బీజేపీ, ఓవైసీ ఒకటే టీం: రాకేశ్ టికాయత్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-09-15T23:07:38+05:30 IST

బీజేపీకి ఓవైసీ చాచా జాన్. ఓవైసీకి బీజేపీ అండదండలు ఉన్నాయి. నిజానికి బీజేపీని ఓవైసీ విమర్శిస్తూ ఉంటారు. బీజేపీ నేతలు కూడా ఓవైసీని విమర్శిస్తుంటారు. కానీ వారిద్దరూ ఒక్కటే టీం. రైతులు ఈ విషయాన్ని గమనించాలి. ఓవైసీ రెండు రకాల మనిషి..

బీజేపీ, ఓవైసీ ఒకటే టీం: రాకేశ్ టికాయత్ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: విమర్శ ప్రతివిమర్శలు చేసుకుంటున్నప్పటికీ భారతీయ జనతా పార్టీ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఒకటే టీం అని భారతీయ కిసాన్ యూనియన్ అధినేత రాకేశ్ టికాయత్ సంచలన ఆరోపణలు చేశారు. అంతే కాకుండా ఓవైసీని బీజేపీ ‘చాచా జాన్’ అంటూ అభివర్ణించిన ఆయన ఓవైసీకి బీజేపీ అండదండలు మెండుగా ఉన్నాయని విమర్శించారు. కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ‘అబ్బా జాన్’ చేసిన వ్యాఖ్యలతో రాజకీయం దుమారం చెలరేగింది. తాజాగా టికాయత్ ‘చాచా జాన్’ అంటూ వ్యాఖ్యానించడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.


‘‘బీజేపీకి ఓవైసీ చాచా జాన్. ఓవైసీకి బీజేపీ అండదండలు ఉన్నాయి. నిజానికి బీజేపీని ఓవైసీ విమర్శిస్తూ ఉంటారు. బీజేపీ నేతలు కూడా ఓవైసీని విమర్శిస్తుంటారు. కానీ వారిద్దరూ ఒక్కటే టీం. రైతులు ఈ విషయాన్ని గమనించాలి. ఓవైసీ రెండు రకాల మనిషి. అతడు రైతులను మోసం చేస్తాడు. ఎన్నికల సమయంలో వీరిద్దరూ అనేక కుట్రలు పన్నుతారు. కానీ భాగ్‌పట్ ప్రజలు విప్లవాత్మకమైన ఆలోచన కలిగినవారు. వారి కుట్రల్లో ఇరుక్కోరు’’ అని ఉత్తరప్రదేశ్‌లోని భాగపట్ జిల్లాలో జరిగిన రైతు మహా పంచాయత్‌లో టికాయత్ అన్నారు.


కాగా, రాకేశ్ టికాయత్ వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ ఏఐఎంఐఎం అధినేత షౌకాత్ అలి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దొడ్డిదారులను ఉపయోగించుకుంటూ రాజకీయ నేతల అవ్వాలని రాకేశ్ టికాయత్ చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా రాకేశ్ టికాయత్ గతంలో భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారని, ప్రస్తుతం ఆ పార్టీ సూచనల మేరకే ఓవైసీపై విమర్శలు చేస్తున్నారని షౌకాత్ విమర్శలు గుప్పించారు.


కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోయిన ఏడాది నవంబర్ నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు. అనేక రైతు సంఘాలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నాయి. భారతీయ కిసాన్ యూనియన్ అధినేత రాకేశ్ టికాయత్ ఈ ఆందోళనలో కీలకంగా మారారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బలమైన గొంతుక వినిపిస్తున్న టికాయత్.. మూడు చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు ఆందోళన ఉపసంహరించేది లేదని పలుమార్లు తేల్చి చెప్పారు.

Updated Date - 2021-09-15T23:07:38+05:30 IST