పొంచి ఉన్న అంటువ్యాధులు

ABN , First Publish Date - 2022-07-17T03:57:54+05:30 IST

వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా జిల్లాలోని తాగునీటి వనరులన్నీ వరదనీటితో కలుషితమయ్యాయి. దాంతో ఏజెన్సీలో ప్రజానీకం అంటువ్యాధుల భారినపడే ప్రమాదం పొంచి ఉందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం అందోళన చెందుతోంది. ప్రతీ ఏటా వర్షాకాల సీజన్‌లో నీటి సంబంధిత వ్యాధుల నియంత్రణకు ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా డయేరియా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి మహమ్మారులు జిల్లాలో విజృంభిస్తూనే ఉన్నాయి.

పొంచి ఉన్న అంటువ్యాధులు

- వర్షాలు వరదలతో కలుషితమైన నీటి వనరులు

- పొంచి ఉన్న డయేరియా, డెంగ్యూ ముప్పు..

- వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్యంపై నజర్‌

- యుద్ధప్రాతిపదికపై చర్యలకు శ్రీకారం చుట్టిన వైద్య, ఆరోగ్యశాఖ

- అప్రమత్తంగా ఉండాలని అదేశించిన మంత్రి అల్లోల

(ఆంధ్రజ్యోతి-అసిఫాబాద్‌)

వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా జిల్లాలోని తాగునీటి వనరులన్నీ వరదనీటితో కలుషితమయ్యాయి. దాంతో ఏజెన్సీలో ప్రజానీకం అంటువ్యాధుల భారినపడే ప్రమాదం పొంచి ఉందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం అందోళన చెందుతోంది. ప్రతీ ఏటా వర్షాకాల సీజన్‌లో నీటి సంబంధిత వ్యాధుల నియంత్రణకు ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా డయేరియా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి మహమ్మారులు జిల్లాలో విజృంభిస్తూనే ఉన్నాయి. తాజాగా భారీ వర్షాలు కురియడంతో వరదలు సంభవించి జిల్లా వ్యాప్తంగా తాగునీటి వనరులన్నీ కలుషితమైపోయాయి. ఫలితంగా ప్రస్తుతం ఆ నీరు ఉపయోగించేందుకు వీల్లేకుండా మారిపోయింది. ఈ దరిమిళా ప్రజలు నీటి సంబంధిత వ్యాధుల భారిన పడే అవకాశమందని నిపుణలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటువ్యాధులు ప్రభలే అవకాశాలు ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే స్పష్టం చేసిందని చెబుతున్నారు. దాంతో జిల్లా అధికారులు రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ క్రమంలోనే శనివారం రాష్ట్ర అటవీ, న్యాయ, గృహనిర్మాణ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో అధికారులు, శాసనసభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలు అంటు వ్యాధుల భారిన పడకుండా తగిన చర్యలు చేపట్టాలని అదేశించారు. అలాగే మందుల కొరత రాకుండా చూడాలని సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిల్వ ఉండే చోట దోమలు వృద్ధి చెందే అవకాశమున్నందున పారిశుధ్య నిర్వహణపై ఫోకస్‌ పెట్టాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ పంచాయతీరాజ్‌, వైద్య ఆరోగ్య శాఖాధికారులను అదేశిం చారు. సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించాలని నిర్ణయించారు. అంటు వ్యాధుల ముప్పును నియంత్రించేందుకు వైద్యసిబ్బంది పూర్థిస్థాయిలో కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ నియంత్రణ సాధ్యం కావడం లేదు. ప్రతీ ఏటా వర్షాకాలంలో డయేరియా, వైరల్‌ ఫీవర్‌, టైఫాయిడ్‌ వంటి అంటు వ్యాధులతో పాటు డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక జ్వరాలు కూడా ప్రబలడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. మరీ ముఖ్యంగా కనుమరు గైపోయిందని భావించిన మలేరియా మళ్లీ విజృంభిస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే జిల్లాను మలేరియా సమస్యాత్మక ప్రాంతాల జాబితాలో చేర్చి నియంత్రణ చర్యలు చేప ట్టాలని నిర్ణయించారు. 

అధికారులు అప్రమత్తం

జిల్లాలో వరదల కారణంగా అంటువ్యాధులు ప్రభలే అవకాశాలు పొంచి ఉన్న నేపథ్యంలో అంటువ్యాధులను కట్టడిచేయడం కోసం జిల్లా కలెక్టర్‌ పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, వైద్య ఆరోగ్యశాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. అలాగే జిల్లాలో అంటు వ్యాధుల నియంత్రణకు ఉపయోగపడే మందుల నిల్వలను ఎప్పటికప్పుడు మదింపువేసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖల అధికారులకు సూచించారు. ముఖ్యంగా పారిశుధ్యం నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్‌ ఆయాశాఖలను ఆదేశించారు. ప్రదానంగా దోమల కారణంగా వ్యాప్తి చిందే మలేరియా, పైలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, మెదడువాపు వ్యాదుల నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సిబ్బందిని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశాం

- డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి

ఇటీవలి వర్షాలు, వరదల కారణంగా సీజనల్‌ వ్యాధులు విజృంభించే ప్రమాదం పొంచి ఉన్నందున వ్యాధులను సకాలంలో గుర్తించి నియంత్రించేందుకు వైద్యఆరోగ్యశాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉంది. వరద ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెడతాం. ఇప్పటికే సిబ్బంది ద్వారా సమస్యాత్మక గ్రామాల్లో దోమల నుంచి రక్షణ కోసం దోమ తెరలను పంపిణీ చేశాం. అలాగే అవసరమైన మందులనన్నీ అందుబాటులో ఉంచుతున్నాం. దాంతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలను వేగంగా చేపట్టేందుకు గ్రామాల ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేస్తున్నాం. 

Updated Date - 2022-07-17T03:57:54+05:30 IST