ఆక్సిజన్‌ లేక ఎవరూ చనిపోలేదు

ABN , First Publish Date - 2021-05-05T08:34:25+05:30 IST

కరోనాతో మరణించినవారికి గౌరప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది

ఆక్సిజన్‌ లేక ఎవరూ చనిపోలేదు

హైకోర్టుకు నివేదించిన సర్కారు

కేసులు పెరిగితే పరిస్థితేంటి? 

ఆక్సిజన్‌ నిల్వలు సరిపోకపోతే ఏం చేస్తారు? 

ఢిల్లీ లాంటి పరిస్థితులు ఎదురైతే ఎలా?: హైకోర్టు

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం ప్రశ్నలు 


అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): కరోనాతో మరణించినవారికి గౌరప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కొన్ని ప్రాంతాల్లో మృతదేహాలకు అందాల్సిన గౌరవాన్ని నిరాకరిస్తునట్లు తమ దృష్టిలో ఉందని తెలిపింది. చనిపోయిన తరువాత అయినా హుందాగా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. విపత్కర పరిస్థితులు ఎదురైతే ఎలాంటి లోటుపాట్లు లేకుండా వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని, ఇతర రాష్ట్రాల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని స్పష్టం చేసింది. కేసుల సంఖ్య పెరిగి... ఆక్సిజన్‌ నిల్వలు సరిపోకపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. కరోనా వ్యాజ్యాల విషయంలో కోర్టుకు సహాయకారిగా ఉండేందుకు సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ను అమికస్‌ క్యూరీగా నియమించింది. కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లు, అఫిడవిట్‌లు, ఇతర దస్త్రాలను అమికస్‌ క్యూరీకి అందజేయాలని పిటిషనర్లు, ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మెమో రూపంలో కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేసింది. విచారణను గురువారానికి వాయిదా వేస్తూ ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులు అధిక ఫీజుల వసూలు చేస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని పేర్కొంటూ సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్‌ తోట సురేశ్‌బాబు గత సెప్టెంబరులో పిల్‌ దాఖలు చేశారు. 


కరోనా కట్టడికి ఈ ఏడాది మార్చి 23న కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఏపీ పౌరహక్కుల సంఘం(ఏపీసీఎల్‌ఏ) జాయింట్‌ సెక్రటరీ బి.మోహనరావు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు మంగళవారం మరోసారి ధర్మాసనం మందు విచారణకు వచ్చాయి. విచారణ ప్రారంభమైన వెంటనే ధర్మాసనం స్పందిస్తూ... కొవిడ్‌ ఆస్పత్రుల్లో అధిక ఫీజుల వసూలు, బెడ్లు నిరాకరించడంపై ఏమైనా చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించింది. ఆస్పత్రుల్లో నోడల్‌ ఆఫీసర్ల పేరు, ఫోన్‌ నంబరు ప్రదర్శించారా అని ఆరా తీసింది. తనిఖీలు నిర్వహించేందుకు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు నియమించారా అని వివరణ కోరింది. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరాం, అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడి,్డ ప్రభుత్వ న్యాయవాది(జీపీ) సి.సుమన్‌ వాదనలు వినిపించారు. ఆస్పత్రుల వద్ద నోడల్‌ఆఫీసర్ల వివరాలు ప్రదర్శించామని, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు కూడా ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల్లో తనిఖీలు చేశాయని బదులిచ్చారు. ఆక్సిజన్‌ నిల్వలపై ఏఏజీ బదులిస్తూ... ‘రాష్ట్రానికి ప్రస్తుతం 474టన్నుల ఆక్సిజన్‌ సరఫరా అవుతోంది. రాష్ట్ర అవసరాలు పోను రోజూ 10టన్నులు మిగులుతోంది. అవసరాన్ని బట్టి అదనపు ఆక్సిజన్‌ సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరతాం’ అని పేర్కొన్నారు. ధర్మాసనం కలగజేసుకుంటూ ఆక్సిజన్‌ డిమాండ్‌ ఎప్పుడు పెరుగుతుందో ఎవరూ చెప్పలేరని, ఢిల్లీ లాంటి పరిస్థితులు ఎదురైతే ఏం చేస్తారని ప్రశ్నించింది. ఆక్సిజన్‌ నిల్వ సామర్ధ్యం పెంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఇందుకోసం 25 ట్యాంకులు కొనుగోలు చేస్తోందని జీపీ సుమన్‌ బదులిచ్చారు. 


రాష్ట్రంలో 21,959 బెడ్లు ఖాళీ 

పిటిషనర్ల తరఫు న్యాయవాదులు నర్రా శ్రీనివాసరావు, పి.సురేశ్‌కుమార్‌ స్పందిస్తూ... రాష్ట్రంలో కరోనా బాధితులకు తగినన్ని ఆక్సిజన్‌ బెడ్‌లు లేవన్నారు. ఆక్సిజన్‌ కొరతో అనంతపురం, హిందూపురం, కర్నూలులో బాధితులు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయన్నారు. ప్రభుత్వం చెబుతున్న వివరాలు, వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. దీనిపై ధర్మాసనం వివరణ కోరగా... హిందూపురంలో మరణాలు ఆక్సిజన్‌ కొరత వల్ల కాదని జీపీ బదులిచ్చారు. ఆక్సిజన్‌ పైపు పగిలిపోవడం వల్ల కర్నూలులోని ప్రైవేటు ఆస్పత్రిలో ప్రమాదం జరిగిందన్నారు. అనంతపురం ఘటనలో కూడా ఆక్సిజన్‌ కొరత లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ... ఆస్పత్రుల్లో బెడ్లను పెంచడంతో పాటు పరీక్షా ఫలితాలు త్వరగా ప్రకటించేందుకు, లేబొరేటరీల సంఖ్య పెంచేందుకు ఏమైనా చర్యలు తీసుకున్నారా అని ఆరా తీసింది. కర్ఫ్యూ ప్రకటన నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల తరువాత పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. అదనపు ఏజీ బదులిస్తూ ఆస్పత్రుల్లో 55,719పడకలు ఉండగా 33,760 బాధితులతో నిండాయన్నారు. 21,959 బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. 


బెడ్ల సంఖ్య పెంచేందుకు ప్రైవేటు ఆస్పత్రులను  గుర్తిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14 ప్రభుత్వ, 45 ప్రైవేటు ల్యాబోరేటరీల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ఫలితాలు రావడానికి గరిష్ఠంగా 36గంటలు పడుతోందన్నారు. కర్ఫ్యూ విషయంలో ఇంకా మార్గదర్శకాలు జారీ చేయలేదని.. వచ్చే విచారణ నాటికి వివరాలను కోర్టు ముందు ఉంచుతామన్నారు. ఇదిలాఉండగా న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి కరోనా పరీక్షలు, చికిత్స అందించేందుకు తాడేపల్లి, విజయవాడలో కొవిడ్‌ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యదర్శి పి.రామన్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విషయంపై సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేసేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛనిచ్చింది. 

Updated Date - 2021-05-05T08:34:25+05:30 IST