మహమ్మారుల కాలంలో మన కర్తవ్యం

ABN , First Publish Date - 2020-03-17T06:11:09+05:30 IST

కరోనా వైరస్‌తో ప్రబలిన అంటువ్యాధి ప్రపంచ వ్యాప్త మహమ్మారిగా పరిణమించింది. ఆ విష క్రిమి తొలుత విజృంభించిన చైనాలో వ్యాధిగ్రస్తుల, మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయితే ఇటలీ, ఇరాన్, స్పెయిన్ మొదలైన దేశాలలో కరోనా మరణాల సంఖ్య పెరుగుతోంది...

మహమ్మారుల కాలంలో మన కర్తవ్యం

దేశ వ్యాప్తంగా ఎక్కడైనా సరే అంటు వ్యాధులు ప్రజ్వరిల్లడాన్ని సకాలంలో కనిపెట్టి, వాటి వ్యాప్తిని నిరోధించేందుకు తక్షణమే ప్రతిస్పందించే సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా 2004 ప్రారంభమైన ఐడిఎస్‌పి ని మరింతగా పటిష్ఠ పరచాలి. ప్రైవేట్ ఫార్మా సంస్థలకు పోత్సాహకాలు అందిస్తూనే ఐడిపిఎల్ లాంటి ప్రభుత్వ రంగ ఫార్మా సంస్థలను పునరుద్ధరించి తీరాలి.


కరోనా వైరస్‌తో ప్రబలిన అంటువ్యాధి ప్రపంచ వ్యాప్త మహమ్మారిగా పరిణమించింది. ఆ విష క్రిమి తొలుత విజృంభించిన చైనాలో వ్యాధిగ్రస్తుల, మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయితే ఇటలీ, ఇరాన్, స్పెయిన్ మొదలైన దేశాలలో కరోనా మరణాల సంఖ్య పెరుగుతోంది. ప్రజల ఆరోగ్యానికి వాటిల్లుతున్న పెనుముప్పుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలూ కరోనా వైరస్‌తో అల్లకల్లోలమవుతున్నాయి. పర్యాటక, ఆతిథ్య, విమానయాన రంగాలను అది ఇప్పటికే దుర్భలపరిచింది. కనీవినీ ఎరుగని స్థాయిలో ఆర్థిక విధ్వంసానికి కారణమవుతున్నది. అసలే పతనమవుతున్న చమురు ధరలకు కరోనా కల్లోలం తోడవడంతో భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. ఆరోగ్య రంగం ఏక కాలంలో రెండు తీవ్ర ఒత్తిళ్లతో సతమతమవుతున్నది. ఒకటి- కరోనా కేసుల పెరుగుదల; రెండు- మహమ్మారి నిరోధానికి అత్యవసరమైన మందులు, వైద్య సామగ్రి కొరత. ఈ ఆవశ్యక ఔషధాల ప్రధాన సరఫరాదారు చైనా కావడంతో సరఫరాల పరంపరకు తీవ్ర అవరోధమేర్పడింది. ప్రజారోగ్య భద్రత దృష్ట్యా ఈ రెండు ఒత్తిళ్ళు చాలా తీవ్రమైనవి. కరోనా, భావి మహమ్మారుల నెదుర్కోవడంలో ఇవి, ముఖ్యంగా మన దేశానికి మేలు కొలుపు కావాలి.


కరోనా సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పలు చర్యలను చేపట్టింది. విమానాశ్రయాలలో ప్రయాణీకులకు విధిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది; వీసా ఆంక్షలను జారీ చేసింది; ప్రభుత్వాసుపత్రులలో కరోనా వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక వార్డులనేర్పాటు చేసింది; స్వీయ ఏకాంత నిర్బంధానికి(సెల్ప్ క్వారంటైన్) మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది; తరచు చేతులు కడుక్కోవడం మొదలైన పరిశుభ్రతా సూత్రాలు పాటించేలా ప్రజలను ప్రోత్సహిస్తోంది; సామాజిక సమావేశాలపై ఆంక్షలు విధించింది; కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో ఈ అత్యవసర చర్యలను చేపట్టారు. ఈ శతాబ్ది తొలి దశకంలో ప్రబలిన సార్స్, ఏవియన్ ఇన్‌ఫ్లూయెన్జా, స్వైన్ ఫ్లూ మొదలైన మహమ్మారుల నెదుర్కోవడంలో సంచితమైన అనుభవాల నేపథ్యంలో ఆరోగ్య భద్రతా వ్యవస్థలో చోటు చేసుకున్న మార్పుల ఫలితమే ఈ అప్రమత్త చర్యలు. 


అంటు వ్యాధులను సమర్థంగా ఎదుర్కొనేందుకు 2004లో నాటి వాజపేయి ప్రభుత్వం ప్రపంచబ్యాంకు సహకారంతో ఆరోగ్య భద్రతా వ్యవస్థలో సంస్థాగత మార్పులకు పూనుకున్నది. వీటిలో భాగంగా ‘ఏకీకృత వ్యాధి నిఘా కార్యక్రమం (ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్-–ఐడిఎస్‌పి)’  ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే అంటు వ్యాధులు ప్రజ్వరిల్లడాన్ని సకాలంలో కనిపెట్టి, వాటి వ్యాప్తిని నిరోధించేందుకు తక్షణమే పటిష్ఠంగా ప్రతిస్పందించే సామర్థ్యాన్ని పెంపొందించడమే ఐడిఎస్‌పి లక్ష్యం. సూక్ష్మ జీవ శాస్త్రవేత్తలు, అం‍టు వ్యాధి శాస్త్రవేత్తలు, కీటక శాస్త్ర వేత్తలను సమష్టిగా వ్యాధి నిరోధానికి నియోగించడం ఈ కార్యక్రమంలో ఒక ప్రధాన భాగం. వుహాన్‌లో కరోనా వలే, మన దేశంలో ఎక్కడైనా సరే ఏ అంటు వ్యాధి ప్రబలినా దాన్ని చురుగ్గా అరికట్టేందుకు ఐడిఎస్‌పి విశేషంగా తోడ్పడుతుంది. ఈ ప్రతిస్పందనా వ్యవస్థను పటిష్ఠపరచడమే ప్రస్తుత కరోనా మహమ్మారి మనకు నిర్దేశిస్తున్న మొదటి కర్తవ్యం. సమృద్ధ నిధులు, తగిన సిబ్బందిని సమకూర్చడం ద్వారా ఐడిఎస్‌పి నిరంతరం క్రియాశీలంగా వుండేలా ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి. ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లాలోనూ అంటువ్యాధుల నిఘా విభాగం వుండి తీరాలి. ఈ విభాగాలన్నీ తప్పనిసరిగా కేంద్ర నిఘా విభాగంతో అనుసంధానమై వుండాలి. ఈ విభాగాలకు నేతృత్వం వహించే సీనియర్ అధికారులు కనీసం నెలకొక సారి సమావేశమవ్వాలి. అంటు వ్యాధుల కల్లోల కాలంలో అయితే అవసరం ఏర్పడినప్పుల్లా వారు విధిగా సమావేశమవ్వాలి. దురదృష్టవశాత్తు గత కొద్ది సంవత్సరాలుగా రాష్ట్ర, జిల్లా విభాగాలు పనిచేయడం లేదు. జిల్లా విభాగాలయితే సిబ్బంది కొరతను కూడా తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. ఆరోగ్య రంగంలో ప్రభుత్వ మదుపులు సమృద్ధంగా వున్నప్పుడు మాత్రమే ప్రజారోగ్య భద్రతా వ్యవస్థ చురుగ్గా వుండి, ప్రతి ఒక్కరికీ ఆరోగ్యభద్రతా భరోసా సమకూరగలదని కేరళలో ఇటీవల నిపా అంటువ్యాధి నియంత్రణ తీరుతెన్నులు స్పష్టం చేశాయి. జిల్లా ప్రభుత్వాసుపత్రులను ప్రైవేట్ రంగానికి అప్పగించేందుకు ప్రభుత్వం ఇటీవల పూనుకోవడం ఎంతైనా శోచనీయం. దీనివల్ల ఐడిఎస్‌పి బలహీనపడుతుంది. కరోనా కల్లోలం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఆస్పత్రులను ప్రైవేట్ రంగానికి అప్పగించాలన్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి. 


ఔషధ తయారీ రంగం (ఫార్మాస్యూటికల్ సెక్టార్) రూపు రేఖలు, పని చేస్తున్న తీరుతెన్నులను సమీక్షించాలి. ఇది, మన రెండో కర్తవ్యం. కరోనా కల్లోల్లాన్ని సమర్థంగా ఎదుర్కోవడంలో ఈ కర్తవ్యాల పాలన అత్యవసరమూ అతి ముఖ్యమూనూ. చైనా నుంచి అత్యవసర మందుల లేదా క్రియాశీల ఔషధ తయారీ పదార్థాల(ఎపిఐ ల సరఫరాలకు తీవ్ర అవరోధ మేర్పడినందున ఫార్మాస్యూటికల్ రంగం వ్యవహరాలను పునఃసమీక్షించి తీరాలి. ప్రపంచ దేశాలకు తయారైన మందుల సరఫరాదారులలో భారత్ అగ్రగామిగా వున్నది. అయితే బల్క్ డ్రగ్ సరఫరాలకు మన దేశం చైనాపై ఆధారపడడం ఒక వైపరీత్యం. పారాసిటమాల్, మెట్ఫార్మాన్ మొదలైన అత్యవసర ఔషధాలు, యాన్టీబయాటిక్స్‌ను కూడా మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అత్యవసర మందులకు సైతం ఒక పొరుగుదేశంపై ఆధారపడడం పరిశ్రమకు మేలు చేస్తుందేమో గానీ ప్రజారోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. 


గత శతాబ్ది చివరి దశకాలలో భారతీయ ఔషధ తయారీ రంగం ఇతోధిక పురోగతికి 1971లో తీసుకువచ్చిన పేటెంట్ చట్టం విశేషంగా కృషి చేసింది. ఈ చట్టం, పేటెంట్ డ్రగ్స్ ‘రివర్స్ ఇంజనీరింగ్’ను సుసాధ్యం చేయడం వల్లే భారతీయ ఫార్మా సంస్థలు విశేష ప్రగతి సాధించగలిగాయి. భారతీయ వైజ్ఞానిక, పారిశ్రామిక మండలి (సిఎస్ ఐఆర్) ఆధ్వర్యంలో జరిగిన ఉత్కృష్ట పరిశోధనలు కూడా మన ఫార్మా రంగం పురోగతికి విశేషంగా తోడ్పడ్డాయి. తత్ఫలితంగానే ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మా స్యూటికల్స్ లిమిటెడ్ (ఐడిపిఎల్), హిందుస్థాన్ యాన్టీబయాటిక్స్ లిమిటెడ్ మొదలైన ప్రభుత్వ రంగ ఫార్మా సంస్థలు ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన మందులను సరఫరా చేశాయి. అయితే, 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తరువాత ఈ ప్రభుత్వ రంగ ఫార్మా సంస్థలను పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా అవి పూర్తిగా ఖాయిలా పడ్డాయి. 2000 సంవత్సరం తరువాత అమల్లోకి వచ్చిన కొత్త పేటెంట్ చట్టం వెసులుబాటుతో ప్రైవేట్ ఫార్మా సంస్థలు తక్కువ వ్యయంతో ఔషధాలను తయారు చేసి, విదేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేయడం ప్రారంభించాయి. దేశంలో పెద్ద ఎత్తున మందులను తయారుచేయడానికి ప్రాధాన్యమిస్తున్నందున ప్రభుత్వం నుంచి ప్రైవేట్ ఫార్మా సంస్థలు పలు రాయితీలను కోరుతున్నాయి. ప్రభుత్వమేమో కొన్ని ఎపిఐల ఎగుమతిపై నిషేధం విధించింది. ఏమైనా ఎగుమతి మార్కెట్లను సంరక్షించుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరికీ ఆరోగ్యభద్రత సమకూర్చడమే లక్ష్యమైతే కొన్ని సంస్థాగత మార్పులను తప్పనిసరిగా సాధించవలసివున్నది. ఔషధ తయారీ రంగంలో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ సంపూర్ణ స్వావలంబన సాధించవలసిన అవసరం ఎంతైనా వున్నది. ఇందుకు సిఎస్‌ఐఆర్ ల్యాబ్స్‌లో ఔషధాల సంబంధిత పరిశోధన, అభివృద్ధికి నిధులు మరింతగా సమకూర్చవలసిన అవసరమున్నది. ప్రైవేట్ ఫార్మా సంస్థలకు పోత్సాహకాలు అందిస్తూనే ఐడిపిఎల్ లాంటి ప్రభుత్వ రంగ ఫార్మా సంస్థలను పునరుద్ధరించి తీరాలి. నిత్యావశ్యక మందులను దేశంలోనే తయారు చేసి, వాటిని చౌక ధరలకు ప్రజానీకానికి అందుబాటులో ఉంచడమే లక్ష్యం కావాలి. ప్రజారోగ్య అవసరాలకు అనుగుణంగా దేశీయ ఫార్మా పారిశ్రామిక రంగాన్ని తీర్చిదిద్దేందుకు ప్రస్తుతం రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వున్న ఫార్మాస్యూటికల్స్ విభాగాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నియంత్రణలోకి తీసుకురావాలి. ప్రాథమిక ఆరోగ్య భద్రతా వ్యవస్థను పటిష్ఠం చేయడం, దేశ ప్రజల ఆరోగ్య సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా ఔషధ తయారీ రంగాన్ని తీర్చిదిద్దడం భారత్ తక్షణ కర్తవ్యాలు అనే సత్యాన్ని కరోనా కల్లోలం స్పష్టం చేస్తున్నది. 

దినేశ్ సి శర్మ

(ది ట్రిబ్యూన్)

Updated Date - 2020-03-17T06:11:09+05:30 IST