గర్నికంలో జ్వరాల విజృంభణ

ABN , First Publish Date - 2021-07-29T05:30:00+05:30 IST

మండలంలోని గర్నికంలో జ్వరాలు విజృంభించాయి.

గర్నికంలో జ్వరాల విజృంభణ
రావికమతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గర్నికం జ్వర బాధితులు

15 మందికి డెంగ్యూ, 25 మందికి టైఫాయిడ్‌!



రావికమతం, జూలై 29: మండలంలోని గర్నికంలో జ్వరాలు విజృంభించాయి. గ్రామానికి చెందిన 40 మందికిపైగా జ్వరాలతో మంచం పట్టారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని, మందులు తీసుకుంటున్నప్పటికీ జ్వరాలు తగ్గడం లేదని వాపోతున్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి రక్త పరీక్షలు చేయించుకోగా 15 మందికి డెంగ్యూ లక్షణాలు వున్నట్టు నిర్ధారణ అయ్యిందని, మరో 25 మంది టైఫాయిడ్‌ బారినపడ్డారని గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామానికి చెందిన కేశంశెట్టి చిరంజీవి (30), కె.గణేశ్‌ (26), సత్తిబాబు (40), టి.రుపేశ్‌ (20), ఆదాడ అర్జున (25), నవర శ్యామ్‌ (23), తంగేటి జగదీశ్‌ (15), అనసూరి కాసులమ్మ (35), కొర్ని శ్రీలక్ష్మి (22), దాసరి గణేశ్‌ (26) తదితరులు జ్వరాలతో బాధపడుతున్నట్టు చెప్పారు. వీరిలో కొంతమంది ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం సాయంత్రం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి ఆస్పత్రికి వెళ్లి బాధితులతో మాట్లాడగా, ఏఎన్‌ఎం ఇచ్చిన మాత్రలతో జ్వరం తగ్గలేదని, దీంతో ప్రైవేటు ఆస్పత్రికి వచ్చామని చెప్పారు. కాగా గర్నికం గ్రామంలో జ్వరాలు ప్రబలడంపై రావికమతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీహెచ్‌వో మోహన్‌రావును వివరణ కోరగా, గర్నికం గ్రామంలో టైఫాడ్‌ జ్వరాలు ఉన్నట్టు గుర్తించామని, డెంగ్యూ లక్షణాలు నిర్ధారణ కాలేదని చెప్పారు.


ఎస్‌బీఐలో చోరీకి యత్నం

- గ్రిల్స్‌ తొలగించి లోపలికి ప్రవేశించిన దొంగలు

- సొత్తు భద్రమేనని ప్రకటించిన అధికారులు


తాటిచెట్లపాలెం, జూలై 29: నగరంలోని కంచరపాలెం ఐటీఐ జంక్షన్‌లో గల స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) శాఖలో బుధవారం రాత్రి చోరీ యత్నం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు గ్రిల్స్‌ తొలగించి బ్యాంకు లోపలకు ప్రవేశించారు. అయితే నగదు, నగలు ఏమీ అపహరణకు గురికాలేదని బ్యాంకు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే...బుధవారం సాయంత్రం బ్యాంకు సమయాలు ముగిశాక సిబ్బంది తాళాలువేసి వెళ్లిపోయారు. గురువారం ఉదయం యథావిధిగా బ్యాంకు తలుపులు తీశారు. విద్యుత్‌ సరఫరా లేకపోవడం, తీగెలు కట్‌ చేసి వుండడంతో అనుమానం వచ్చి బ్యాంకు ఆవరణ పరిశీలించారు. ఓ వైపు కిటికీ గ్రిల్స్‌ తొలగించి ఉండడం, కౌంటర్ల సొరుగులు తెరిచి వుండడంతో చోరీ యత్నం జరిగిందని అనుమానించారు. బ్రాంచి మేనేజర్‌ కె.శ్రీనువాసరావు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో  వెస్ట్‌ క్రైమ్‌ సీఐ లూథర్‌బాబు, కంచరపాలెం క్రైం ఎస్‌ఐ సుదర్శనరావులు సిబ్బందితో బ్యాంకుకు చేరుకున్నారు. బ్యాంకు సీసీ పుటేజీ పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు బ్యాంకులోకి ప్రవేశించినట్టు గుర్తించారు. అనంతరం బ్యాంకు సొత్తు ఏమీ పోలేదని అధికారుల ద్వారా నిర్ధారించుకుని కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-07-29T05:30:00+05:30 IST