ఆక్సిజన్‌ రైలు వచ్చేసింది

ABN , First Publish Date - 2021-05-17T05:58:23+05:30 IST

ఆక్సిజన్‌ రైలు వచ్చేసింది. శుక్రవారం గుజరాత్‌ రాష్ట్రంలోని జామ్‌నగర్‌ నుంచి బయలుదేరి సుమారు 30 గంటల పాటు ప్రయాణించిన ఈ రైలు ఆదివారం వేకువజామున 5 గంటల సమయంలో గుంటూరులోని కాంకర్‌ కంటైనర్‌ డిపోకి చేరుకున్నది.

ఆక్సిజన్‌ రైలు వచ్చేసింది
గుంటూరులోని కాంకర్‌ కంటైనర్‌ డిపో నుంచి బయలుదేరిన ఆక్సిజన్‌ ట్యాంకర్లు

30 గంటల్లో గుజరాత్‌ జామ్‌నగర్‌ టూ గుంటూరు 

గ్రీన్‌ చానెల్‌ ఏర్పాటు చేసి క్లియరెన్స్‌ ఇచ్చిన రైల్వే శాఖ

లోడింగ్‌, రవాణాని పరిశీలించిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు

జిల్లాలో డిమాండ్‌ పరిస్థితిని వివరించిన జేసీ దినేష్‌కుమార్‌


గుంటూరు, మే 16 (ఆంధ్రజ్యోతి): ఆక్సిజన్‌ రైలు వచ్చేసింది. శుక్రవారం గుజరాత్‌ రాష్ట్రంలోని జామ్‌నగర్‌ నుంచి బయలుదేరి సుమారు 30 గంటల పాటు ప్రయాణించిన ఈ రైలు ఆదివారం వేకువజామున 5 గంటల సమయంలో గుంటూరులోని కాంకర్‌ కంటైనర్‌ డిపోకి చేరుకున్నది. అప్పటికే ఆక్సిజన్‌ ట్యాంకర్లని సిద్ధం చేసిన అధికారులు వెనువెంటనే వాటిల్లోకి ఫిల్లింగ్‌ ప్రారంభించారు. ఒక్కొక్క దానికి ఫిల్లింగ్‌ చేసి గుంటూరుతో పాటు వివిధ జిల్లాలకు ప్రత్యేక పోలీసు ఎస్కార్ట్‌ వాహనాన్ని ఇచ్చి పంపించారు. రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరి ఎం టీ కృష్ణబాబు, కొవిడ్‌-19 మేనేజ్‌మెంట్‌ స్పెషలాఫీసర్‌ డాక్టర్‌ ఆర్జా శ్రీకాంత్‌, జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ కంటైనర్‌ డిపోకి వచ్చి ఆక్సిజన్‌ ట్యాంకర్లలోకి ఫిల్లింగ్‌ని పరిశీలించారు. ఈ సందర్భంగా మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా యంత్రాంగాన్ని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను ఆదేశించారు. ప్రతీ హాస్పిటల్‌లోనూ ఆక్సిజన్‌ని వృథా చేయకుండా ఆడిట్‌ టీంలని ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు కూడా వైద్యుల సూచనల ప్రకారమే ఆక్సిజన్‌ వినియోగించుకుని తీవ్ర అనారోగ్యంగా ఉన్న వారికి ప్రాణవాయువు అందేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆక్సిజన్‌ అదనపు కేటాయింపులపై సీఎం జగన్‌ కేంద్ర ప్రభుత్వంతో చేస్తున్న సంప్రదింపుల వల్ల ఇక నుంచి నిత్యం ఆక్సిజన్‌ కంటైనర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఇక్కడికి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.


30 మెట్రిక్‌ టన్నులు జిల్లాకు..

ఆదివారం వచ్చిన 80 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కంటైనర్‌లో 30 ఎంటీలు జిల్లాకు కేటాయించారని జేసీ తెలిపారు. ఇక్కడ 4 వేలకు పైగా ఆక్సిజన్‌ పడకలు ఉండటంతో పాటు నిత్యం జీజీహెచ్‌కి మినహాయించి 85 నుంచి 90 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరం అవుతోందని చెప్పారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మరో 30 నుంచి 35 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరం అదనంగా ఉందని నివేదించారు. నిత్యం ఆక్సిజన్‌ సరఫరా చేస్తే కొరత అధిగమించి క్రిటికల్‌ కేర్‌ అవసరాలకు పూర్తి స్థాయిలో అందించే వీలు కలుగుతుందన్నారు. బ్యాకప్‌ ప్లాన్‌గా జిల్లాలో 145 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ నిల్వ సామర్థ్యం ఉన్న ట్యాంకులను సిద్ధం చేశామన్నారు. రైళ్ల ద్వారా అదనంగా వచ్చిన ఆక్సిజన్‌లో కనీసం 20 ఎంటీలు ఇక్కడ నిల్వ చేసి అత్యవసర అవసరాలకు వినియోగించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. వృథాని అరికట్టేందుకు ప్రతీ వార్డుకు ఆడిట్‌ కమిటీలను ఏర్పాటు చేశామని, ప్రత్యేకంగా నర్స్‌ని నియమించామన్నారు. అనవసర వినియోగం, లీకేజ్‌లను వెంటనే అరికట్టేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే సీనియర్‌ డీసీఎం నరేంద్రవర్మ, డీవోఎం వీ రాంబాబు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏపీ హెడ్‌ రవిరామరెడ్డి, గుంటూరు ఆర్‌డీవో భాస్కర్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీకాంత్‌, రైల్వే, పోలీసు అధికారులు పాల్గొన్నారు. 



 


Updated Date - 2021-05-17T05:58:23+05:30 IST