భారత్ కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్‌కు 30 దేశాల గుర్తింపు!

ABN , First Publish Date - 2021-10-15T20:25:28+05:30 IST

భారత దేశ కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్‌కు సుమారు 30 దేశాలు

భారత్ కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్‌కు 30 దేశాల గుర్తింపు!

న్యూఢిల్లీ : భారత దేశ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌కు సుమారు 30 దేశాలు మ్యూచువల్ రికగ్నిషన్ ఇచ్చాయి. ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, నేపాల్, బెలారస్, లెబనాన్, అర్మేనియా, ఉక్రెయిన్, బెల్జియం, సెర్బియా తదితర దేశాలు భారత దేశంతో ఈ మేరకు మ్యూచువల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. 


బ్రిటన్ ఇటీవలి వరకు భారత దేశం జారీ చేసిన కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్‌కు గుర్తింపు ఇవ్వలేదు. భారత్ నుంచి వచ్చేవారు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని ఆంక్షలు విధించింది. అంటే భారత దేశం జారీ చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను గుర్తించడానికి తిరస్కరించిందన్నమాట. ఇరు దేశాల మధ్య అనేకసార్లు చర్చలు జరిగిన తర్వాత భారత్ నుంచి బ్రిటన్ వెళ్ళేవారిపై ఆంక్షలను అక్టోబరు 11 నుంచి తొలగించింది. 


బ్రిటిష్ హై కమిషన్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ప్రజలు మరింత సురక్షితంగా, ఆమోదయోగ్యంగా, స్వేచ్ఛగా మళ్ళీ ప్రయాణించడానికి తీసుకున్న మరొక చర్య వ్యాక్సినేషన్ సర్టిఫికేషన్ ఎక్స్‌టెన్షన్ అని తెలిపారు. ప్రజారోగ్యాన్ని కాపాడుతూనే ప్రయాణించడానికి ఇది వీలు కల్పిస్తుందన్నారు. 


ఇదిలావుండగా, అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు నవంబరు నుంచి అమెరికా అనుమతి ఇచ్చింది. భారత దేశంలో తయారైన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు మాత్రమే అమెరికా ఆమోదం లభించింది. 


ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇప్పటి వరకు ఏడు వ్యాక్సిన్లను ఆమోదించింది. మోడెర్నా, ప్ఫైజర్-బయోఎన్‌టెక్, జాన్సన్ అండ్ జాన్సన్, ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా, కొవిషీల్డ్ (ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా ఫార్ములేషన్), చైనాకు చెందిన సినోఫార్మ్, సినోవాక్‌లకు ఆమోదం లభించింది.



Updated Date - 2021-10-15T20:25:28+05:30 IST