రోడ్డు కోసం పచ్చని పైరు ధ్వంసం

ABN , First Publish Date - 2021-10-24T06:07:05+05:30 IST

): ‘మాది రైతు ప్రభు త్వం. మా ముఖ్యమంత్రి రైతు పక్షపాతి. ఆయన చూపిన దారిలోనే మేమూ నడుస్తున్నామ’ని ప్రతి వేదికపైనా అధికార పార్టీ ఎమ్మెల్యేలు వల్లేవేసే మాటలివి.

రోడ్డు కోసం పచ్చని పైరు ధ్వంసం
తమ పొలానికి సంబంధించిన పత్రాలతో నిరసన తెలుపుతున్న రైతు నరసింహారెడ్డి కుటుంబసభ్యులు

మా ‘దారి’ రహదారి...!

భూముల విలువ పెంచుకునేందుకు అడ్డదారులు

పొలం విక్రయించనందుకు రైతు వరి పైరు మీదుగా దారి ఏర్పాటు

అడ్డొచ్చిన బాధితులను ఈడ్చిపారేసిన పోలీసులు

వంతపాడిన రెవెన్యూ అధికారులు

శింగనమల ఎమ్మెల్యే, ఆమె భర్త కుటుంబికుల తీరుపై సర్వత్రా విమర్శలు

ముఖ్యమంత్రి జగనే న్యాయం చేయాలని బాధిత రైతుకుటుంబికుల వేడుకోలు

అనంతపురం, అక్టోబరు23(ఆంధ్రజ్యోతి): ‘మాది రైతు ప్రభు త్వం. మా ముఖ్యమంత్రి రైతు పక్షపాతి. ఆయన చూపిన దారిలోనే మేమూ నడుస్తున్నామ’ని ప్రతి వేదికపైనా అధికార పార్టీ ఎమ్మెల్యేలు వల్లేవేసే మాటలివి. అవే మాటలను శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతితోపాటు ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి చెబుతుంటారు. ఆచరణలోకి వచ్చేసరికి ఆ మాటలకు విలువలేని పరిస్థితి నెలకొంది. ఇందుకు ఉదాహరణే బుక్కరాయసముద్రం మండలంలోని కొర్రపాడు ఘటన. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘మా దారి రహదారి’ అంటూ అధికార పార్టీ స్థానిక ప్రజాప్రతినిధి కుటుంబికులు సా గించిన దౌర్జన్యకాండ జిల్లా ప్రజానీకాన్ని విస్మయపరుస్తోంది. అధికార దర్పంతో సాగిస్తున్న అరాచకంపై ప్రజలు పెదవి విరుస్తుండటం గమనార్హం. పచ్చని వరి పైరును రైతు కుటుంబం ఎదుటే ట్రాక్టర్లతో తొ క్కించి, దారి ఏర్పాటు చేసుకోవడం చూస్తుంటే... వారి భూముల విలు వ పెంచుకునేందుకు స్థానిక ప్రజాప్రతినిధి కుటుంబం చూపుతున్న ఆరాటం ఏపాటిదో తేటతెల్లమవుతోంది. అధికారానికి దాసోహమనే విధంగా పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం వంతపాడటం దారుణమని పలువురు పేర్కొం టున్నారు. రూ.లక్షలు ఖర్చు చేసి సాగుచేసిన వరి పంటను నాశనం చేస్తుంటే... బాధిత రైతు కుటుంబం తల్లడిల్లిన తీరు వర్ణనాతీతం. వారి గోడును వినే నాథుడే లేకపోవడం చూస్తుం టే... అధికార అరాచకం ఏ స్థాయిలో పేట్రేగిపోతోందో ఈ సంఘటన తేటతెల్లం చేస్తోంది.



దౌర్జన్యకాండ ఇలా...

కొర్రపాడుకు చెందిన రైతు నరసింహారెడ్డి, అతడి భార్య లక్ష్మీదేవికి సంబంధించి చెదుల్ల రెవెన్యూ పొలంలోని సర్వే నెం బరు 141-2లో 4.66 ఎకరాల భూమి ఉంది. ఈ పొలానికి పై భాగంలో ఇటీవలే స్థానిక ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సమీప బంధువులు రోటరీపురం రెవెన్యూ పొలం సర్వే నెంబరు 39-1లో 9.60 ఎకరాలు, 39-2లో 7.85 ఎకరాలు మొత్తం 17.45 ఎకరాలను కొనుగోలు చే శారు. ఎమ్మెల్యే సమీప బంధువులు కొనుగోలు చేసిన ఈ పొలాలకు గ్రామ మ్యా ప్‌లో పది అడుగుల రస్తా కొర్రపాడు నుంచి చెదుల్ల మీదుగా జంతులూరు వరకు ఉంది. ఆ రస్తా మీదుగా కాకుండా రైతు నరసింహారెడ్డి పొలంలో దారి ఇవ్వాలనీ, లేకుంటే పొలమైనా అమ్మాలని ఆ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుల ద్వారా ఒత్తిడి తెచ్చారు. రైతు పొలం అమ్మేందుకు ససేమిరా అన్నాడు. దీంతో ఆ రైతుకు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. రైతు నరసింహారెడ్డికి చెందిన పొలం అనంతపురం-తాడిపత్రి హైవేకి అతి దగ్గరగా ఉండటంతోపాటు భూముల విలువ రూ.కోట్లల్లో పలుకుతోంది. ఈ నేపథ్యంలో రైతు నరసింహారెడ్డి పొలమైనా కొనుగోలు చేయాలి, లేదంటే ఆ భూమిలో నుంచి దారైనా తీసుకోవాలని ఎమ్మెల్యే కుటుంబికులు ఎత్తుగడ వేశారు. ఆ భూమిలో నుంచి దారి తీసుకుంటే వారి భూముల ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కు టుంబికులు.. రైతును నయానో...భయానో ఒప్పించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ రైతు భూమి అమ్మేందుకుగానీ, దారి ఇచ్చేందుకుగానీ ససేమిరా అన్నాడు. దీంతో అధికార దర్పంతో రెవెన్యూ అధికారులను రంగంలోకి దింపారు. ఎమ్మెల్యే కుటుంబికుల పొలాలకు దారి ఇవ్వాలంటూ ఆ రైతుకు ఆర్నెళ్ల కిందట నోటీసులిచ్చారు. ఆ రకంగా ఒత్తిడి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఆ రైతు ఒప్పుకోలేదు. దీంతో ఇగో దెబ్బతిందో ఏమోగానీ.. ఎమ్మెల్యే సమీప బంధువులు పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో శుక్రవారం రంగంలోకి దిగారు. వారి సమక్షంలోనే... మరికొన్ని రోజుల్లో కోతకు వచ్చే వరిపంట పొలాన్ని ట్రాక్టరుతో తొక్కించి, వారి పొలానికి దారిని దౌర్జన్యంగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో బాధిత రైతు భార్య ట్రాక్టర్‌కు అడ్డుపడేందుకు ప్రయత్నించింది. పోలీసులు ఆమెను బలవంతంగా అక్కడి నుంచి లాగిపడేశారు. ప్రాణం పో యినా పంటను మాత్రం ధ్వంసం కానీయనని పదే పదే రైతు భార్య ట్రాక్టరుకు అడ్డుపడింది. అక్కడే ఉ న్న తహసీల్దార్‌ సైతం ‘పంటను తొక్కించేయండి... మళ్లీ చూసుకుందాం’ అని అన్న మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.



దౌర్జన్యంగా పొలంలో రోడ్డు వేశారు: రైతు నరసింహారెడ్డి, భార్య లక్ష్మీదేవి

మాకున్నది ఈ ఒక్క పొలమే. దీనిపైనే ఆధారపడి బ తుకుతున్నాం. ఉన్నఫలంగా ఎమ్మెల్యే వారి భూమి వి లువను పెంచుకునేందుకు మా పొలంలో దౌర్జన్యం గా రోడ్డు వేశారు. పచ్చని పంట పొలాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో ట్రాక్టర్‌తో దున్నేశా రు. రెండు నెలలు ఆగండి... మళ్లీ రస్తా ఉంటే వేసుకోవచ్చని పదేపదే కాళ్లావేళ్లాపడినా... కనికరించలేదు. చివరికి ట్రాక్టర్‌ కింద పడుకుని నిరసన తెలిపినా చనిపోయినా పర్వలేదంటూ అధికారులు బెదిరించారు. మాకు సీఎం జగనే న్యాయం చేయాలి.


తహసీల్దార్‌ మహబూబ్‌ బాషా ఏమంటున్నారంటే...

రైతు నరసింహారెడ్డి రస్తాను ఆక్రమించుకున్నాడు. ఇతడి పొలంపైన ఉండే రైతులు కొంతకాలంగా దారి ఇప్పించాలని కోరుతున్నారు. దారిలేక వాళ్ల పొలాలు కూడా కొన్నేళ్లుగా బీడు పెట్టుకున్నారు. దాంతో ఆ రైతుల విన్నపం మేరకు గత జూలైలోనే దీనిపై రైతుకు నోటీసు ఇచ్చాం. కొర్రపాడు-జంతులూరు మధ్య 10 అడుగుల రస్తా ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. అందు లో భాగంగానే మొదట రైతు నరసింహారెడ్డి పొలం సర్వే నెంబరు 141-2లో దారిని క్లియర్‌ చేశాం, మరో రైతు పొలం సర్వే నెంబరు 142లోనూ దారిని క్లియర్‌ చేస్తాం. మొదట నరసింహారెడ్డి పొలం ఉంది కాబట్టి ఇందులో దారిని క్లియర్‌ చేశాం. ఈ ఘటనతో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి ఎలాంటి సంబంధం లేదు. రైతుల కోరిక మేరకే దారిని క్లియర్‌ చేశాం. పంట నష్టాన్ని వ్యవసాయ అధికారులతో అంచనా వేయించి, రైతుకు పరిహారం చెల్లిస్తాం.




దళితుల శ్మశాన వాటిక రహదారికి వైసీపీ నాయకుల కంచె

శవంతో బాధితుల ఆందోళన 

బుక్కరాయసముద్రం, అక్టోబరు 23: మండలంలోని జం తులూరు గ్రామంలో శనివారం దళితుల శ్మశానవాటిక రహదారి వివాదం ఆందోళనకు దారితీసింది. గ్రామంలో ఓ దళితుడు మృతిచెందడంతో ఖననం చేసేందుకు కాలనీవాసులు మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. శ్మశాన వాటిక రహదారికి గ్రామ వైసీపీ నాయకులు కంచె వేయడంతో దళితులు ఆగ్రహించారు. శవంతో అక్కడే ఆందోళనకు దిగారు. బాధితులు మాట్లాడుతూ గ్రామ పరిధిలో సర్వే నెంబరు 98లో దళితుల శ్శశానానికి వెళ్లే రహదారి ఉందన్నారు. 80 ఏళ్లుగా ఈ రహదారి వెంట వెళ్లి దహన సంస్కారాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపిన చిచ్చుతో వైసీపీ నాయకులు దళిత శ్మశాన వాటిక వివాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు. స్థానిక వైసీపీ నేత అండతో గ్రా మంలోని కొంతమంది రైతులు రహదారిని కం చెతో మూయించారన్నారు.   దీంతో  శ్శశానానికి రహదారి ఇవ్వాలని శవం తో దళితులు అందోళన చేపట్టారు. విషయం తె లుసుకున్న తహసీల్దార్‌ మహుబూబ్‌ బాషా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సర్వే నెంబరు 98లో రహదారి ఉందని రైతులతో మాట్లాడి, స మస్యను పరిష్కరించారు. గతంలో ఉన్న రహదారి కాకుండా మరోచోట ప్రత్యామ్నాయంగా ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో దళితులు అందోళన విరమించారు.

Updated Date - 2021-10-24T06:07:05+05:30 IST