మన ఘన సంప్రదాయం ‘పొంగలి’

ABN , First Publish Date - 2022-01-14T06:06:35+05:30 IST

శుభ్రత, కొత్త పంట, పెద్దల గౌరవం ప్రాముఖ్యత చెప్పే భోగి, పొంగలి, కనుమ వేడుకలు తెలుగు ప్రజల వేల సంవత్సరాల నాటి చారిత్రక సంప్రదాయం....

మన ఘన సంప్రదాయం ‘పొంగలి’

శుభ్రత, కొత్త పంట, పెద్దల గౌరవం ప్రాముఖ్యత చెప్పే భోగి, పొంగలి, కనుమ వేడుకలు తెలుగు ప్రజల వేల సంవత్సరాల నాటి చారిత్రక సంప్రదాయం. ఇటీవల వాడుకలోకి తెచ్చిన సంక్రాంతి అనే సంస్కృత పదం, మన తెలుగు పొంగలి అనే పదం రెండూ వేర్వేరు అర్థాన్ని స్ఫురిస్తాయి. సంక్రాంతి అర్థం సూర్యుడు ఒక రాశిలో నుంచి మరో రాశికి మారడం. సంవత్సరంలో 12 సంక్రాంతులు వస్తాయి. సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి అంటారు. క్రమణం అంటే జరగడం, సంక్రమణం అంటే ప్రత్యేకమైన విశేషం కలిగి జరగడం అని అర్థం. ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. అందుకే ఈ రోజును మకర సంక్రమణ పర్వదినం అంటారు. మన పొంగలి లేదా పొంగల్ అర్థం కొత్త పంట పొంగడం. పొంగలి రోజు కొత్త పంట బియ్యాన్ని కొత్త కుండలో వేడి చేసి పొంగేటట్టు చేస్తారు. మనకు కావలసిన దానికన్నా మిగులు ఉండాలని ఆశిస్తారు.


పశువులని కూడా పండుగలో భాగస్వామ్యం చేసే రోజు కనుమ. ఈ రోజు వాటికి విశ్రాంతినిస్తారు. వాటి కొమ్ములకు ఆకర్షణీయమైన రంగులద్దడమే కాక, అందమైన బట్టలు కప్పుతారు. పూర్వకాలంలో ఇళ్లకి వెల్ల (సున్నం)వేసి పూర్తిగా శుభ్రం చేయించుకునేవారు. మూడు రోజుల ఈ పండుగలో మొదటిరోజు భోగిమంటలు వేసి వ్యర్థమైన గృహవస్తువులను ఆ మంటలలో వేస్తారు. రెండవరోజు పొంగలి బియ్యం పొంగిస్తారు. కనుమ రోజున పిల్లలు పెద్దల దీవెనలు కోరుకుంటారు, వారిని అనుసరిస్తారు. ఈ రోజున కోడి, మేక వంటి మాంసాహారం వండుకుంటారు. వైదిక కాలం ముందు ఇది అందరూ కొత్త పంట పండగగా జరుపుకునేవారు. అమెరికన్లు జరుపుకునే సంయుక్త పండుగ ‘థాంక్స్ గివింగ్’ వంటి సాంప్రదాయం వంటిదన్నమాట ఇది.


ఉన్న క్షణం కన్నా క్రితం క్షణం పాతది. ఉన్న క్షణం కన్నా వస్తున్న క్షణం కొత్తగా ఉంటుంది. క్షణం, క్షణం మారడమే కాదు, క్షణంలో ఉన్న అనుభవం కూడా మారాలి. అంటే పాత క్షణం కన్నా ఇప్పటిది అందంగా, ఈ క్షణం అనుభవిస్తున్న ఆనందం కన్నా వచ్చేది ఇంకా గొప్ప ఆనందాన్ని ఇచ్చేటట్టుగా ప్రతి క్షణం, ప్రతి రోజూ, ప్రతి చోటా అద్భుతమైన ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ తెలుగు ప్రజలందరికీ ఈ సందర్భంగా ‘పొంగలి’ శుభాకాంక్షలు.

కూసంపూడి శ్రీనివాస్

Updated Date - 2022-01-14T06:06:35+05:30 IST