Abn logo
Sep 26 2021 @ 19:20PM

యూపీలో పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అసదుద్దీన్

లక్నో: ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించడమే అందుకు కారణం. ఇప్పటి వరకు అక్కడి మైనారిటీలను తమ ప్రధాన ఓటు బ్యాంకుగా మలచుకున్న ప్రధాన పార్టీలు ఇప్పుడు ఆ ఓటు బ్యాంకును ఒవైసీ లాగేసుకుంటారని భయపడుతున్నాయి. 


యూపీలో జాటవ్‌లు, యాదవ్‌లు, రాజ్‌భర్‌లు, నిషాద్‌లు.. ఇలా పలు సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారు. వీరి జనాభా తక్కువే అయినప్పటికీ వారికి కొద్దో, గొప్పో సొంత నాయకత్వం ఉంది. అయితే, అక్కడ 19 శాతానికిపైగా ఉన్న ముస్లింలకు ఇప్పటి వరకు సరైన నాయకత్వం లేదు. ఇప్పుడు దీనిని క్యాష్ చేసుకోవాలని అసద్ భావిస్తున్నారు. అక్కడ పోటీ చేయడం ద్వారా సమాజ్‌వాదీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), కాంగ్రెస్ బానిసత్వం నుంచి ముస్లింలను విడిపించాలని ఒవైసీ కోరుకుంటున్నారు. ఇటీవల యూపీలో పర్యటించిన అసద్ ఇదే హామీని ఇచ్చారు.


యూపీలోని 82 అసెంబ్లీ స్థానాల్లో ముస్లిం ఓటర్లు అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించే స్థానంలో ఉన్నారు. గతేడాది బీహార్‌లో జరిగిన ఎన్నికల్లో బరిలోకి దిగిన ఎంఐఎం  ముస్లిం ప్రభావిత సీమాంచల్ ప్రాంతంలో ఐదు సీట్లను గెలుచుకుని సత్తా చాటి కాంగ్రెస్, ఆర్జేడీకి షాకిచ్చింది.


యూపీలో 403 సీట్లలో 100 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ఒవైసీ ఇది వరకే ప్రకటించారు. అంతేకాదు, ఈ నెల మొదట్లో అయోధ నుంచే ప్రచారం కూడా ప్రారంభించారు. బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రధాన పార్టీల గుండెల్లో గుబులు రేపుతున్నారు.


అయితే, యూపీలో ఎన్నికల్లో ఒవైసీ పోటీ చేస్తుండడం వెనక బీజేపీ ఉందని ఎస్పీ, బీఎస్పీలు ఆరోపిస్తున్నాయి. ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి మేలు చేయాలనే కుట్ర దాగి ఉందని విరుచుకుపడుతున్నాయి.   

ఇవి కూడా చదవండిImage Caption