జీతాల్లేని జీవితాలు

ABN , First Publish Date - 2021-05-14T04:28:18+05:30 IST

జీతాల్లేని జీవితాలు

జీతాల్లేని జీవితాలు

ప్రభుత్వ ఆసుపత్రి ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఏడాదిగా వేతనాల్లేవు

కరోనా వేళ అత్యవసర పనులు చేస్తున్న కీలకమైన ఉద్యోగులు

రోజంతా శ్రమిస్తున్నా ఫలితం మాత్రం శూన్యం

పట్టించుకోని అధికారులు, ప్రభుత్వ పెద్దలు 



కరోనా కల్లోలంలో ప్రాణాలను పణంగా పెట్టి అవిశ్రాంతంగా పోరాడుతున్న వారియర్స్‌ వారు. అలాగని నెలకు రూ.వేలల్లో, రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటూ పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ప్రైవేట్‌ ఏజెన్సీల తరఫున నెలకు రూ.10వేల నుంచి రూ.15వేలకు మించని వేతనాలు తీసుకుంటారు. రెగ్యులర్‌ ఉద్యోగుల కంటే ఎక్కువగా శ్రమిస్తారు. ఇచ్చే పదివేలనూ దాదాపు ఏడాదిగా చెల్లించకపోవడంతో అప్పులు చేసుకుంటూ తింటున్నారు. గట్టిగా ప్రశ్నిస్తే ఉద్యోగం ఎక్కడ ఊడిపోతుందోనన్న భయంతో జీవిస్తున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న దాదాపు 200 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల దయనీయ పరిస్థితి ఇది. 


విజయవాడ, ఆంధ్రజ్యోతి : విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా ఉన్న కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద ఓ ప్రైవేట్‌ ఏజెన్సీ ద్వారా 110 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పదేళ్లకు పైగా సేవలందిస్తున్నారు. గత ఏడాది మార్చి నుంచి కరోనా కల్లోలం కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడి కార్యాలయం, కలెక్టర్‌ ఆదేశాల మేరకు కొవిడ్‌ ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌ ద్వారా మరో 120 మంది, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద మరికొందరిని ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. ఆసుపత్రిలో పారిశుధ్య పనులు చేసే స్వీపర్లు, రోగులను చక్రాల కుర్చీలు, స్ట్రక్చర్లపై వైద్యుల దగ్గరకు, వార్డులకు, ఆపరేషన్‌ థియేటర్లకు తీసుకెళ్లే ఎంఎన్‌వోలు, ఎఫ్‌ఎన్‌వోలు, ఈసీజీ, ఎక్స్‌రే, ల్యాబ్‌ టెక్నీషియన్లు, రేడియోగ్రాఫర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆపరేషన్‌ థియేటర్లలో టెక్నీషియన్లు, అసిస్టెంట్లు, టెలిఫోన్‌ ఆపరేటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు.. ఇలా దాదాపు 300 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు మూడు ప్రైవేట్‌ ఏజెన్సీల ద్వారా జీజీహెచ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత కరోనా విపత్తు సమయంలో 1,000 మందికి పైగా పాజిటివ్‌ బాధితులకు చికిత్స అందిస్తున్న పెద్దాసుపత్రిలో ప్రభుత్వ వైద్యులు, నర్సులు, పారామెడికల్‌, నాల్గో తరగతి ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, వైద్య సిబ్బంది సేవలే కీలకంగా మారాయి. 


ఏడాదిగా వేతనాలు లేక ఇబ్బందులు

ఏళ్ల తరబడి ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నా ఎలాంటి ఉద్యోగ భద్రత లేకపోగా, ఓ ప్రైవేట్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వారికి దాదాపు ఏడాదిగా జీతాలు ఇవ్వట్లేదు. మిగిలిన రెండు ప్రైవేట్‌ ఏజెన్సీల ఆధ్వర్యంలో పనిచేస్తున్న వారికి 5 నెలల నుంచి 10 నెలలుగా జీతాలు ఇవ్వలేదు. కొవిడ్‌ ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌ కింద గత ఏడాది, ఆరు నెలల కిందట తాత్కాలిక ప్రాతిపదికన అత్యవసరంగా తీసుకున్న తమకూ ఇంతవరకు ఒక్క నెల జీతం కూడా చెల్లించలేదని కొవిడ్‌ కాంట్రాక్టు ఉద్యోగులు వాపోతున్నారు. జీతాలు అడుగుతుంటే తమకు బిల్లులు చెల్లించడం లేదని, ఇంతవరకు అప్పు చేసి సిబ్బందికి జీతాలు చెల్లిస్తూ వచ్చామని, ఇప్పుడు అప్పు ఇచ్చేవారు కూడా లేరంటూ ప్రైవేట్‌ ఏజెన్సీల నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని ఆసుపత్రి అధికారులను అడుగుతుంటే ప్రభుత్వానికి బిల్లులు పంపించామని, ప్రభుత్వం మంజూరు చేసినా ట్రెజరీ నుంచి నిధులు విడుదల చేయడం లేదని చెబుతున్నారు.


ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌లో విలీనం చేయరేం? 

రాష్ట్రంలోని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వారికి రెగ్యులర్‌ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే అన్ని సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఇక మీదట ఈ కార్పొరేషన్‌ ద్వారానే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రాష్ట్రంలోని ఇతర బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ కార్పొరేషన్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. కానీ, జీజీహెచ్‌లో సంవత్సరాల తరబడి పనిచేస్తున్న తమను మాత్రం కార్పొరేషన్‌లో విలీనం చేయకుండా తాత్సారం చేస్తున్నారని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు వాపోతున్నారు. తమను ప్రైవేట్‌ ఏజెన్సీల కిందే కొనసాగిస్తే ఒక్కో ఉద్యోగిపైన కనీసం నెలకు రూ.3వేలు కాంట్రాక్టర్లకు మిగులుతుందని, అదికాక కాంట్రాక్టు ఒప్పందంలో చూపినంత మంది సిబ్బందితో కాకుండా తక్కువ మంది ఉద్యోగులతో పనిచేయిస్తూ, పూర్తిస్థాయిలో బిల్లులు చేయించుకుంటూ లబ్ధి పొందుతున్నారని ఆరోపిస్తున్నారు. పూర్తి అటెండెన్స్‌తో బిల్లులు చేస్తున్నందుకు ప్రైవేట్‌ ఏజెన్సీల నిర్వాహకులు ఆసుపత్రి అధికారులకు ప్రతినెలా ముడుపులు ఇస్తున్నారంటున్నారు. 


గత ఏడాది పనిచేసిన వారి పరిస్థితీ అంతే.. 

గత ఏడాది కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ఇదే కొవిడ్‌ ఆసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో రోగులకు సేవలందించిన జూనియర్‌ డాక్టర్లకు వేతన బకాయిలు చెల్లించకుండా అర్థంతరంగా విధుల నుంచి తొలగించారు. వారు ఆసుపత్రి ఎదుటే రిలే నిరాహార దీక్షలు చేసినా అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో వారంతటవారే ఆందోళనను విరమించి వెళ్లిపోయారు. ప్రస్తుతం కరోనా కల్లోలం నేపథ్యంలో ఆసుపత్రికి అవసరమైన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని అత్యవసరంగా కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకునేందుకు ఉన్నతాధికారులు అనుమతులు ఇచ్చినా ఎవరూ ముందుకు రావడం లేదు. 

Updated Date - 2021-05-14T04:28:18+05:30 IST