ఉద్యాన రైతులకు ఊరట

ABN , First Publish Date - 2020-04-02T10:39:03+05:30 IST

జిల్లాలో ఉద్యాన ఉత్పత్తుల వాహనాలకు ఆంక్షలు సడలించామనీ, రైతులు అధైర్యపడొద్దని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు.

ఉద్యాన రైతులకు ఊరట

పంటల మార్కెటింగ్‌కు ఆంక్షల సడలింపు

ఐదు రోజుల్లో 9695.5 టన్నుల రవాణా

కలెక్టర్‌ గంధం చంద్రుడు


అనంతపురం, ఏప్రిల్‌1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉద్యాన ఉత్పత్తుల వాహనాలకు ఆంక్షలు సడలించామనీ, రైతులు అధైర్యపడొద్దని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గత ఐదు రోజుల్లో 9695.5 టన్నుల ఉద్యాన ఉత్పత్తులను రవాణా చేశామని బుధవారం ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఐదు రోజుల వ్యవధిలో 7885 టన్నుల అరటి, 460 టన్నుల టమోటా, 615 టన్ను ల కలింగర, 2.4 టన్నుల పూలు, 28 టన్నుల ద్రాక్ష, 75 టన్నుల మామిడి, కూరగాయలు 630 టన్నులు మార్కెట్‌ చేశామన్నారు. కావున ఉద్యాన పంటల కోతలు చేపట్టొచ్చన్నారు. జిల్లాలో 2.02 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయన్నారు.


తద్వారా ఏటా 58 లక్షల టన్నుల దిగుబడి వస్తోందన్నారు. నెలాఖరుకు జిల్లాలో అరటి 1.46 లక్షలు, చీనీ 1.20 లక్షలు, జామ 2200, నిమ్మ 1248, బొప్పాయి 42300, మామిడి 25840, కర్బూజా 3940, కలింగర 3600, టమోటా 75 వేలు, పచ్చిమిరప 3 వేలు, ఉల్లి 900, బెండ 5872 టన్నులు కోతకు వస్తాయన్నారు. మార్కెట్‌ విషయంలో రైతులకు ఆందోళన అవసరం లేదన్నారు. రైతుల సహాయార్థం క్షేత్రస్థాయిలో ఉద్యాన, మార్కెటింగ్‌ శాఖ సిబ్బందిని నియమించామన్నారు. జిల్లాకేంద్రంలో మార్కెటింగ్‌, ఉద్యాన, వ్యవసాయ, పోలీసు శాఖల ఉద్యోగుల సమన్వయంతో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. సమస్యలు తలెత్తితే కాల్‌ సెంటర్‌ నెంబరు 08554-275805కి, టోల్‌ఫ్రీ నెంబరు 1902కి ఫోన్‌ చేయాలని రైతులకు సూచించారు.

Updated Date - 2020-04-02T10:39:03+05:30 IST