ఆక్సిజన్‌ తెచ్చుకోండి.. చికిత్స చేస్తాం

ABN , First Publish Date - 2021-05-07T17:10:25+05:30 IST

ఆక్సిజన్‌ సిలెండర్‌ కోసం..

ఆక్సిజన్‌ తెచ్చుకోండి.. చికిత్స చేస్తాం

కరోనా బాధితుల అడ్మిషన్‌పై ఆసుపత్రుల మెలిక


జగ్గయ్యపేట: ఆక్సిజన్‌ సిలెండర్‌ కోసం కరోనా బాధితుల బంధువులు నానాపాట్లు పడుతున్నారు. సిలెండర్‌ తెచ్చుకుంటేనే ట్రీట్‌మెంట్‌ చేస్తామని ప్రైవేట్‌ ఆసుపత్రులు ఆంక్షలు పెడుతుండటంతో సిలెండర్ల కోసం పరుగులు తీస్తున్నారు. తమ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ టెన్షన్‌ తగ్గించుకునేందుకు ఆసుపత్రుల యాజమాన్యాలు చికిత్సకు షరతులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో బాధిత బంధువులు మండలంలో అనుమంచిపల్లి వద్ద ఉన్న ఆక్సిజన్‌ ప్లాంటు వద్దకు వస్తున్నారు. వారేమో తహసీల్దార్‌ అనుమతి లేకుండా ఇవ్వలేమని చెబుతున్నారు. ప్రభుత్వం ఆక్సిజన్‌ సిలెండర్ల బ్లాక్‌మార్కెట్‌ను నియంత్రించేందుకు సిలెండర్లను వ్యక్తిగతంగా ఎవరికీ ఇవ్వొద్దని ప్లాంట్ల యజమానులపై ఆంక్షలు విధించింది.


దూర ప్రాంతాల నుంచి ఆసుపత్రుల సిఫార్సు లేఖలతో వస్తున్నా ఏమీ చేయలేకపోతున్నారు. కొద్ది రోజుల కిత్రం జగ్గయ్యపేటకు చెందిన ఒక స్వర్ణకారుడికి కరోనా సోకటంతో రోజంతా విజయవాడలో బెడ్‌కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఎక్కడా దొరకలేదు. నందిగామలో ఒక ఆసుపత్రి వారు ఆక్సిజన్‌ సిలెండర్‌ తెచ్చుకుంటే చేర్చుకుంటామని షరతు పెట్టారు. దీంతో అతడి బంధువులు ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభానుకు మొరపెట్టుకోగా ఆయన ఒక సిలెండర్‌ ఇప్పించారు. ఇలా ఎంతమందికి రాజకీయ అండదండలు ఉంటాయి.. చికిత్స కోసం ఆసుపత్రుల వారు సిలిండర్‌ షరతు.. సిలిండర్‌ కోసం ప్లాంట్‌కు వెళితే అధికారుల అనుమతి అంటూ ఆంక్షలు.. అధికారుల వద్దకు వెళితే వాళ్లు పెట్టే ఇతర కండిషన్లకు బాధిత బంధువులు మానసింకంగా, శారీరకంగా నలిగిపోతున్నారు. అధికారులు సమస్యను గుర్తించి సిలెండర్లపై ఆంక్షలను సడలించాలని కోరుతున్నారు. ఆసుపత్రి వైద్యులిచ్చే లేఖను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.


మేమేం చేయలేం: తహసీల్దార్‌ రామకృష్ణ

కరోనా బాధితులు ఆక్సిజన్‌ సిలెండర్ల కోసం పడుతున్న ఇబ్బందులను తహసీల్దార్‌ రామకృష్ణను వివరణ కోరగా జాయింటు కలెక్టర్‌ వద్ద నుంచి అనుమతి తెచ్చుకోవాలని, లేకుంటే ఆక్పిజన్‌ సిలెండర్‌ కోసం ఎవరికీ సిఫార్సు చేయలేమని తేల్చి చెప్పారు.

Updated Date - 2021-05-07T17:10:25+05:30 IST