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది.


ఉదయ్‌ కిరణ్‌ మాటల్లో...

‘మా అమ్మ మరియమ్మ యాదాద్రి భువగిరి జిల్లా అడ్డగూడూరు మండలం గోవిందాపురంలో చర్చిపాదర్‌ వద్ద వంట పని చేస్తోంది. ఈనెల 3న మా అమ్మను చూడడానికి నేను, నా స్నేహితుడు శంకర్‌ కలిసి గోవిందాపురం వెళ్లాం. చర్చి ఫాదర్‌ హైదరాబాద్‌ నుంచి రాగానే.. రూ.2లక్షలు పోయాయని ఈనెల 7న మా మీద దొంగతనం నింద మోపగా, మేం దొంగతనం చేయలేదని చెప్పాం. అయితే మాపై ఈర్ష్యతో ఉన్న మా బావ నాగరాజు ప్రోద్బలంతో చర్చిపాదర్‌ కేసు పెట్టడంతో ఈ నెల 15న అడ్డగూడూరు పోలీసులు కోమట్లగూ డెం వచ్చి నన్ను, శంకర్‌ను చింతకాని పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్లి బెల్టులు, లాఠీలతో తీవ్రంగా కొట్టారు. 16న ఉదయం చింతకాని నుంచి కారులో అడ్డగూడూరు తీసుకెళ్లారు. మళ్లీ 17న ఉదయం విచారణ పేరుతో మా అమ్మను స్టేషన్‌కు తీసుకొచ్చారు.  ఆ తర్వాత 18న తెల్లవారుజామున 4 గంటలకు మళ్లీ కారులో మమ్మల్ని కొట్టుకుంటూనే అడ్డగూడూరు తీసుకెళ్లారు. స్టేషన్‌లో నన్ను, మా అమ్మను ఒక గదిలో, శంకర్‌ను మరో గదిలో ఉంచి తీవ్రంగా కొట్టా రు. మా అమ్మ కడుపులో బూటుకాళ్లతో తన్నా రు. పోలీసు దెబ్బలకు తాళలేక మా అమ్మ మూత్ర విసర్జన చేసుకుంది. ఆపై తీవ్ర అస్వస్థతకు గురైంది. ఉదయం 9:30 గంటలకు సపర్యలు చేస్తుండగా నా ఒడిలోనే చనిపోయింది.’ అంటూ ఉదయ్‌ కిరణ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.


విచారణకు ఆదేశించండి

గవర్నర్‌కు ఉత్తమ్‌, భట్టి విజ్ఞప్తి  

దళిత మహిళ మరియమ్మ లాకప్‌ డెత్‌కు కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు కోరారు. మరియమ్మ కొడుకు కిరణ్‌కు ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, పరిహారం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం గవర్నర్‌కు వారు లేఖ రాశారు. దళిత మహిళ మరియమ్మను లాక్‌పలో పోలీసులు చిత్రహింసలు పెట్టడంతో మరణించిందని గవర్నర్‌ దృష్టికి తెచ్చారు. పెద్దపల్లి జిల్లాలో శీలం రంగయ్య అనే దళితుడూ లాకప్‌డెత్‌కు గురయ్యారని పేర్కొన్నారు. 


నా కళ్లముందే మా అమ్మను కొట్టారు: స్వప్న 

‘చింతకాని పోలీసుస్టేషన్‌లో నా కళ్ల ముందే మా అమ్మను కొట్టారు’అని మరియమ్మ కుమార్తె స్వప్న వాపోయింది. ఖమ్మం జిల్లా ఆస్పత్రి వద్ద సోమవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ తన తమ్ముడు, తల్లిపై దొంగతనం నింద మోపి, పోలీసులు కొట్టారని, అందుకే తన తల్లి మరణించిందని చెప్పింది. వారికే పాపం తెలియదని, వదిలేయమని వేడుకున్నా కనికరించలేదని పేర్కొంది. అబద్ధాలు చెప్పడం తమకు చేతకాదని విలపించింది. తన తమ్ముడికి న్యాయం చేయాలని, నిరుపేదలమైన తమను ఆదుకోవాలని వేడుకుంది.  

Updated Date - 2021-06-22T08:44:39+05:30 IST