బలవంతం చేస్తే భారం రోగులపైనే

ABN , First Publish Date - 2021-08-04T09:10:44+05:30 IST

100 పడక లు దాటిన అన్ని ప్రైవేటు ఆస్పత్రులూ ఆగస్టు 31 లోగా తప్పనిసరిగా సెల్ఫ్‌ జనరేటెడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలి.

బలవంతం చేస్తే భారం రోగులపైనే

ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయలేం.. స్పష్టం చేస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు

కొవిడ్‌ తరువాత నిరుపయోగమని వెల్లడి

ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షం: యాజమాన్యాలు


హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ‘‘ 100 పడక లు దాటిన అన్ని ప్రైవేటు ఆస్పత్రులూ ఆగస్టు 31 లోగా తప్పనిసరిగా సెల్ఫ్‌ జనరేటెడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలి. కొవిడ్‌ మూడోవేవ్‌ను ఎదుర్కొనడానికి సన్న ద్ధం కావాలి’’ ఇటీవల వైద్యశాఖ ఇచ్చిన ఆదేశాలివి. ఈ ఆదేశాలపై ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు అసంతృప్తిగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అంత ఖర్చు పెట్టి ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోలేమని అనాసక్తతను వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం బలవంతం చేస్తే ప్లాంట్ల ఖర్చు భారాన్ని రోగులమీదనే వేయాల్సి ఉంటుందని చెబుతున్నాయి.  


పీఎ్‌సఏ ఆక్సిజన్‌ ప్లాంట్లు తప్పనిసరి

ఆగస్టు 31 లోగా 100 పడకలు దాటిన అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రెజర్‌ స్వింగ్‌ అడ్సార్ఫన్స్‌ (పీఎస్‌ ఏ) ఆక్సిజన్‌ ప్లాంటు ఏర్పా టు చేసుకోవాల ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు జూలై 24వ తేదీన ఉత్తర్వ్యులు జారీ చేశారు. 100-500 మధ్య బెడ్స్‌ ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు సుమారు 500 వరకు ఉన్నాయి.  కాగా, ప్రైవేటు ఆస్పత్రు లు ఇబ్బంది పడకుండా ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పా టు చేసే కంపెనీలతో వైద్యఆరోగ్యశాఖ మాట్లాడింది. 9 ఏజెన్సీల సహకారంతో ప్లాంట్ల ఏర్పాట్ల రేట్ల ధరల వివరాల ను టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ తీసుకుంది. వాటిని అన్ని ఆస్పత్రులకు వైద్య ఆరోగ్యశాఖ పంపింది.


గడువులోగా కష్టమేనంటున్న ఆస్పత్రులు...

ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ప్రాణవాయువు ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడం కష్టమేనని ప్రైవేటు ఆస్పత్రులు చెబుతున్నాయి. ఒకేసారి అంత డబ్బును ఖర్చుపెట్టలేని స్థితిలో కొన్ని ఆస్పత్రులున్నాయి. మరోవైపు కొన్ని ఆస్పత్రుల్లో వాటిని ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన స్థలం లేదు. ప్లాంట్‌ ఏర్పాటుకు కనీసం 3 ఇంటూ 4 మీటర్ల స్థలం అవసరమౌతుందని వాటిని ఏర్పాటు చేసుకొన్న ఆస్పత్రులు చెబుతున్నాయి. పైగా కొవిడ్‌ ఉన్న కొద్దిరోజుల వరకే అవి ఉపయోగకరమని, ఆ తర్వాత అంత అవసరం ఉండదని ఆస్పత్రులు అంటున్నాయి. వాటిని ఏర్పాటు చేస్తే అందుకు అవసరమయ్యే వ్యయాన్ని మళ్లీ రోగుల నుంచి చార్జీల రూపంలో వసూల్‌ చేస్తామని ఓ ప్రైవేటు ఆస్పత్రి యజమాని ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. అలాగే వాటి నిర్వహణకు ప్రతిఏటా రూ. 5 లక్షల ఖర్చు అవుతుందని, దీనికితోడు కనీసం ముగ్గురు సిబ్బంది అందుకోసం పనిజేయాలని అంటున్నారు.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆ యంత్రాల కొరత ఉన్నందున నిర్దేశిత సమయంలోగా వాటిని కంపెనీలు కూడా సమకూర్చలేవని చెబుతున్నారు. ప్రాణవాయువు ప్లాంట్ల ఏర్పాటులో ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షంగా ఉందని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. కనీసం తమతో ఎటువంటి సంప్రదింపులు జరలేదని వాపోతున్నాయి. అంత ఖర్చు పెట్టుకోలేని కొన్ని ఆస్పత్రులు కొవిడ్‌ సేవల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాయి. అలాగే నెలరోజుల్లోనే వాటి ఏర్పాటు సాధ్యం కాదని చెబుతున్నాయి. 


ఎంత ఖర్చు అంటే..

సర్కారు ఆదేశాల మేరకు ఆక్సిజన్‌ ప్లాం ట్లును ఏర్పాటు చేయాలంటే భారీగా వెచ్చించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వీటితో పాటు వాటి నిర్వహణ కోసం ప్రతి ఏటా యాన్యువల్‌ మెయింటెన్స్‌ చార్జీ(ఏఎమ్‌సీ) కింద రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఆక్సిజన్‌ ప్లాంట్ల యంత్రాలను సరఫరా చేసిన కంపెనీలకు చెల్లించాల్సివుంటుంది.


సర్కారే ప్లాంట్లు పెట్టాలి

బలవంతంగా మాపై ఆక్సిజన్‌ ప్లాంట్లను రుద్దే బదులు సర్కారే ప్రతి జిల్లాలో ఒక సెల్ఫ్‌ ఆక్సిజన్‌ జనరేటెడ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలి. దాని నుంచి మాకు ప్రాణవాయువు సరఫరా చేయాలి. అందుకోసం నిర్దేశిత రుసుం చెల్లించేందుకు మేం సిద్దంగా ఉన్నాం.  

-డాక్టర్‌ రాకేశ్‌, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌

రెండున్నర నెలలు పట్టింది 

మా ఆస్పత్రిల్లో సెల్ఫ్‌ జనరేటెడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటుచేశాం. కొవిడ్‌ కంటే ముందు ఇండెంట్‌ పెట్టాం. మొత్తం ఏర్పాటుకు రెండున్నర నెలల టైమ్‌ పట్టింది. ప్లాంట్‌లో 70 శాతం ఆక్సిజన్‌ ఉన్నంత వరకు చాలా ప్రెజర్‌గా ప్రాణవాయువు వస్తోంది. ఆ తర్వాత తగ్గుతోంది. ఏఎమ్‌సీ కింద రూ.3 లక్షలు చెల్లించాం. ప్రతినెలా విద్యుత్‌ బిల్లు లక్ష వరకు వస్తోంది. 

- ప్రశాంతి ఆస్పత్రి యాజమాన్యం, వరంగల్‌

Updated Date - 2021-08-04T09:10:44+05:30 IST