ఒకే రోజు 2.25 కోట్ల డోసులు

ABN , First Publish Date - 2021-09-18T08:03:16+05:30 IST

ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న భారత్‌ శుక్రవారం సరికొత్త రికార్డును సృష్టించింది. రాత్రి 9 గంటల 47 నిమిషాల వరకు దేశవ్యాప్తంగా 2.25 కోట్లకుపైగా టీకా డోసులు...

ఒకే రోజు 2.25 కోట్ల డోసులు

  • వ్యాక్సినేషన్‌లో భారత్‌ మరో రికార్డు
  • ఇది మోదీకి పుట్టినరోజు కానుక: కేంద్రం 

న్యూఢిల్లీ, సెప్టెంబరు 17 : ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న భారత్‌ శుక్రవారం సరికొత్త రికార్డును సృష్టించింది. రాత్రి 9 గంటల 47 నిమిషాల వరకు దేశవ్యాప్తంగా 2.25 కోట్లకుపైగా టీకా డోసులు ఇచ్చారు. గత నెల రోజుల వ్యవధిలో ఒకేరోజు కోటికిపైగా డోసుల వ్యాక్సిన్‌ ఇవ్వడం ఇది నాలుగోసారి. దీంతో దేశంలో ఇప్పటివరకు టీకాలు వేయించుకున్న వారి సంఖ్య 79 కోట్లు దాటింది. ఈసందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘ఒక్క రోజులోనే 2 కోట్ల మందికిపైగా వ్యాక్సిన్‌ ఇవ్వడం చరిత్రాత్మకం. ఇది శుక్రవారం పుట్టిన రోజు జరుపుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి దేశ ప్రజలు, ఆరోగ్య కార్యకర్తలు అందించిన కానుక. వెల్‌ డన్‌ ఇండియా.. హ్యాపీ బర్త్‌ డే మోదీజీ’’ అంటూ  ట్వీట్‌ చేశారు. శుక్రవారం చాలా వేగంగా వ్యాక్సినేషన్‌ జరిగినట్లు నేషనల్‌ హెల్త్‌ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏ) చైర్మన్‌ డాక్టర్‌ ఆర్‌.ఎ్‌స.శర్మ ట్వీట్‌ చేశారు. 

అక్టోబరు మొదటివారంలోగా దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలన్న యోచనలో కేంద్ర ఆరోగ్యశాఖ ఉంది. 2001 అక్టోబరు 7న ప్రధాని మోదీ గుజరాత్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 20 ఏళ్లవడం మరో ముఖ్యమైన అంశమని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారి ఒకరు తెలిపారు. కాగా, వయోజనుల్లో 100 శాతం మందికి  ఒక డోసు టీకా అందించిన గోవాలోని ఆరోగ్య కార్యకర్తలు, టీకా లబ్ధిదారులతో ప్రధాని మోదీ శనివారం (సెప్టెంబరు 18న) వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంభాషించనున్నారు.


దేశవ్యాప్తంగా శుక్రవారం 34,403 కొవిడ్‌ కేసులు నమోదవగా,  23,260 కేసులు ఒక్క కేరళలోనే నిర్ధారణ అయ్యా యి. 320 కరోనా మరణాలు సంభవించగా, మృతుల్లో సగం మందికిపైగా (178 మంది) కేరళవారే. గత 24 గంటల్లో 15.27 లక్షల టెస్టులు జరగగా, అందులో 1.28 లక్షల టెస్టులు కేరళలో జరిగాయి. చైనాలోని 140 కోట్ల జనాభాలో 100 కోట్ల మందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తయింది.  కొవిడ్‌ ముప్పు ఎక్కువగా ఉన్న వర్గాల ప్రజలకు ఎలీ లిల్లీ కంపెనీ యాంటీబాడీ ఔషధాన్ని ఇచ్చేందుకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అనుమతులు మంజూరుచేసింది. 


95శాతం పోలీసుల్లో, 78శాతం పిల్లల్లో యాంటీబాడీలు

జమ్మూకశ్మీర్‌లోని సాధారణ పౌరుల కంటే పోలీసుల్లో ఎక్కువ సంఖ్యలో కొవిడ్‌ యాంటీబాడీలు ఉన్నట్లు శ్రీనగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల అధ్యయనంలో వెల్లడైంది. కశ్మీర్‌లోని 10 జిల్లాలకు చెందిన పలువురు పోలీసు సిబ్బంది రక్త నమూనాలను సేకరించి పరీక్షించగా.. 95 శాతం మందిలో యాంటీబాడీలు విడుదలైనట్లు గుర్తించారు.  ఇంకా టీకా అందుబాటులోకి రాని ఏడేళ్ల నుంచి 18 ఏళ్లలోపు పిల్లల్లోనూ 78 శాతం మందిలో కొవిడ్‌ యాంటీబాడీలను గుర్తించడం గమనార్హం.


Updated Date - 2021-09-18T08:03:16+05:30 IST