మా రెండో ఇల్లు తిరుమల

ABN , First Publish Date - 2021-10-15T06:42:27+05:30 IST

‘ఏడాదిలో రెండుమూడు సార్లు తిరుమలకు రావడం అలవాటైపోయింది.

మా రెండో ఇల్లు తిరుమల

పెళ్లిసందడి హీరో రోషన్‌


(తిరుమల - ఆంధ్రజ్యోతి)

‘ఏడాదిలో రెండుమూడు సార్లు తిరుమలకు రావడం అలవాటైపోయింది. హైదరాబాద్‌ తర్వాత మా రెండో ఇల్లు తిరుమలగా మారింది. ఏం జరిగినా ఇక్కడి వచ్చేస్తాం. అమ్మానాన్నలతో కలిసి ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చానో చెప్పలేను. ఇక్కడి వస్తున్నాం అంటేనే పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ మొదలైపోతాయి. స్వామి దర్శనం తర్వాత మైండ్‌ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అనుకున్నవన్నీ ఇట్టే జరిగిపోతాయ్‌. అందుకే శుక్రవారం విడుదల కానున్న మా ‘పెళ్లి సందడి’ సినిమా పెద్ద హిట్‌ కొట్టాలన్న కోరికతో స్వామి దర్శనానికి వచ్చాం’ అని ప్రముఖ సినీనటుడు శ్రీకాంత్‌ కుమారుడు హీరో రోషన్‌ తెలిపారు. పెళ్లి సందడి దర్శకురాలు రోణంకి గౌరి, హీరోయిన్‌ శ్రీలీలతో కలిసి గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. మా నాన్నగారి సినిమా ‘పెళ్లి సందడి’ టైటిల్‌తో నా సినిమా వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. పండగ రోజు విడుదలవుతున్న మా చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకముంది. థియేటర్‌కు వచ్చిన ప్రతి ఒక్కరూ నవ్వుకుంటూ బయటకి వస్తారు. నాన్న సినిమా పెళ్లి సందడిలానే ఈ సినిమా కూడా ఉంటుంది. అయితే ఆ చిత్రానికి సీక్వెల్‌ కాదు. మా స్ర్కిప్టుకు మ్యాచ్‌ అవుతుందనే ఉద్దేశంతో ఆ టైటిల్‌ పెట్టుకున్నాం. ఓ పెళ్లికి వెళితే అక్కడ జరిగే సందడి, ఓ జంట కలుసుకునే అంశంపై మా సినిమా ఉంటుంది. ప్రత్యేకించి ప్రకాష్‌రాజ్‌, రావు రమేష్‌, బాబూమోహన్‌, వెన్నెల కిశోర్‌ వంటి  సీనియర్‌ నటులు ఈ చిత్రంలో నటించారు. సినిమా పక్కాగా వచ్చిందనుకుం టున్నాం. రాఘవేంద్రరావు గారు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. మాకు దగ్గరుండి హావభావాలు నేర్పించడంతో పాటు సినిమా బాగా వచ్చేలా పలు సూచనలు చేశారు.


మా సినిమాలో నవరసాలున్నాయి : శ్రీలీల

పెళ్లిసందడి సినిమా షూటింగ్‌ కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో జరిగిందని దర్శకురాలు గౌరి తెలిపారు. పిల్లలైనప్పటికీ చక్కగా నటించారని, ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. హీరోయిన్‌గా నటించిన ఒంగోలుకు చెందిన శ్రీలీల మాట్లాడుతూ.. తమ సినిమాలో నవరసాలున్నాయన్నారు. యాక్షన్‌తో పాటు ఫన్‌ కూడా ఉంటుందన్నారు. సినిమా పెద్ద హిట్‌ కావాలని వేంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు శ్రీలీల చెప్పారు.

Updated Date - 2021-10-15T06:42:27+05:30 IST