పీహెచ్‌సీల్లో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు

ABN , First Publish Date - 2021-07-29T08:27:55+05:30 IST

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, ఆక్సిజన్‌ ఉత్పత్తి యూనిట్లు అందుబాటులో ఉండాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

పీహెచ్‌సీల్లో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు

  • ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు 
  • ముందుగా 100 పడకల ఆస్పత్రుల్లో ఏర్పాటు 
  • సిబ్బంది శిక్షణకు ఏపీఎంఎ్‌సఐడీసీలో ప్రత్యేక సెల్‌ 
  • వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో టీచర్లకు ప్రాధాన్యం
  • అధికారులకు ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలు 


అమరావతి, జూలై 28(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, ఆక్సిజన్‌ ఉత్పత్తి యూనిట్లు అందుబాటులో ఉండాలని సీఎం జగన్‌ ఆదేశించారు. కొవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన కాన్సన్‌ట్రేటర్లు, డీ-టైప్‌ సిలిండర్లు, ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లా విస్తీర్ణం, ఆస్పత్రుల సంఖ్యను బట్టి సిబ్బందిని సిద్ధం చేసుకొని, అవసరమైన శిక్షణను అందించాలన్నారు. దీనికోసం ఏపీఎంఎ్‌సఐడీసీలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. కొవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిందేనని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముందుగా 100 పడకల ఆస్పత్రుల్లో, అనంతరం మిగిలిన ఆస్పత్రుల్లో ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. ప్లాంట్లు ఏర్పాటు చేసే ప్రైవేటు ఆస్పత్రులకు 30శాతం రాయితీతో పాటు విద్యుత్తు చార్జీల్లోనూ ఊరటనిస్తున్నామని పేర్కొన్నారు. 


ప్రత్యేక డిప్లొమా కోర్సులు  

ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్ల నిర్వహణ, ఆస్పత్రుల యాజమాన్య విధానాలపై ఐటీఐ, డిప్లొమా కోర్సులు ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలని సీఎం సూచించారు. ఆస్పత్రుల నిర్వహణలో కీలకమైన ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణ, ఎలక్ట్రికల్‌, ఏసీ రిపేరు, ప్లంబింగ్‌తో సహా అనుబంధ విభాగాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని సూచించారు. 


వ్యాక్సినేషన్‌పై సమీక్ష  

వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఉపాధ్యాయులకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. వీలైనంత వరకూ టీచర్లకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలన్నారు. మే నుంచి జూలై వరకూ ప్రైవేటు ఆస్పత్రులకు 43,38,000 డోసులు ఇస్తే కేవలం 5,24,347 డోసులు మాత్రమే వేశారని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వానికి ఇస్తే ఈ డోసులన్నింటినీ వేసేవారమని, ఈ అంశంపై కేంద్రానికి మరోసారి లేఖ రాస్తామని సీఎం పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ, టీకా అనంతరం కొవిడ్‌ తీరుపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు ఒక కమిటీని నియమించాలని ఆదేశించారు. అవసరమైతే రాష్ట్రంలో కొవిడ్‌ నివారణకు అనుసరించాల్సిన ప్రొటోకాల్‌ను మార్చుకునే వీలుంటుందన్నారు. 


వైద్య కళాశాలల పనులపై నివేదిక 

కొత్త మెడికల్‌ కాలేజీల కోసం పెండింగ్‌లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కొత్త వైద్య కళాశాలల పనుల ప్రగతిపై వచ్చేవారంలో సమీక్షిద్దామన్నారు. పనులు ఇంకా ప్రారంభం కాకుంటే వాటిని మొదలుపెట్టించి రాష్ట్రంలో నిర్మిస్తున్న 16 కాలేజీలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడు పనులపై సవివరంగా ప్రజెంటేషన్‌ ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై సీఎంకు అధికారులు వివరించారు.

Updated Date - 2021-07-29T08:27:55+05:30 IST