జగన్మోసావతారం...

ABN , First Publish Date - 2020-08-15T07:02:43+05:30 IST

కరోనా బారిన పడి ప్రజల ప్రాణాలు పోతుంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఫిడేలు వాయించుకుంటున్నారు.

జగన్మోసావతారం...

కరోనా బారిన పడి ప్రజల ప్రాణాలు పోతుంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఫిడేలు వాయించుకుంటున్నారు. ప్రతి రోజు 10వేల కరోనా కేసులు, 100 మరణాలు. కరోనా బాధితులు వైద్యం అందక, వసతులు లేక ప్రాణాలు రక్షించమని వేడుకుంటున్నారు! 108 అంబులెన్స్‌లు ఏవీ?


మహాప్రభో... ఎవరైనా ఒక్క ఛాన్సు ఇమ్మని అడిగారంటే అప్పటికి ఉన్నచోటు నుంచి మరింత ఎత్తుకు తీసుకుపోవడానికి, మరిన్ని ప్రయోజనాలు ఇవ్వడానికి, అప్పుడున్నవారికన్న తమ సత్తా ఎక్కువని చూపడానికి అడిగారని అర్థం. కాని భాషకూ సమాజానికీ తెలిసిన ఆ అర్థాన్ని తలకిందులుగా మార్చేసిన ఘనత మీదే. ఇంకా కిందికి లాగడానికి, దిగజార్చడానికి, కూలగొట్టడానికి, రద్దు చేయడానికి, మోసం చేయడానికి, భారం మోపడానికి ఒక్క ఛాన్సు ఇమ్మని అడిగారా మహారాజకుమారా? సింహాసనం అధిష్టించగానే విధ్వంసకాండకు దుర్మూహూర్తం ఎంచుకుని ప్రజావేదిక కూల్చిన మహాఘనత మీది మాత్రమే ప్రభూ! అక్కడితో ఆగారా, నిరుపేదలకు గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల కూల్చివేతలు, ఇప్పటికే సగం నిర్మాణంలో ఉన్న ఇళ్ల ఆపివేత, పోలవరం నిర్మాణానికి అడ్డంకులు, సాగునీటి పథకాల రద్దు, ఉద్యోగుల తొలగింపు, పెట్టుబడులకు మోకాలు అడ్డుపెట్టడం... ఒకటా రెండా, ఎన్ని ఛాన్సులు తీసుకున్నారు! అడిగినది ఒక్క ఛాన్సే గదా, ఇన్ని ఛాన్సులతో అమాయక ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎడాపెడా బాదడం తమకు తగునా?


వికేంద్రీకరణ అనే అందమైన మాట వెనుక ఎంత విషం చిమ్మినారు జగన్మోసకారా! ఐదు కోట్ల ప్రజలను, 82 మంది రైతుల్ని మీ మూడు ముక్కలాటకు బలిచేసినారు గదా. కోట్ల రూపాయలతో నిర్మాణమైన, అభివృద్ధి చెందుతున్న రాజధానిని ఒక్క కలం పోటుతో రద్దు చేసి, మూడు ప్రాంతాలకూ పాలనాధికారం ఇస్తున్నాననే అబద్ధంతో ప్రజలకు అందవలసిన అసలు సిసలు వికేంద్రీకరణ ఫలాలకు శూన్యహస్తం చూపినారు గదా! ఏ మాటకామాట చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఇరవయ్యొకటో శతాబ్ది నుంచి పద్నాలుగో శతాబ్దానికి ఉచిత ప్రయాణ వసతి కల్పించిన మహాఘనత తమకే దక్కుతుంది. లేకపోతే ఆరువందల సంవత్సరాలు వెనక్కి వెళ్లి ఢిల్లీ నుంచి దౌలతాబాద్ ప్రయాణం ఎట్లా జరిగిందో, ప్రజలు ఎన్నెన్ని ఇక్కట్ల పాలయ్యారో, చరిత్రలో చదవడమే తప్ప వాస్తవంగా అనుభవానికి వచ్చి ఉండేదేనా? తుగ్లక్ పాలనలోకి ప్రజలు రవాణా అయి ఉండగలిగేవారా? 


మహాప్రభూ, ఒక్క రాజధాని మార్పుతో ఆగుతారా, మాకు ఇతర భాగ్యాలు కూడ కలిగిస్తారా? తుగ్లక్ బంగారు వెండి నాణాల స్థానంలో రాగి, కంచు, తోలు నాణాలు ప్రవేశపెట్టాడు. తుగ్లక్ లాగ మితిమీరిన పన్నులు మోపుతారా? మహాప్రభూ భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్న మేనిఫెస్టో హామీల్లోనే మోసం చేసారు. ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి ప్రజలను సంక్షోభంలోకి నెట్టిన ఘనత మీదే. మీరు చేపట్టిన రద్దులూ, వాగ్దాన భంగాలూ, ప్రజల మూపుల మీద మోపిన భారాలూ తుగ్లక్ రికార్డులను సైతం బద్దలు గొట్టడానికి కంకణం కట్టుకున్నారని చూపుతున్నాయి. ‘అన్న క్యాంటీన్లు’ నిలిపివేసి పేదలు ఆకలి కేకలు వేసేలా చేశారు. సంక్రాంతి కానుకలూ, పెళ్లి కానుకలూ రద్దు చేశారు. రంజాన్ తోఫాలూ క్రిస్మస్ కానుకలూ రద్దు చేశారు. రైతు రుణమాఫీని, అన్నదాతను, సుఖీభవను రద్దు చేసి రైతుల పొట్టకొట్టారు. సున్నావడ్డీ పథకానికి సున్నా చుట్టారు. బీసీ కార్పొరేషన్ రుణాలనూ, ఆదరణ పథకాన్నీ రద్దు చేసి బీసీల అభివృద్ధి మీద గొడ్డలి వేటు వేశారు. 34 శాతం ఉన్న రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించి బీసీలపై మీకు ఉన్న కక్షని తీర్చుకున్నారు. నిరుద్యోగ భృతిని రద్దు చేశారు. పెట్టుబడులను, పరిశ్రమలను బెదరగొట్టారు. ఉచిత ఇసుక రద్దు చేశారు, ధర మూడు రెట్లు పెంచారు. భవన నిర్మాణ పరిశ్రమను కుదేలు చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేశారు. ఆర్టీసీ ఛార్జీలూ, కరెంటు ఛార్జీలూ పెంచారు. 


మహాప్రభూ... ప్రజలను ఆదుకోవాల్సిన కరోనా కాలంలోనూ విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచి రూ.60 వేల కోట్ల ఆర్థిక భారం మోపి నడ్డి విరిచేయడం తమకే సాధ్యం. సన్నబియ్యం హామీని నిలబెట్టుకోలేదు. పద్దెనిమిది లక్షల రేషన్ కార్డులు తొలగించారు. ఆటో కార్మికుల సంక్షేమ పథకాన్ని మూడో వంతుకు కోసేశారు. వాహనమిత్రను యజమానులకు పరిమితం చేసి డ్రైవర్లను మోసగించారు. రాష్ట్ర రుణభారాన్ని రెండింతలు పెంచారు. పన్నులు పెంచి, పోగుచేసుకున్న ధనం అభివృద్ధికో, సంక్షేమానికో కాక, మీ సొంత ఖజానాలోకో, మీ తైనాతీల ఖజానాల్లోకో వెళ్తున్నాయి. మహాప్రభూ, టీడీపీ హయాంలో బర్త్ టూ డెత్ సంక్షేమం కల్పిస్తే, ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి చనిపోయిన వారిని కూడా మీరు వదలడంలేదు. 15 నెలల పాలనలో 400 అత్యాచార ఘటనలు. దిశ చట్టం, ఈ-రక్షా బంధన్ అంటూ ప్రచారవ్యామోహం తప్ప క్షేత్రస్థాయిలో మహిళలకు న్యాయం ఏదీ? 16 ఏళ్ల దళిత మైనర్ బాలికపై 12మంది గ్యాంగ్ రేప్ చేసి పోలీస్ స్టేషన్ ముందే వదిలేసిన దుర్ఘటన తమ కళ్లముందే ఉంది. కర్నూలులో గిరిజన మహిళను భర్త కళ్లముందే గ్యాంగ్ రేప్ చేశారు. రాజమండ్రి రూరల్లో అభం శుభం తెలియని 10ఏళ్ల ముస్లిం మైనర్ బాలికపై ముగ్గురు వైసిపి యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. దిశచట్టం అసలు అమల్లో ఉందా మహాప్రభూ?


మీ ధనదాహానికి ప్రజలు బలైపోతున్నారు. నాటు సారా, శానిటైజర్ తాగి మృతి చెందటం మీ సర్కారు హత్యలే. ‘జే టాక్స్’ వసూళ్ల కోసం లోపభూయిష్టమైన మద్యం పాలసీ తెచ్చి, చెత్త బ్రాండ్లతో ప్రజల రక్తాన్ని తాగుతూ 25వేల కోట్లు దండుకుంటున్నారు. కరోనా బారిన పడి ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రభువులవారు తాడేపల్లిలో ఫిడేలు వాయించుకుంటున్నారు. ప్రతి రోజు 10వేల కరోనా కేసులు, 100 మరణాలు. కరోనా బాధితులు వైద్యం అందక, వసతులు లేక ప్రాణాలు రక్షించమని వేడుకుంటున్నారు. 108 అంబులెన్స్‌లు ఏవీ? ఆపదలో రిక్షాలే దిక్కయ్యాయి. రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేడ్కర్ భారత పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కులను కాలరాస్తూ, రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. దళితులపై దమనకాండ కొనసాగుతోంది. భూదాహానికి దళితులు, గిరిజనులు బలైపోతున్నారు. బంగారు భవిష్యత్తు ఉన్న దళిత యువకుడు ప్రసాద్ నక్సలిజం వైపు వెళ్ళాలి అనుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇసుక అక్రమాలకు అడ్డుపడ్డాడని శిరోముండనం చేసి చావగొట్టారు. మాస్కు లేదనే సాకుతో చీరాలలో దళిత యువకుడు శ్రీ కిరణ్‌ను పొట్టన పెట్టుకున్నారు. దళిత వైద్యులపై అమానుషాలు, దళిత జడ్జిపై రాళ్లదాడి, దళిత ఆడబిడ్డలపై అత్యాచారాలు, దళితుల భూములు బలవంతంగా లాక్కోవడం వంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. మీకు ఓట్లు వేసి గెలిపించిన దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారు. ప్రతి విషయాన్నీ కులం కోణంలో ఆలోచించడం, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం మంచి పాలకుడి లక్షణం అనిపించుకోదు. 


మహాప్రభూ... తమ అసమర్థ పాలన వల్ల రాష్ట్ర హైకోర్ట్, సుప్రీంకోర్ట్ 70కి పైగా కేసుల్లో మొట్టికాయలు వేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట మంటగలిసిందన్న విషయం మీకు తెలుస్తున్నదా? న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మీ పాలనలోనే సాధ్యం. ఈ ఘనత మీకే దక్కుతుంది. వైకాపా నాయకులకు, అక్కడక్కడా కార్యకర్తలకు తప్ప మరొక్క వ్యక్తికి మీ పాలన మేలు చేసిందని గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా ప్రభూ? విభజనానంతర సమస్యలతో కునారిల్లుతున్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనూ, పాలననూ పునర్నిర్మించడానికి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ధ్వంసం చేయాలనే ప్రతీకార వాంఛ తప్ప మీలో ఈ 15 నెలలలో పాజిటివ్ ఆలోచన ఒక్కటైనా వచ్చిందని చెప్పగలరా?


ఈ 15 నెలల్లో మీరు చేసిన కార్యక్రమాలు మూడే మూడు: ఒకటి, గ్రామపంచాయతీ, పురపాలక భవనాలకు మీ పార్టీ రంగులు వేయించడం. రెండు, వైకాపా చోటా మోటా నాయకులందరికీ ఉపాధి సౌకర్యాలూ, నిధుల కైంకర్య కార్యక్రమాలూ అప్పగించడం. మూడు, వేల కోట్ల రూపాయల ‘జె టాక్స్’ వసూలు చేస్తూ మీ సొంత బొక్కసం నింపుకోవడం. ఈ 15 నెలల్లో మీ జగన్మోసన పాలన తర్వాత గ్రామాల్లో, పట్టణాల్లో రహదారుల మీద పిడికెడు మట్టి పడలేదు, ఒక్క కొత్త ఇల్లు కట్టలేదు. ఒక్క కొత్త ప్రజాప్రయోజనకరమైన పని జరగలేదు. మరొక్క మాట, మీరు అమరావతి నుంచి రాజధాని మార్చారని ప్రచారంలో ఉంది గాని అసలు సంగతేమంటే మీరు పులివెందుల పంచాయితీని రాష్ట్రమంతటా వికేంద్రీకరించారు. పులివెందులకు మాత్రమే పరిమితమైన ‘జె టాక్స్’ను ఇవాళ రాష్ట్ర ప్రజలందరి మీదా రుద్దారు.


మహాప్రభూ... ఒక్క ఛాన్సు ఇచ్చి ప్రజలు మోసపోయారు. మరొకసారి మోసపోరు. ఒకసారి చేతులు కాలాయి, ఈసారి జాగ్రత్తపడతారు. మీ మోసాలు ఇక సాగవు. ప్రజలు మీ మోసాలను ఎండగట్టగడానికి, నిలదీయడానికి నడుం బిగిస్తున్నారు.



నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి

Updated Date - 2020-08-15T07:02:43+05:30 IST