మా పల్లె భారతి

ABN , First Publish Date - 2021-01-14T08:43:55+05:30 IST

తూరుపునుదయించే సూర్యుడి మల్లే మా పల్లె భారతి హరిత కిరణాల్ని మూటగట్టుకుని...

మా పల్లె భారతి

తూరుపునుదయించే సూర్యుడి మల్లే

మా పల్లె భారతి

హరిత కిరణాల్ని మూటగట్టుకుని

గూడెం గుండెలో కోడై కూస్తుంది

భళ్లున తెల్లవారంగనే

అడవుల్ని కప్పుకున్న చలికౌగిళ్లు

గుడిసెల ముందు నెగళ్లతో

పారాహుషారవుతుంటే

కొడవళ్లు నాగళ్లు చేతబూని

పొలం వైపు నడిచింది

మా పల్లె భారతి


జిన్నెచెట్టు చిటారుకొమ్మనున్న

తేనెపట్టు కోసం

గోనె సంచుల్ని తొడిగింది

మా పల్లె భారతి

కొండపై నుంచి పల్లెవైపు వంగిన

ఇంద్రధనుస్సును చూసి

పురివిప్పిన నెమలయ్యింది

మా పల్లె భారతి


సంక్రాంతి పండక్కు సకినాలు చేసి

ముంగిళ్ల నిండా ముగ్గుల్ని పరిచి

గొబ్బిళ్లపై పూల సిగ్గుల్ని వంచి

రేలా పాటల్లో గాలిపటమై ఎగిరింది

మా పల్లె భారతి

డూ..డూ..బసవలు సందడి చేయంగ

హరిదాసు కీర్తనకు

సరిగమలు పలికింది

గుమ్మిలో ధాన్యము దండిగా లేకున్నా

కొత్త అల్లుడికి తీపి పొంగలయ్యింది


పోరాట రైతుకు కవాతుగీతమై

పుడమిబిడ్డలకు మేలుకొల్పు పాడింది

కళ్లల్లో కన్నీళ్లు తచ్చాడుతుంటే

భోగిమంటల తోటి కాంతుల్ని చిమ్మింది

కోటి ఆశల వేకువకు స్వాగతం పలికింది

మా పల్లె భారతి...!

కటుకోఝ్వల రమేష్

Updated Date - 2021-01-14T08:43:55+05:30 IST