విఘ్నచవితిపై ఆగ్రహావేశాలు

ABN , First Publish Date - 2021-09-09T05:37:34+05:30 IST

వినాయక చవితి బహిరంగ వేడుకలపై ప్రభుత్వం నిషేధం విధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విఘ్నచవితిపై ఆగ్రహావేశాలు
అద్దంకిలో అమ్మకాలను సిద్ధం చేసిన వినాయక విగ్రహాలు

ఉత్సవాలకు ప్రభుత్వం నిరాకరణ

ఇప్పటికే విగ్రహాలపై లక్షల పెట్టుబడి

అమ్మకాలు లేక తయారీదారుల లబోదిబో

కళాకారుల పరిస్థితి అగమ్యగోచరం

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ధార్మిక సంఘాలు

విఘ్నాలు తొలగించే వినాయకుని పండుగకే వరుసగా రెండో సంవత్సరం కూడా అడ్డంకి వచ్చిపడింది. చిన్న పెద్ద, పేద గొప్ప తేడా లేకుండా గ్రామగ్రామానా ఎంతో వైభవంగా, ఆనందంగా జరిగే వినాయక నవరాత్రి ఉత్సవాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత సంవత్సరం మొదటి వేవ్‌ కరోనా కారణంగా బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు అందరూ దూరంగా ఉన్నారు. ప్రస్తుతం జనజీవనం సాధారణంగా ఉండి రాజకీయపరమైన కార్యక్రమాలు, మీటింగులు సైతం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాలు జరుగుతాయని లక్షల పెట్టుబడి పెట్టి తయారీదారులు జిల్లాలో అనేక చోట్ల వినాయక విగ్రహాలు చేశారు. ప్రతి సంవత్సరం జిల్లావ్యాప్తంగా ఒంగోలు, సింగరాయకొండ, అద్దంకి, చీరాల, మార్కాపురం, కనిగిరి వంటి ప్రదేశాల్లో చిన్నా పెద్దా ఐదారు వేల విగ్రహాల అమ్మకాలు జరుగుతాయి. ఇక నవరాత్రుల సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు నిర్వాహకుల వద్ద నుంచి కళాకారులు అడ్వాన్స్‌ తీసుకున్నారు. అయితే రాష్ట్రప్రభుత్వం ఒక్కసారిగా ‘బహిరంగ ఉత్సవాల నిర్వహణ నిషేధం’ అంటూ ప్రకటించటంతో పరిస్థితి అయోమయంగా తయారైంది. 

ఒంగోలు (కల్చరల్‌), సెప్టెంబరు 8 : వినాయక చవితి బహిరంగ వేడుకలపై ప్రభుత్వం నిషేధం విధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక పక్క బహిరంగంగానే రాజకీయ కార్యక్రమాలు వేలమందితో నిర్వహిస్తూ మరోవైపు పండుగపై ఆంక్షలు పెట్టడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. గత దశాబ్దకాలంగా జిల్లాలో వినాయక ఉత్సవాలు నిర్వహించే వారి సంఖ్య  ఏటా పెరుగుతూ వస్తోంది. జిల్లా కేంద్రమైన ఒంగోలుతోపాటు, గ్రామాల వరకూ యువకులు కమిటీలుగా ఏర్పడి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా వివిధ రంగులు, ఆకృతిలో ఉండే వినాయక విగ్రహాల కోసం వారు తయారీదారులకు ఆర్డర్‌ ఇస్తుంటారు. అందుకు అనుగుణంగా వారు విగ్రహాల తయారీలో నైపుణ్యం ఉన్న కార్మికులను ఇతర రాష్ర్టాల నుంచి తీసుకొచ్చి, అందుకు కావాల్సిన ముడిసరుకుని కొనుగోలు చేసి వివిధ సైజులలో విగ్రహాలను తయారుచేస్తారు. ఈ ప్రక్రియ ఒక రోజులోనో, ఒక వారంలోనో అయ్యేది కాదు. ఇందుకోసం వారు ఐదారు నెలల ముందు నుంచే శ్రమిస్తారు. గత సంవత్సరం కరోనా తొలివేవ్‌ కారణంగా విగ్రహాల తయారీపై పెట్టిన పెట్టుబడి రాక దెబ్బతిన్నారు. ఈ ఏడాది అయినా ఆ నష్టాలను పూడ్చుకోవాలని కొంతమంది ఇందుకోసం అప్పులు తెచ్చి మరీ విగ్రహాలను తయారుచేశారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహణ కుదరదంటూ ప్రభుత్వం పండుగకు వారం ముందుగా ప్రకటించటంతో వారు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. మరోవైపు విగ్రహాల కోసం అడ్వాన్సు ఇచ్చిన నిర్వాహకులు తమ డబ్బు తమకు ఇచ్చేయమని వారిపై ఒత్తిడి పెడుతున్నారు. 


కళాకారులకూ కన్నీళ్లే

వినాయక నవరాత్రుల సందర్భంగా ఏర్పాటయ్యే సాంస్కృతిక కార్యక్రమాలతో జిల్లాలోని కళాకారులు సైతం ఉపాధి పొందుతారు. అయితే ప్రభుత్వ నిర్ణయంతో వారి పరిస్థితి దయనీయంగా తయారైంది. సినీసంగీత విభావరుల కోసం గాయనీ గాయకులు, వాద్య కళాకారులు, హరికథకులు, డప్పు కళాకారులు, పూల డెకరేషన్‌ వారు ఇలా అనేకమంది ఇప్పటికే వినాయక ఉత్సవ నిర్వాహకుల నుంచి అడ్వాన్సులు తీసుకున్నారు. ఈ ఉత్సవాల ద్వారా తమ పరిస్థితి కొంత మెరుగవుతుందని వారు ఆశించారు. అయితే ప్రస్తుతం కార్యక్రమాలు నిలిచిపోవటం, మరోవైపు తామిచ్చిన అడ్వాన్సులు తిరిగి ఇవ్వాలని నిర్వాహకులు ఒత్తిడి చేస్తుండటంతో ఏమి చేయాలో తోచక కళాకారులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇక జిల్లావ్యాప్తంగా నవరాత్రి ఉత్సవ పందిళ్లలో పూజల నిర్వహణతో పురోహితులు, ప్రసాదాల తయారీతో కేటరింగ్‌ పనివారు, మైకు లైటింగ్‌ వృత్తి చేసేవారు, పందిళ్లు వేసేవారు ఇలా అనేకమంది కనీసం మూడు నాలుగు నెలలు కుటుంబ పోషణకు సరిపడా సంపాదించేవారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో వారు సైతం ఆందోళన చెందుతున్నారు. 


ప్రభుత్వ నిర్ణయంపై నిరసనలు 

హిందువులు వైభవంగా జరుపుకునే అతిపెద్ద పండుగ వినాయక చవితి విషయంలో ప్రభుత్వం ఆంక్షలు విధించటంపై జిల్లాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేనతో పాటు, విశ్వహిందూ పరిషత్‌, భజరంగదళ్‌ వంటి వివిధ హిందూ ధార్మక సంఘాలు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.


Updated Date - 2021-09-09T05:37:34+05:30 IST