విశాఖ వైసీపీలో అలజడి మొదలైందా?

ABN , First Publish Date - 2020-10-01T03:43:05+05:30 IST

విశాఖ వైసీపీలో అలజడి మొదలైంది. నిన్నమొన్నటి వరకు కాలరెగరేసుకుని తిరిగిన నేతలు.. ఇప్పుడు ఒక్కసారిగా డీలా పడ్డారట. ...

విశాఖ వైసీపీలో అలజడి మొదలైందా?

విశాఖ వైసీపీలో అలజడి మొదలైంది. నిన్నమొన్నటి వరకు  కాలరెగరేసుకుని  తిరిగిన నేతలు.. ఇప్పుడు ఒక్కసారిగా డీలా పడ్డారట. రేపు మా పరిస్థితి ఏమిటి? పార్టీలో మేము పరాయివాళ్లమవుతామా? స్వపక్షంలో విపక్షంగా మారుతామా? అనే డైలమాలో వారున్నారట. ఇంతకీ వారిలో అలాంటి సందేహాలు తలెత్తడానికి కారణాలు ఏమిటో.. ఈ కథనంలో తెలుసుకుందాం.


"మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అవుతుంది" అన్నట్టుగా ఉందట విశాఖ వైసీపీ నేతల కంగారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 151 సీట్లు సాధించిన వైసీపీ అఖండ మెజారిటీతో విజయం సాధించింది. కానీ విశాఖ నగరంలో మాత్రం తెలుగుదేశం పార్టీయే జయకేతనం ఎగురవేసింది. ఇక్కడున్న మొత్తం నాలుగు స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. విశాఖ తూర్పున వెలగపూడి, పశ్చిమంలో గణబాబు, ఉత్తరాన మాజీ మంత్రి గంటా,  దక్షిణాన వాసుపల్లి గణేష్ కుమార్ విజయం సాధించారు. దీంతో ఇప్పటికీ విశాఖలో ప్రభుత్వం అధికారికంగా ఏ కార్యక్రమం చేయాలన్నా సరే.. విపక్ష ఎమ్మెల్యేలను పిలువకపోయినా ప్రోటోకాల్ ప్రకారం వారి పేర్లు మాత్రం ముద్రిస్తుంది. మరీ తప్పదనుకుంటే పిలుస్తుంది. అయితే విశాఖను పరిపాలనా రాజధాని చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో.. ఇక్కడ ఈ తరహా పరిస్థితి ఉండటాన్ని పాలక పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారట. ఏం చేద్దామన్నా ఏం చేయలేని పరిస్థితి. ఒకవేళ ఏమన్నా చేద్దామన్నా.. ఆ క్రెడిట్ కాస్తా ఎమ్మెల్యేల ఖాతాలోకి వెళ్తుందనీ, అందుకే చేయడం లేదనీ రాజకీయ వర్గాలతోపాటు సామాన్యులు సైతం చర్చించుకుంటున్నారు.



విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాలలో ఏ పనులు జరగాలన్నా.. అవి ప్రస్తుతం ఇక్కడున్న వైసీపీ సమన్వయకర్తల కనుసన్నలలో జరుగుతాయని టాక్. ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్లు దొరుకుతాయో లేదో తెలియదు గానీ, వీరికి మాత్రం ముఖ్యమంత్రి జగన్ అపాయింట్‌మెంట్‌ ఇట్టే దొరుకుతుందట. దీన్నిబట్టి విశాఖలోని వైసీపీ సమన్వయకర్తలకు ఎంత ప్రియారిటీ ఇస్తున్నారనేది అర్థమవుతోంది. అంతేకాక వారు చెప్పిన పనులు చేయండని ముఖ్యమంత్రి కార్యాలయం నుండే జిల్లా ఉన్నతాధికారులకు నేరుగా సిఫారసులు, ఫోన్లు వస్తాయట. దీంతో  విశాఖలో వైసీపీ సమన్వయకర్తలే అనధికార ఎమ్మెల్యేలుగా   అజమాయిషి చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల దంపతులు, దక్షిణంలో  ద్రోణంరాజు, కోలా గురువులు, ఉత్తరంలో కె.కె.రాజు, పశ్చిమంలో మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ల హవా నడుస్తోందని టాక్.



ఇదిలావుంటే, ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ వైసీపీలో చేరిన తర్వాత విశాఖ వైసీపీలో అలజడి మొదలైందట. వాస్తవానికి విశాఖను పరిపాలనా రాజధానిగా చేసుకుని అక్కడ అడుగు పెట్టడానికి ముందే.. ఆ నగరం తమ వశం కావాలని వైసీపీ పెద్దలు అనుకున్నారట. అందుకోసం ఎన్ని మార్గాలుంటే అన్నింటిని వాడుకోవడంపై దృష్టి సారించిందని సమాచారం. ఈ క్రమంలోనే ఆకర్షణ మంత్రానికి తెరతీసినట్లు తెలుస్తోంది. ముందుగా మాజీ మంత్రి గంటా వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగినా తాత్కాలికంగా వాయిదా పడింది. అయితే అంతకుముందే విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్, ఆయన కుమారులను వైసీపీలో చేర్చుకున్నారు. మరోవైపు పశ్చిమ ఎమ్మెల్యే గణబాబుతో కూడా చర్చలు జరిపారట. అలాగే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడితోనూ కొడాలి నాని మంతనాలు జరపగా.. తాను వచ్చేది లేదని ఆయన తెగేసి చెప్పారని తెలిసింది.


విశాఖలో ఇతర పార్టీల నుంచి చేరికలను స్థానిక వైసీపీ నేతలు జీర్ణించుకోవట్లేదని సమాచారం. ఎందుకంటే.. నిన్నమొన్నటి వరకు విశాఖలో విపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను అధికార వైసీపీలోని నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడా ఎమ్మెల్యేలే అధికారపక్షమైపోతే.. తమ పరిస్థితి ఏమిటనే డైలమాలో వారున్నారట. తమ పనుల కోసం సమన్వయకర్త దగ్గరకు వెళ్లాలా.. లేక ఎమ్మెల్యే వద్దకు వెళ్లాలా అనేది వారికి అర్థం కావడం లేదట. మరి ఈ పరిస్థితి మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

Updated Date - 2020-10-01T03:43:05+05:30 IST