వేలం షురూ!

ABN , First Publish Date - 2021-06-13T08:33:37+05:30 IST

భూముల అమ్మకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చకచకా పావులు కదుపుతోంది.

వేలం షురూ!

  • తొలి దశలో రూ.2 వేల కోట్లకు పైగా లక్ష్యం!
  • 65 ఎకరాల వేలానికి ప్రకటన జారీ..
  •  కోకాపేట్‌, ఖానామెట్‌లలో భూములు
  • ప్రభుత్వ కనీస ధర ఎకరా రూ.25 కోట్లు.. 
  • వేలంలో రూ.40 కోట్ల దాకా పలికే అవకాశం


హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): భూముల అమ్మకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చకచకా పావులు కదుపుతోంది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములతో పాటు గృహ నిర్మాణ సంస్థ అధీనంలో ఉన్న స్థలాలు, ఇళ్ల అమ్మకంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం  ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఇందుకు శ్రీకారం చుట్టారు. ఖాళీ భూముల గుర్తింపును ఆయన రెండు నెలల కిందటే ప్రారంభించారు. ఆయా ప్రభుత్వ విభాగాల వద్ద ఎంతెంత భూమి ఖాళీగా ఉందనే విషయమై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర శాఖల కార్యదర్శులతో భేటీ అయి యుద్ధ ప్రాతిపదికన వివరాలు సేకరించారు. వెంటనే భూముల అమ్మకం జరిగిపోవడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. 


ఇక జాప్యమేల అన్నట్లు ఈ-వేలానికి కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తొలి ప్రయత్నంలోనే రూ.2 వేల కోట్ల మేర సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా రాజధానిలో అత్యంత ఖరీదైన రెండు ప్రాంతాల్లో భూముల అమ్మకానికి సంబంధించి వేలం ప్రకటన కూడా జారీ చేసింది. కోకాపేటలో 50 ఎకరాల విస్తీర్ణంలోని ఎనిమిది ప్లాట్లు, ఖానామెట్‌లోని 15 ఎకరాల విస్తీర్ణంలోని ఐదు ప్లాట్లు... మొత్తం 65 ఎకరాలు వేలానికి రానున్నాయి. యాభై ఎకరాలు హెచ్‌ఎండీఏ ఆధీనంలో ఉండగా, 15 ఎకరాలు టీఎ్‌సఐఐసీ పరిధిలో ఉన్నాయి. వీటి కనీస ధరను రూ.25 కోట్లుగా నిర్ణయించారు. అంటే, కనీస ధర ప్రకారం చూసుకున్నా 65 ఎకరాలకు రూ.1625 కోట్లు వస్తాయి. రెండుచోట్లా భూముల మార్కెట్‌ ధరలు ఎకరా రూ.40 కోట్ల దాకా పలుకుతున్నాయి. అంటే, రెండు వేల కోట్లకు పైగా వచ్చేఅవకాశం ఉంది. 


ఈ రెండు భూముల ఈ-వేలం ప్రకటన ప్రకారం ఈ నెల 15న ఈ-వేలానికి సంబంధించి నోటిఫికేషన్‌ జారీ కానుంది. వచ్చే నెల 15, 16 తేదీల్లో ఈ భూములను వేలం వేయనున్నారు. ఎటు చూసినా ఆకాశ హర్మ్యాలు కనిపించే కోకాపేట ఇపుడు అత్యంత విలువైన ప్రదేశంగా మారింది. అలాంటిచోట చుట్టూ ఉన్న ఐటీ టవర్ల మధ్య హెచ్‌ఎండీఏ గోల్డెన్‌ మైల్‌ లే అవుట్‌ పేరుతో ఏకంగా 165 ఎకరాల లేఅవుట్‌ను వేసింది. ఇది అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు ఆనుకుని ఉండటంతో దీనికి ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు. పైగా, ఇది అంతా చదను భూమి. అంటే, కొన్న వాళ్లకు అభివృద్ధి వ్యయం తక్కువ. ఇక చుట్టూ కొండలు, పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది. పైగా, వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించారు. అంటే, భారతదేశంలో శాఖలు ఉన్న విదేశీ కంపెనీలు పోటీపడే అవకాశం ఉంది. 


ఇక్కడ ఐటీ కంపెనీల కోసం బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడానికి అనుగుణంగా హెచ్‌ఎండీఏ ఈ స్థలాన్ని అభివృద్ధి చేస్తోంది. అందులో ఒకేచోట ఉన్న సుమారు 50 ఎకరాలను వేలానికి పెట్టారు. హెచ్‌ఎండీఏ దీన్నే ’నియోపోలి్‌స’గా పరిగణిస్తోంది. కరోనా పరిస్థితుల్లో డిమాండ్‌ తగ్గి ఎకరా రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు పలికినా రూ.2000 కోట్ల లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రభుత్వం ధీమాగా ఉంది. ఇక్కడ హెచ్‌ఎండీఏకు ఇప్పటికీ వంద ఎకరాలకు పైగా ఉంది. ఇందులో కొంత రోడ్లు, ఇతర అవసరాలకు పక్కనబెట్టారు. ఇక హైటెక్స్‌ పక్కనే ఖానామెట్‌లో టీఎ్‌సఐఐసీ 15 ఎకరాల్లో ఐదు ప్లాట్లను వేలానికి పెట్టింది. ఇక్కడ ఎకరా రూ.40-రూ.50 కోట్లకు తగ్గదని ప్రభుత్వం భరోసాగా ఉంది. భూముల వేలానికి ఇది ప్రారంభం మాత్రమే. కొద్ది రోజుల్లో ఇలాంటి వేలం ప్రకటనలు మరిన్ని జారీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. 



Updated Date - 2021-06-13T08:33:37+05:30 IST