Abn logo
May 7 2021 @ 04:24AM

ఆక్సిజన్ హత్యలు

వ్యాజ్యాల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలను సమాచార సాధనాలు ప్రచురించాలా వద్దా అనే చర్చ ఈ మధ్య జరిగింది. బాధ్యతారహితంగా నిర్ణయాలను తీసుకుని కొవిడ్–19 వ్యాప్తికి కారకులైనందుకు ఎన్నికల కమిషన్‌పై హత్యకేసు పెట్టాలని చెన్నై హైకోర్టు ఈ మధ్య వ్యాఖ్యానించింది. తాము పొరపాటు చేయడం, దాన్ని న్యాయస్థానం తప్పుపట్టడం పర్వాలేదుకానీ, ఆ విషయం ప్రజలకు తెలియడం ఎన్నికల కమిషన్‌కు అవమానంగా తోచింది. అటువంటి వ్యాఖ్యలను ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా నిషేధం విధించమని కమిషన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆ అభ్యర్థనకు ఆదరణ లభించకపోవడం మరో భంగపాటు. విచారణల్లో వాద ప్రతివాదాల నడుమ, న్యాయమూర్తులు వ్యాఖ్యానించడం, తాము స్వయంగా కొన్ని ప్రశ్నలు వేయడం జరుగుతుంది. విస్తృత ప్రజా ప్రయోజనం ముడిపడి ఉన్న వ్యాజ్యాల విషయంలో అటువంటి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. ప్రభుత్వ పక్షాన్ని కోర్టు నిలదీయడం, తక్షణ ఆదేశాలు, సూచనలు ఇవ్వడం చూసిన, చదివిన ప్రజలు ఉపశమనం పొందుతారు. న్యాయం జరగడానికి అవకాశం ఉన్నదన్న ఆశ్వాసన పొందుతారు. ప్రజల పక్షాన మరెవరూ గట్టిగా ప్రశ్నించలేని వాతావరణం నెలకొన్నప్పుడు, ఇటువంటి న్యాయవ్యాఖ్యలు ఆ వెలితిని భర్తీ చేస్తాయి. 


బుధవారం నాడు అలహాబాద్ హైకోర్టు ఒక తీవ్రమైన వ్యాఖ్య చేసింది. ప్రాణవాయువు కొరత కారణంగా జరుగుతున్న మరణాలను న్యాయమూర్తులు ‘జాతిహననం’ తో పోల్చారు. ‘‘కేవలం ఆక్సిజన్ లభించకపోవడం వల్ల కోవిడ్ రోగులు మరణించడం అన్నది ద్రవరూప వైద్య ప్రాణవాయువును నిరంతరాయంగా సేకరించి అందించవలసిన బాధ్యత కలిగినవారు చేసిన నేరపూరిత చర్య అని చెప్పడానికి మాకు బాధగా ఉంది. జాతిహననానికి ఏ మాత్రం తక్కువ కాని నేరం ఇది’’ అని న్యాయమూర్తులు అజిత్ కుమార్, సిద్ధార్థ వర్మ వ్యాఖ్యానించారు. ప్రాణవాయువు కొరతపై సమాచార సాధనాలలో వచ్చిన అనేక కథనాలను న్యాయమూర్తులు పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. సామాజిక మాధ్యమాలలో రోగుల బంధువులు ఆక్సిజన్ సిలండర్ల కోసం ప్రాధేయపడుతూ అభ్యర్థనలు పెట్టడం హృదయవిదారకంగా ఉన్నదని న్యాయమూర్తులు తమ ఆదేశంలో ప్రస్తావించారు. ప్రాణావసరంగా అక్సిజన్ను అడుగుతున్న పౌరులను వేధించడం, మరో పక్క ఆక్సిజన్‌ను అక్రమంగా నిల్వ చేసే అమానుష వ్యాపారం కొనసాగడం జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. 


కొవిడ్ మరణాల సంఖ్యనే వాస్తవాలతో నిమిత్తం లేకుండా ప్రకటిస్తున్న ప్రభుత్వాలు, ఆక్సిజన్ మరణాలను లెక్కిస్తున్నాయని భావించలేము. మునుపే ఉన్న వ్యాధుల కారణంగాకానీ, వ్యాధి తీవ్రతను నిరోధించలేక కానీ జరిగే మరణాలను కొవిడ్ మరణాలుగా భావిస్తాము. వైద్యసహాయం అందినప్పటికీ ఆ మరణాలు తప్పకపోవచ్చు. వాటిలో మానవ బాధ్యత పరిమితం. కానీ, ఆక్సిజన్ కొరత వల్ల జరిగే మరణాలు పూర్తిగా మానవ నేరాలు. లోకమంతా ఒక తీవ్రవ్యాధితో అల్లాడుతుంటే, ఆ సమయంలో ఔషధాలను, ప్రాణావసరాలను అందించడంలో అలక్ష్యం చూపేవారు, వాటితో వ్యాపారం చేసేవారు మనుషులేనా? వారు చేసేది ఊచకోత కాక మరేమిటి? సామూహిక హననకాండ కాక ఇంకేమిటి? స్వతంత్ర పాత్రికేయానికి పేరు పొందిన ‘ది వైర్’ వెబ్‌సైట్‌లో దేశవ్యాప్త ఆక్సిజన్ మరణాల లెక్కలను క్రోడీకరించి, సంఖ్యను 178 గా తేల్చారు. ఎక్కడ, ఏ ఆస్పత్రిలో ఆ మరణాలు జరిగాయో కూడా అధికారిక ధృవీకరణ తీసుకుని మరీ వెల్లడించారు. మరో 78 మరణాలను ఆక్సిజన్ కొరత కారణంగా జరిగినవని బంధువులు చెబుతుండగా, అధికారులు నిర్ధారించడం లేదు. కనీసం 200 మరణాలు ఆక్సిజన్ అందకపోవడం వల్లనే జరిగాయంటే, ఎంతటి దారుణం? నల్లబజారుకు ఆక్సిజన్‌ను తరలించడం వల్ల కొన్ని మరణాలు జరిగి ఉంటాయి కానీ, మొత్తం మీద సమస్య, ఆక్సిజన్ అవసరాన్ని అంచనావేసి ముందుజాగ్రత్తలు తీసుకోకపోయిన కేంద్రప్రభుత్వ తీరు వల్లనే ఏర్పడింది. ఆక్సిజన్ ధారాళంగా అందకపోవడం వల్లనే నల్లబజారు, అక్రమనిల్వలు జరుగుతాయి.


దశాబ్దాల తరబడి అరకొర ఆరోగ్యవ్యవస్థలతోనే నెట్టుకువస్తున్న భారతదేశంలో సామర్థ్యానికి మించిన అవసరం రావడంతో, అనేక కొరతలు ఏర్పడుతున్నాయి. పడకలు, వసతులు, సిబ్బంది, సాధనాలు, ఔషధాలు.. అన్నీ ఒక్కసారిగా ప్రియమయి పోయాయి. రెండో విడత కరోనా విజృంభిస్తుందని నిపుణులు హెచ్చరించినా అధికారపక్షాలు ఎన్నికల మత్తులోనే మునిగితేలాయి, జనసందోహాల జాతరలకు అనుమతులిచ్చాయి. కొద్దిగా ముందు మేల్కొంటే, సర్దుబాటు చేసుకోగలిగే సంక్షోభం, ఇప్పుడు చేయి దాటిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ ముఖ్యులు పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ, తమ ముఖ్యమంత్రి కోవిడ్ విషయంలో చేతులెత్తేశారని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్య దేశ ప్రధానికి కూడా ఎంతో కొంత వర్తిస్తుంది. మే ఒకటో తేదీ నుంచి 18ఏళ్లకు పైబడినవారికి కూడా టీకా అని గొప్పగా చెప్పిన కేంద్రం, ఇప్పుడు అది సాధ్యం కావడం లేదని వివరణ కూడా ఇవ్వకుండా ముఖం చాటేస్తున్నది. ప్రత్యామ్నాయ ఏర్పాటు కూడా చేయకుండా, కోవిడ్ గత్తర సమయంలో ఆరోగ్యమంత్రిని బర్తరఫ్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, కోర్టు మందలింపుల తరువాత కానీ సమీక్ష చేపట్టలేదు. ఒక రాష్ట్రం అనేముంది, అంతటా ఒకే సంక్షోభం, అనేక చోట్ల అదే అలక్ష్యం, నిర్లిప్తత. ఏవో కొన్ని చోట్ల మాత్రం కాసింత మానవ ప్రయత్నం కనిపిస్తున్నది. ప్రభుత్వాలకు నిర్మాణాత్మకంగా సహకారం అందిస్తూ, ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లే బాధ్యత కూడా నిర్వహించేందుకు చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ముందుకు రాకపోవడం విచారకరం. ఈ నేపథ్యంలో న్యాయస్థానాలే పరిస్థితిని గమనిస్తూ, ప్రభుత్వాలను అదిలిస్తూ, అవసరమైన ఆదేశాలిస్తూ ఆశ కలిగిస్తున్నాయి. న్యాయస్థానాల మాటను నూరుపాళ్లు ప్రభుత్వాలు గౌరవిస్తున్నాయా అన్నది వేరే విషయం.

Advertisement