మన సూపర్‌ కాప్స్‌

ABN , First Publish Date - 2021-09-05T06:14:14+05:30 IST

విధి నిర్వహణలో సవాళ్లను ఎదుర్కొంటూ చిత్తూరు జిల్లాకు చెందిన డీఎస్పీలు ఎనలేని విజయాలు సాధిస్తున్నారు.

మన సూపర్‌ కాప్స్‌
సుధాకర్‌రెడ్డి, చిత్తూరు డీఎస్పీ

  ఖాకీ యూనిఫారం అనగానే అంతులేని అధికారం అనుకుంటారు చాలా మంది. నిజానికి అదో కఠిన బాధ్యత. కత్తి పదును మీద సాగే నడక. క్రూరనేరస్థులు విసిరే సవాళ్ళపై నిరంతర పోరాటం. సవాలక్ష ఒత్తిళ్ల నడుమ చేయాల్సిన ఉద్యోగం. ప్రజల భద్రతకోసం ప్రాణాలొడ్డే పోలీసులకు పతకాలు, ప్రసంశలే కొండంత బలం. ఈ ఏడాది జిల్లా నుంచి జాతీయస్థాయి పురస్కారాలు అందుకున్న ముగ్గురు పోలీసు అధికారుల నేరప్రపంచపు ప్రయాణ అనుభవాలు ఈ ఆదివారం ప్రత్యేకం...


చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి: బుల్లెట్‌ కన్నా వేగం


చిత్తూరు - ఆంధ్రజ్యోతి: నేరాన్ని వెంటాడే నైజం ఆయనది. నేరానికీ నేరస్థులకీ మధ్య దూరం పెరగకముందే ఛేదించడానికి వ్యూహాత్మకంగా కదులుతారు. నేరాన్ని బట్టీ నేరస్థుల స్వభావాన్ని గుర్తిస్తారు. సాంకేతికతను నేరశోధనలో నైపుణ్యంగా వాడుకుంటారు. అందుకే క్లిష్టమైన కేసులను వేగంగా పరిష్కరించే చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి ని ఇండియన్‌ ప్రెసిడెంట్‌ పోలీసు మెడల్‌ వరించి వచ్చింది.  చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డికి ఇప్పటివరకు  450 రివార్డులు, 30 ప్రశంసాపత్రాలు వచ్చాయి. 2010లో సేవాపతకం, 2012లో ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌, 2015లో ఉత్తమ సేవా పతకం ఆయన ప్రతిభకు లభించిన పురస్కారాలు. కడప జిల్లా పెనగలూరులో పుట్టిన ఆయన కడప, చిత్తూరు జిల్లాల్లో చదువుకున్నారు. ఎస్‌ఐగా పోలీసు ఉద్యోగం మొదలుపెట్టిన ఆయన ప్రస్తుతం చిత్తూరు డీఎస్పీగా చేస్తున్నారు. తన ఉద్యోగ ప్రయాణం గురించి ఆయన మాటల్లోనే..

 ‘‘నాకు గ్రూప్‌-1 అధికారి కావాలనే కోరిక చదువుకునే రోజుల నుంచీ ఉండేది. అందుకే పీజీ పూర్తయిన వెంటనే హైదరాబాద్‌ వెళ్లి రెండేళ్ల పాటు శిక్షణ తీసుకున్నా. రెండుసార్లు గ్రూప్‌-1 పరీక్షలను పూర్తి చేసి ఇంటర్వ్యూలో తప్పాను. 1991లో ఎస్‌ఐ ఉద్యోగానికి దరఖాస్తు చేయగా.. తొలి ప్రయత్నంలోనే వచ్చింది. అనంతపురం పీటీసీలో శిక్షణ పూర్తి చేసుకున్న నాకు చిత్తూరు జిల్లా కేటాయించారు. నగరిలో ట్రైనీ ఎస్‌ఐగా పనిచేశాక.. ఏర్పేడులో ఎస్‌ఐగా తొలి పోస్టింగ్‌ ఇచ్చారు. అప్పట్లో ఎవ్వర్నీ ఖాతరు చేయకుండా విధులు నిర్వహించేవాడ్ని. అందుకే ఎస్‌ఐగా 13 ఏళ్లు పనిచేస్తే 10 స్టేషన్లు మారాల్సి వచ్చింది. 2005లో సీఐగా ప్రమోషన్‌పై నగరికి వెళ్లాను. 2008లో తిరుపతి అర్బన్‌ సీఐగా పనిచేశాను. 2010లో చిత్తూరు సీఐగా చేశాను. 2009 ఎన్నికల సమయంలో కళ్యాణదుర్గం, 2014లో తాడిపత్రి, 2019లో కర్నూలులో విధులు నిర్వర్తించాను. 2014లో డీఎస్పీగా ప్రమోషన్‌ వచ్చింది. సీఐగా పనిచేసిన చిత్తూరులో మళ్లీ డీఎస్పీగా పనిచేసే అవకాశం దక్కింది. తిరుపతి ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీగా ఉన్నప్పుడు కమాండ్‌ కంట్రోల్‌ కూడా నేనే పర్యవేక్షించేవాడ్ని. అప్పట్లో తిరుమలలో నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్‌ కేసును మూడు రోజుల్లో, మరో మహిళ హత్య కేసును వారం రోజుల్లో కేవలం సీసీ కెమెరాల ద్వారా ఛేదించాం. చిత్తూరులో డీఎస్పీగా నగరానికి చెందిన బద్రినారాయణ ఇంట్లో రూ.3 కోట్ల చోరీ జరిగితే మూడు రోజుల్లో దొంగను పట్టేశాం. రికార్డు స్థాయిలో వెయ్యి సెల్‌ఫోన్లను ఒకేసారి రికవరీ చేశాం. వెయ్యి ఎర్ర చందనం దుంగలను, వంద బైకులను పట్టుకున్నాం. ’’


మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి: రేపిస్టుల గుండెల్లో వణుకు


ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగితే.. కేవలం వారం రోజుల్లోనే నిందితుడ్ని కటకటాల వెనక్కి పంపిన చాకచక్యం ఆయనది. నేర శోధనలో లోతెరిగిన పోలీసు అధికారి. ఈ ఏడాది ఆయనకు కేంద్ర హోంమంత్రి పురస్కారం లభించింది.   కర్నూలులో పుట్టిన ఆయన చదువంతా కూడా అదే జిల్లాలో సాగింది. ఎస్‌ఐగా చిత్తూరు జిల్లాలో మొదలైన ప్రయాణం ఇదే జిల్లాలో డీఎస్పీగా కొనసాగుతోంది. మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి ఉద్యోగ ప్రయాణం ఇలా సాగింది..

‘‘ 1992లో పోలీస్‌శాఖలో ఎస్‌ఐ ఉద్యోగం వచ్చింది. ఐరాల, వాల్మీకిపురం, చిత్తూరు, తిరుమల, మదనపల్లెలో ఎస్‌ఐగా పనిచేశాను. 2005లో సీఐగా పదోన్నతి పొంది ఇంటెలిజెన్స్‌, చిత్తూరు ఈస్ట్‌ సర్కిల్‌, తిరుపతి టౌన్‌, సత్యవేడులో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాను. 2013లో సత్యవేడు సీఐగా పనిచేస్తున్న సమయంలో ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ అందుకున్నాను. 2014లో డీఎస్పీగా పదోన్నతి లభించింది.  కడప, తిరుపతి స్పెషల్‌ బ్రాంచ్‌లలో పనిచేసి 2019 జూలై 22న మదనపల్లె డీఎస్పీగా వచ్చాను. 2019 నవంబరులో కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని ఓ కళ్యాణమండపంలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని కేవలం వారం రోజుల్లోనే ఛేదించి నిందితుడు మహ్మద్‌ రఫీను అరెస్ట్‌ చేశాం. 30 మంది బృందంతో ఈ కేసును ఛేదించాం.  అన్ని ఆధారాలతో కూడిన చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేశాం. దీంతో చిత్తూరు న్యాయస్థానం నిందితుడికి ఉరి శిక్ష విధించింది. అయితే నిందితుడి కుటుంబీకులు న్యాయం కోసం హైకోర్టుకెళ్లగా, జీవితకాలం శిక్షను విధిస్తూ తీర్పు నిచ్చింది.’’


తిరుపతి ఏసీబీ డీఎస్పీ రవికుమార్‌: దారిదోపిడీ ముఠాలకు దడ


 దారి దోపిడీ ముఠాలకు ఆయన సింహస్వప్నం. కరడుగట్టిన నేరగాళ్ళ వేటలో ఆయన నెంబర్‌ ఒన్‌.  సరిహద్దులు దాటినా సరే నేరస్థులు ఆయన పట్టునుంచి తప్పించుకోలేరు. అనేక కేసులు ఛేదించిన తిరుపతి ఏసీబీ డీఎస్పీ రవికుమార్‌ను ఈ ఏడాది  ఇండియన్‌ పోలీసు మెడల్‌ వరించింది. గతంలోనూ సేవా పతకం, ఉత్తమ సేవాపతకం, ఉత్కృష్ట సేవాపతకం వచ్చాయి. 16 కమాండెషన్స్‌  లభించింది. ఒంగోలు జిల్లా కందుకూరులో పుట్టిన రవికుమార్‌ చిత్తూరు జిల్లాలోనూ చదువుకున్నారు. 26 ఏళ్ల పోలీసు ఉద్యోగంలో ఒక్క రిమార్కు కూడా లేని ఈ సూపర్‌ కాప్‌ నేరశోధనానుభవాలు ఆయన మాటల్లోనే...

‘‘ తిరుపతి ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో డిగ్రీ, ఎస్వీయూలో పీజీ చేశాను. 1995లో ఎస్‌ఐ ఉద్యోగం వచ్చింది. తొలుత కర్నూలు జిల్లా కలిమిగుంట్ల ఎస్‌ఐగా.. ఆ తర్వాత నంద్యాల, మహానంది, ఎమ్మిగనూరు, కర్నూలు 3, 1 టౌన్‌ స్టేషన్లలో పనిచేశాను. 2008 ఫిబ్రవరిలో సీఐగా పదోన్నతి లభించింది. పుట్టపర్తి అర్బన్‌,  నంద్యాల తాలూకా, 1 టౌన్‌, స్పెషల్‌ బ్రాంచి, పలమనేరు రూరల్‌, గంగవరం సర్కిల్‌, తిరుపతి ఏసీబీ సీఐగా విధులు నిర్వర్తించాను. 2020 డీఎస్పీగా పదోన్నతి పొందిన నాకు తిరుపతి ఏసీబీ డీఎస్పీగా నియమించారు. 1997, 98 ప్రాంతంలో కర్నూలు జిల్లాలో బస్‌ డెకాయిటీలు ఎక్కువగా జరుగుతుండేవి. చాలా సంత్సరాల వరకు వాటికి సంబంధించిన నేరస్తులను ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. అయితే.. 1999లో గిద్దలూరు నుంచి హైదరాబాద్‌ వేళ్లే బస్‌ను మహానంది ఫారెస్ట్‌లో ఐదుగురు దొంగలు దోచుకున్నారు. బ్యాగ్‌ ఇవ్వలేదని రాజు అనే ప్రయాణికుడిని  కత్తులతో పొడిచి చంపేశారు. అప్పుడు నేను నంద్యాల తాలూకా ఎస్‌ఐగా ఉన్నాను. సీఐ అందుబాటులో లేకపోవడంతో సిబ్బందితో టీమ్‌లను ఏర్పాటు చేసుకుని కూంబింగ్‌ ప్రారంభించాం. తెల్లవారి 5 గంటలకల్లా ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేశాం. ఇంతకు మునుపు జిల్లాలో జరిగిన నాలుగు బస్‌ డెకాయిటీలు కూడా వారే చేయడంతో అన్ని కేసుల మిస్టరీలు వీడిపోయాయి. ఉన్నతాధికారులు అభినందించి రూ.10 వేల నగదు బహుమతిని ఇచ్చారు. అలాగే అడ్వాన్స్‌ ఇంక్రిమెంట్‌తోపాటు సేవా పతకం కూడా ఇచ్చారు.  ఇంకో సందర్భంలో వాహనాలను నిలిపి దోచుకునే కరుడుగట్టిన కర్ణాటకకు చెందిన ముఠా ఒక పోలీసు అధికారిని హత్య చేసింది. పలమనేరు వద్ద  రెండు దోపిడీలు చేసింది.  ఒక సవాలుగా తీసుకుని కర్ణాటకకు వెళ్లి ఆ ముఠాను పట్టుకున్నాం. ’’

Updated Date - 2021-09-05T06:14:14+05:30 IST