మన ధర్మాలు

ABN , First Publish Date - 2020-07-27T08:01:42+05:30 IST

సంప్రదాయ కుటుంబంలో జన్మించి ఆధునిక విద్య బాగా చదువుకొన్న గొప్ప విద్యావంతుడు ఒకసారి శృంగేరి జగద్గురువైన శ్రీ భారతీ మహా స్వామి దర్శనానికి

మన ధర్మాలు

సంప్రదాయ కుటుంబంలో జన్మించి ఆధునిక విద్య బాగా చదువుకొన్న గొప్ప విద్యావంతుడు ఒకసారి శృంగేరి జగద్గురువైన శ్రీ భారతీ మహా స్వామి దర్శనానికి వెళ్లాడు. అతడు గొప్ప పదవిలో కూడా ఉన్నాడు. తనకు తాను గొప్ప ఆధునిక విద్యావంతుడినని మురిసిపోయేవాడు. అయితే స్వామి వారి దర్శనానికి మొదటిసారి వెళ్లినపుడు అక్కడి శుద్ధ స్ఫటిక సమానంగా ఉన్న శుభ్రతను, పరిసర ప్రకృతి రమణీయతను చూసి ‘బ్రహ్మనందం’గా ఉంది అన్నాడు. అప్పుడు స్వామివారు.. ‘‘ఇంత ఆధునిక విద్యా శిక్షణా వ్యాసంగం, అలవాట్లు ఉన్నా అన్ని ఆనందాల కన్నా శ్రేష్ఠమైనది ‘బ్రహ్మానందం’ అనే భావం అతని మనస్సులో ఉదయించడం గొప్ప విశేషం’’ అన్నారు. అపూర్వమైన ఆనందాన్ని సామాన్య పదజాలంతో కాకుండా ‘బ్రహ్మానందం’ అని వ్యక్తపరచడం మన రక్తంలో ఇంకిపోయిన వేదాంత తాత్విక దృష్టిని తెలియజేస్తున్నది.


అలాగే ప్రభుత్వ బృందమొకటి ఒక కుగ్రామంలో ఏదో కార్యం నిమిత్తం వెళ్లింది. అక్కడ హోటళ్లు మొదలైన భోజన సదుపాయాలు లేవు. అక్కడి గ్రామపెద్ద ఇంట్లో వారికి భోజనం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ బృందం ఆ పెద్ద ఇంట్లో భోజనం చేసి సంతృప్తిగా ఆ ఇల్లాలి దగ్గరకు వెళ్లి ‘అన్నదాతా! సుఖీభవ’ అన్నారు. వెంటనే ఆమె తడుముకోకుండా ‘అతిథిదేవోభవ’ అన్నది. మన దేశంలో ఇలాంటి ధార్మిక పరిజ్ఞానం చాలామందిలో కన్పిస్తుంది. ఇవన్నీ మనకు ఆత్మగతంగా వచ్చినవి. వివాహ సందర్భంలో పెళ్లికి ముందు జరిపే ‘సమావర్తనం’ అనే కార్యక్రమంలో భాగంగా కొన్ని ఉపదేశాలు చేస్తారు. విద్య పూర్తి చేసుకొని, గృహస్థ ధర్మం స్వీకరించే ముందు ఇలాంటి ఉపదేశం జరుగుతుంది. ‘సత్యంవద’ అని మొదలుపెట్టి.. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ... వంటి ధర్మాలు ప్రబోధిస్తారు. ఈ విషయాలు జీవితాంతం గుర్తుంచుకోవాలి. కొన్ని వ్యక్తిగతమైనవి మరికొన్ని సమాజంతో సంబంధం ఉండేవి నేర్పిస్తారు. సమాజంలోని అన్ని వర్గాలూ ధార్మిక జీవితం గడిపేందుకు మన ఋషులు శ్లోకాలు, పద్యాలు, పాటలు... ఇలా ఎన్నో ఏర్పాట్లు చేశారు. ఆ ధర్మాలన్నింటినీ మన హృదయం నిండా నింపుకొంటే మనం సుఖమయ జీవనం గడిపేందుకు అవకాశం ఉంటుంది. శాస్త్రాల్లో చెప్పబడిన ఎన్నో విషయాలు మనకు తెలియకుండా మనం ఆచరించే అవకాశం ఉంది.  తెలిసినా ఆచరించకపోవడం తప్పు.


పఠకాః పాఠకాశ్చైవ యే చాన్యే శాస్త్ర చింతకాః

సర్వే వ్యసనినో మూర్ఖా యః క్రియావాన్‌ స పండితః

శాస్త్రాలను కేవలం చదివే వాళ్లు, చదివించేవాళ్లు విద్యావ్యసనం కలిగిన మూర్ఖులు. శాస్త్రాల్లో చెప్పబడిన వాటిని ఆచరించి చూపగలవారే పండితులు, విజ్ఞులు.  అంటే.. ఉపదేశ పాండిత్యంతో ప్రయోజనం లేదు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి.



- డా. పి. భాస్కరయోగి

Updated Date - 2020-07-27T08:01:42+05:30 IST