1,465 ప్రైవేటులో పడకలు ఖాళీ

ABN , First Publish Date - 2020-07-29T08:51:18+05:30 IST

కరోనా కేసులు పెరుగుతూపోతున్నాయి. సోమవారం సాయంత్రం సమయానికి రాష్ట్రంలో కొత్తగా

1,465  ప్రైవేటులో పడకలు ఖాళీ

  • తొలిసారి ఆరోగ్యశాఖ వివరాల వెల్లడి
  • సర్కారు ఆస్పత్రుల్లో 6,204 బెడ్స్‌ ఖాళీ
  • కొత్తగా మరో 1,610 పాజిటివ్‌లు
  • 59 పేజీలతో మీడియా బులెటిన్‌ 

హైదరాబాద్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): కరోనా కేసులు పెరుగుతూపోతున్నాయి. సోమవారం సాయంత్రం సమయానికి రాష్ట్రంలో కొత్తగా మరో 1,610 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 57,142కు చేరింది. మరో 9 మంది ఇన్ఫెక్షన్‌తో మృతిచెందడంతో మరణాల సంఖ్య 480కు చేరింది. మరో 803 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కావడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 42909కు చేరింది. ఈ లెక్కన ప్రస్తుతం రాష్ట్రంలో 13,753 యాక్టివ్‌ కొవిడ్‌ కేసులు ఉన్నాయి. సోమవారం ఒక్కరోజే 15,839 రక్త నమూనాలు సేకరించగా, అందులో 809 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని బులెటిన్‌లో పేర్కొంది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి మీడియా బులెటిన్‌లో మార్పులు చేసి విడుదల చేశారు. తొలిసారిగా కొవిడ్‌ చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల లభ్యత, రోగుల సంఖ్యకు సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రకటించారు.


ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లో 1,465 పడకలు ఖాళీగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. మొత్తం 55 ఆస్పత్రుల్లో కొవిడ్‌ చికిత్సకు 4,497 పడకలు కేటాయించగా 3,032 మంది రోగులు చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది. కరోనా చికిత్స అందిస్తున్న 57 సర్కారీ ఆస్పత్రుల్లో 8,446 పడకలుంటే 2,242 మంది రోగులు చికిత్స తీసుకుంటున్నారని, మరో 6204 పడకలు ఖాళీగా ఉన్నాయని స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీలో 531, రంగారెడ్డిలో 172, వరంగల్‌ అర్బన్‌లో 152, మేడ్చల్‌లో 113, సంగారెడ్డిలో 74, కరీంనగర్‌లో 48 కేసులు నమోదయ్యాయి. 


జిల్లాలవారీగా ఎక్కడెక్కడ కట్టడి ప్రాంతాలు ఉన్నాయనే వివరాలను జోడించి 59 పేజీల మీడియా బులెటిన్‌ను విడుదల చేశారు. జిల్లాల్లోనూ కరోనా వేగంగా వ్యాపిస్తోంది. మంగళవారం ఒక్కరోజే ఖమ్మం జిల్లాలో 54, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం 207 శాంపిళ్లు సేకరించగా 54 మందికి పాజిటివ్‌ రావడం గమనార్హం. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో చెరో 57.. గద్వాల జిల్లాలో 28, నారాయణపేట జిల్లాలో 7, వనపర్తి జిల్లాలో 4 కేసులు కొత్తగా నిర్ధారణ అయ్యాయి. గద్వాల ప్రభుత్వ ఆస్పత్రిలో ముగ్గురు వైద్యులు, ఇదే జిల్లా పరిధిలో మరో నలుగురు వైద్య సిబ్బందికి ఇన్ఫెక్షన్‌ ప్రబలింది. నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలోని కరోనా వార్డులో నకిరేకల్‌కు చెందిన ఓ వృద్ధుడు(67) చికిత్సపొందుతూ మృతిచెందాడు. 


అందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతుడి కుటుంబీకులు ఆస్పత్రిలోని అద్దాలను ధ్వంసం చేశారు.  వేములవాడ పట్టణంలో కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి కి అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని అంబులెన్స్‌లో కొడుముంజ, అగ్రహారం, శాభా్‌షపల్లి శ్మశానవాటికలకు తీసుకెళ్లారు. అయితే మూడు గ్రామాల్లోనూ స్థానికులు అడ్డుకున్నారు. చివరకు వేములవాడలోని మూలవాగు శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపారు. ఇక కరోనా సోకడంతో హోం ఐసొలేషన్‌ కోసం గుట్టల్లో గడుపుతున్న ఇద్దరు మహబూబాబాద్‌ జిల్లా ఏఆర్‌ కానిస్టేబుళ్లకు అధికారులు ఐసొలేషన్‌ వసతి కల్పించారు. వారి దయనీయ స్థితిపై ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందనగా ఈ చర్యలు తీసుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 7,948 మందికి వైరస్‌ నిర్ధారణ కాగా 58 మంది మృతి చెందారు.

Updated Date - 2020-07-29T08:51:18+05:30 IST