ఆక్సిజన్‌ ప్లాంట్లు నేవీ చేతికి

ABN , First Publish Date - 2021-05-09T08:56:50+05:30 IST

రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఆక్సిజన్‌ కొరతను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తూర్పు నావికాదళం ఈఎ్‌ససీ, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సీఎండీతో కొవిడ్‌ కేర్‌ సెంటర్స్‌ ప్రత్యేకాధికారి, రవాణాశాఖ

ఆక్సిజన్‌ ప్లాంట్లు నేవీ చేతికి

నిర్వహణకు తూర్పు నావికాదళం సంసిద్ధత 

ఈ బాధ్యతల కోసం 4 ప్రత్యేక బృందాలు 

సరఫరాలో అంతరాయం, ఇబ్బందులపైనా దృష్టి 

కొవిడ్‌ చికిత్స కోసం ఐఎన్‌ఎస్‌ కళింగ ఆస్పత్రిలో 10 ఆక్సిజన్‌ బెడ్లతో పాటు 60 పడకలు ఏర్పాటు 

ఆరు నెలల్లో 850 టన్నులు అందుబాటులోకి 

గురజాడ కళాక్షేత్రంలో 50 పడకల ఆస్పత్రి...ఏర్పాటుకు స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం సిద్ధం 

తూర్పునేవీ, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అధికారులతో కొవిడ్‌ కేర్‌ సెంటర్స్‌ ప్రత్యేకాధికారి కృష్ణబాబు చర్చలు 


అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఆక్సిజన్‌ కొరతను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తూర్పు నావికాదళం ఈఎ్‌ససీ, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సీఎండీతో కొవిడ్‌ కేర్‌ సెంటర్స్‌ ప్రత్యేకాధికారి, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు విశాఖలో శనివారం సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వాస్పత్రులు, బోధనాస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణ చేపట్టేందుకు నావికాదళం సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్లాంట్ల లీకేజీలు, స్థితిగతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు నిర్వహణ బాధ్యతల కోసం నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఒక్కో బృందం మూడు, నాలుగు జిల్లాల బాధ్యతలు తీసుకుంటుంది. అవసరమైన చోట్లకు వాయుమార్గంలో బృందాలను పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని వెల్లడించింది. ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం, ఇతర ఇబ్బందులను నావికాదళం పరిష్కరిస్తుంది. ప్లాంట్లలో తలెత్తిన సాంకేతిక లోపాలను సవరించడానికి అవసరమైన సాయమందించేందుకు కూడా అంగీకరించింది. సింగపూర్‌, థాయ్‌లాండ్‌, మలేసియా నుంచి రాష్ట్రానికి రానున్న 25 క్రయోజనిక్‌ ట్యాంకర్లను తరలించడానికి ప్రత్యేకంగా వాహనాలను సమకూర్చేందుకు నావికాదళం అంగీకరించింది. దీంతో పాటు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, డి-టైప్‌ ఆక్సిజన్‌ సిలిండర్లు, కొవిడ్‌ చికిత్సకు అవసరమైన ఇతర వైద్య పరికరాల సరఫరాకూ అంగీకారం తెలిపింది. ఐఎన్‌ఎస్‌ కళింగ ఆస్పత్రిలో పది ఆక్సిజన్‌ బెడ్లతో పాటు 60 పడకలను కొవిడ్‌ చికిత్స కోసం అందించేందుకు నావికా దళం ముందుకొచ్చింది. 


అదనంగా విశాఖ కంచరపాలెంలో 150 పడకల తాత్కాలిక ఆస్పత్రి కోసం మౌలిక సదుపాయాల కల్పనకు నావికాదళం అంగీకరించింది. ఇక విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సీఎండీతో జరిపిన చర్చల్లోనూ ఆక్సిజన్‌ సరఫరాకు సంబంధించి సానుకూల ధోరణి కనిపించిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 850 టన్నుల సామర్థ్యం కలిగిన 2 యూనిట్లలో 100 టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నట్లు సీఎండీ వెల్లడించారని వివరించింది. 2013లోనే ప్లాంట్‌ పూర్తయినా కాంట్రాక్టు ఏజెన్సీతో సంప్రదింపులు పూర్తికాలేదని ప్లాంట్‌ సీఎండీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ పూర్తయినందున పూర్తి సామర్థ్యంతో ఆక్సిజన్‌ ఉత్పత్తి 6నెలల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ ప్లాంటును సందర్శించేందుకు తూర్పు నావికాదళం అంగీకరించింది. గురజాడ కళాక్షేత్రంలో కొవిడ్‌ చికిత్స కోసం ఆక్సిజన్‌తో కూడిన 50 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు స్టీల్‌ప్లాంట్‌ అంగీకరించింది. వీటికి అదనంగా మరో 150 బెడ్లు ఈ నెల 15న ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఈ నెలాఖరు నాటికి 250 పడకలు, వచ్చేనెల నాటికి 600 బెడ్లు అందుబాటులోకి తెస్తామని తెలిపింది. నావికాదళం, స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం అభ్యర్థన మేరకు వారి సిబ్బందికి 4వేల వ్యాక్సిన్లు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.

Updated Date - 2021-05-09T08:56:50+05:30 IST