మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో వైరస్‌ విజృంభణ

ABN , First Publish Date - 2021-04-14T05:20:21+05:30 IST

మెదక్‌ జిల్లాలో వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ పరీక్ష కేంద్రాల్లో మంగళవారం 555 మందికి ర్యాపిడ్‌ టెస్టులు చేయగా 89 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో వైరస్‌ విజృంభణ
కర్‌సగుత్తిలో మాస్క్‌ ధరించని వారి నుంచి జరిమానా వసూలు చేస్తున్న ఎంపీవో నరేశ్‌

మెదక్‌లో 89 మందికి కరోనా, ఒకరి మృతి

మెదక్‌ అర్బన్‌/తూప్రాన్‌/పెద్దశంకరంపేట, ఏప్రిల్‌ 13: మెదక్‌ జిల్లాలో వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ పరీక్ష కేంద్రాల్లో మంగళవారం 555 మందికి ర్యాపిడ్‌ టెస్టులు చేయగా 89 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. తూప్రాన్‌కు చెందిన 59 ఏళ్ల విశ్రాంత ఉపాధ్యాయురాలు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుప్రతిలో కొవిడ్‌తో చిక్సిత పొందుతూ మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆమెకు ఈనెల 9న తూప్రాన్‌లో పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా మంగళవారం నమోదైన కేసులను పరిశీలిస్తే... పెద్దశంకరంపేటలో 23, మెదక్‌లో 20, నర్సాపూర్‌లో 20, రామాయంపేటలో 10, సర్ధనలో 4, తూప్రాన్‌లో 3, గడ్డిపెద్దపూర్‌లో 3, పొడ్చన్‌పల్లిలో 3, రెడ్డిపల్లిలో 3, వెల్దుర్తిలో ఒకటి చొప్పున కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. జిల్లాలో ఇప్పటి వరకు 5,151 మంది కొవిడ్‌ బారినపడ్డారు. 4,053 మంది కోలుకుని ఆరోగ్యంగా ఉన్నా రు. ప్రస్తుతం 870 యాక్టివ్‌ కేసులుండగా... 45 మంది కొవిడ్‌తో మరణించారు.

సంతపై ప్రభావం..

తూప్రాన్‌ పట్టణంలోని మంగళవారం నిర్వహించే వారంతపు సంతపై కరోనా, ఉగాది పండుగ ప్రభావం చూపింది. వారంతపు సంతలో కిక్కిరిసి ఉండాల్సిన జనం కనిపించలేదు. ఒకరిద్దరు వ్యాపారులు దుకాణాలు పెట్టినప్పటికీ, ప్రజలు అంతగా సంతకు హాజరు కాలేదు. 

సంగారెడ్డి జిల్లాలో 123 మందికి పాజిటివ్‌

సంగారెడ్డి అర్బన్‌, ఏప్రిల్‌ 13 :  జిల్లాలో మంగళవారం కొత్తగా 123 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. జిల్లాలోని పటాన్‌చెరులో-25, సంగారెడ్డిలో-18, ఆర్సీపురంలో-7, నారాయణఖేడ్‌లో-23, జహీరాబాద్‌లో-16, సదాశివపేటలో-12, జోగిపేటలో-10, కోహీర్‌లో-3, కానుకుంటలో-3, కల్హేర్‌లో-2, మనూర్‌లో-2, రాయికోడ్‌లో ఇద్దరికి కరోనా సోకింది. పాజిటివ్‌ వచ్చిన 123 మంది హోంఐసోలేషన్‌లో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 4742 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేశారు. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల నిమిత్తం సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రి నుంచి 154 మంది, పటాన్‌చెరు నుంచి 150 మంది శాంపిళ్లు సేకరించి కొవిడ్‌ నిర్ధారణ కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి పంపారు.

మాస్కులు ధరించని వారికి జరిమానా

నాగల్‌గిద్ద/చిన్నశంకరంపేట: మాస్కులు ధరించకుండా తిరుగుతున్న నలుగురు వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ. వెయ్యి చొప్పున జరిమానా విధించినట్లు నాగల్‌గిద్ద మండల పంచాయతీ అధికారి నరేష్‌ మంగళవారం తెలిపారు. మండలంలోని కర్‌సగుత్తి గ్రామాన్ని అకస్మాత్తుగా సందర్శించి మాస్కులు ధరించకుండా తిరుగుతున్న వ్యక్తులకు జరిమానా విధించారు. ఆయన వెంట సర్పంచు సంజీవరెడ్డి ఉన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని వెంకట్రావుపల్లి, మడూర్‌ గ్రామాలను మంగళవారం ఎస్‌ఐ గౌస్‌ సందర్శించి కరోనా నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. మాస్కులు ధరించనివారికి మాస్కులను అందజేశారు. 

జోగిపేటలో రెండు మొబైల్‌ దుకాణాలు సీజ్‌

వట్‌పల్లి, ఏప్రిల్‌ 13 : కరోనా నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తున్న వ్యాపారులతో పాటు ప్రజలపై అందోల్‌- జోగిపేట మున్సిపల్‌ శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ అధికారి వినయ్‌ కొరడా ఝలిపిస్తున్నారు. సోమవారం  సాయంత్రం జోగిపేటలో మాస్కులు ధరించకుండా ప్రయాణిస్తున్న వారిపై జరిమానాలు విధించడంతో పాటు పలు దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు. పట్టణంలోని ప్రధాన రహదారి సమీపంలో మాస్కులు ధరించకుండా కొనుగోలు కోసం వచ్చిన వారికి వస్తువులు విక్రయిస్తున్న రెండు మొబైల్‌ దుకాణాలను సీజ్‌ చేశారు. ఈ ఘటన పట్టణంలో చర్చనీయాంశమైంది.  

కొనసాగుతున్న టీకా మహోత్సవం

రామాయంపేట : కొవిడ్‌-19 టీకా మహోత్సవాన్ని మంగళవారం రామాయంపేటలో నిర్వహించారు. రెండు రోజులుగా రామాయంపేట, ధర్మారం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది పండగ సెలవులు సైతం పక్కనపెట్టి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. పక్షం రోజుల్లో 3800 మందికి కొవిడ్‌ టీకా వేసినట్లు ఆరోగ్య విస్తీర్ణ అధికారి కరిపె రవీందర్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 

Updated Date - 2021-04-14T05:20:21+05:30 IST