ఆక్సిజన్‌ ప్లీజ్‌!

ABN , First Publish Date - 2021-05-04T06:45:12+05:30 IST

తిరుపతిలోని ఆరు ప్రైవేట్‌ ఆసుపత్రులు ఇదివరకు రోజుకు సుమారు 30 ఆక్సిజన్‌ సిలిండర్లు వినియోగించేవారు. ఇప్పుడు దాదాపు 200 సిలిండర్లు ఖర్చు అయిపోతున్నాయి. గతంలో ఒక్కో సిలిండర్‌ ధర రూ.450 నుంచి రూ.500 ఉండేది. ఇప్పుడు అదే సిలిండర్‌ ధర ఏకంగా రూ.5 వేల నుంచి రూ.6వేలు పలుకుతోంది.

ఆక్సిజన్‌ ప్లీజ్‌!
పద్మావతి కొవిడ్‌ ఆస్పత్రి బయట ఆక్సిజన్‌ తీసుకుంటున్న బాధితులు

విపరీతంగా పెరిగిన వినియోగం

తంటాలు పడుతూ నెట్టుకొస్తున్న వైనం

ప్రస్తుతానికి ఓకే, పరిస్థితి విషమిస్తే ప్రమాదమే


తిరుపతి- ఆంధ్రజ్యోతి 

తిరుపతిలోని ఆరు ప్రైవేట్‌ ఆసుపత్రులు ఇదివరకు రోజుకు సుమారు 30 ఆక్సిజన్‌ సిలిండర్లు వినియోగించేవారు. ఇప్పుడు దాదాపు 200 సిలిండర్లు ఖర్చు అయిపోతున్నాయి.  గతంలో ఒక్కో సిలిండర్‌ ధర రూ.450 నుంచి రూ.500 ఉండేది. ఇప్పుడు అదే సిలిండర్‌ ధర ఏకంగా రూ.5 వేల నుంచి రూ.6వేలు పలుకుతోంది. 

జిల్లాలో ఆక్సిజన్‌ అవసరం ఎంత పెరిగిందో దీన్నిబట్టి అర్థం అవుతోంది. కరోనా రెండో అల సృష్టిస్తున్న బీభత్సం పాజిటివ్‌ బాధితుల్ని కకావికలం చేస్తోంది. ఆక్సిజన్‌ అవసరం ఎక్కువ మందికి పెరగడంతో ఉత్పత్తి, పంపిణీకి, అవసరానికి నడుమ అగాథం పెరుగుతోంది. ఈ పరిస్థితి ప్రజల్లో మరింత భయాందోళనలకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆక్సిజన్‌ నిల్వలు, డిమాండ్‌, కొరతపై ఆంధ్రజ్యోతి ఫోకస్‌...


- స్విమ్స్‌లో పద్మావతి కొవిడ్‌ ఆస్పత్రి కోసం 11కేఎల్‌ లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిరంతరం పనిచేస్తోంది. కొవిడ్‌ బాధిత రోగులతో కిక్కిరిసిన ఈ ఆస్పత్రి అవసరాల కోసం ఇది సరిపోవడం లేదు. దీంతో విడి సిలిండర్లను తెప్పించి బాధితులకు ఆక్సిజన్‌ సమకూరుస్తున్నారు. అదనంగా మరో 10కేఎల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ అవసరం ఉందని గుర్తించి, 11కేఎల్‌ సామర్థ్యం గల లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 -రుయాస్పత్రిలో 19కేఎల్‌ సామర్థ్యంతో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నారు. ఇక్కడ కొవిడ్‌ బాధితులకు రోజుకు 11కేఎల్‌ లిక్విడ్‌ ఆక్సిజన్‌ ఖర్చుఅవుతోందని  అంటున్నారు. ఇవిగాక ప్రత్యేక ఆర్థోవార్డులోని కొవిడ్‌ బాధితులకు రోజుకు 70 నుంచి 80 బల్క్‌ సిలిండర్ల ద్వారా ప్రాణవాయువును అందిస్తున్నారు. ప్రస్తుతానికి రుయాలో ఆక్సిజన్‌కు ఎలాంటి కొరతలేదని చెబుతున్నారు. అయితే ఇక్కడ ప్లాంట్‌ నుంచి ఆక్సిజన్‌ సరఫరా అయ్యే పైపుల సామర్థ్యంపై అనుమానాలున్నాయి. 

 -చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత లేదు. అపోలో వారు చెన్నై నుంచి ప్రతి మూడు రోజులకు ఒకసారి తెప్పిస్తున్నారు. ప్రస్తుతం 4,500లీటర్ల లిక్విడ్‌ ఆక్సిజ్‌ నిల్వ ఉంది. ఇక్కడ ఆక్సిజన్‌ వినియోగించే 360 పడకలు ఉన్నాయి. రోజుకు వెయ్యి నుంచి 1500 లీటర్ల ఆక్సిజన్‌ను వినియోగిస్తున్నారు. 

- శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రిలో 50 ఆక్సిజన్‌ బెడ్లు ఉన్నాయి. 30 ఆక్సిజన్‌ సిలిండర్ల అవసరం ఉండగా రోజుకు 10సిలిండర్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. రోజూ ఏర్పేడుకు వెళ్లి సిలిండర్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. 

- కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో 60 పడకల్లో 10ఆక్సిజన్‌ బెడ్లు ఉన్నాయి. డీటైప్‌ సిలిండర్లు ద్వారా ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నారు. 125క్యూబిక్‌ మీటర్ల ఆక్సిజన్‌ నిల్వలు ఉన్నాయి. సోమవారానికి 51మంది కరోనా రోగులు అడ్మిషన్లో ఉన్నారు. 

- మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో 120 పడకలు ఉన్నాయి. ఇందులో వెంటిలేటర్‌ పడకలు 20, ఆక్సిజన్‌ పడకలు 100 ఉన్నాయి. 55 సిలిండర్లు అందుబాటులో ఉండడంతో ఆక్సిజన్‌ కొరతలేదని వైద్యులు చెబుతున్నారు. 

- పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రిలో 36 ఆక్సిజన్‌ బెడ్స్‌ ఉండగా, కొరత లేదని వైద్యులు అంటున్నారు. 70ఆక్సిజన్‌ సిలిండర్లు నిల్వ ఉన్నాయి. అయితే కరోనా బాధితుల పరిస్థితి విషమించినపుడు కేవలం గంట రెండు గంటల పాటు ఆక్సిజన్‌ పెట్టి అంబులెన్స్‌లో వెంటనే చిత్తూరుకు రెఫర్‌ చేస్తున్నారు. 


కొరత ఎందుకు?

ఆక్సిజన్‌ సరఫరాకు మించి వైరస్‌ బాధితులను ఆసుపత్రుల్లో చేర్చుకోవడమే నిల్వలు అయిపోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఒకవార్డులో 60 మంది బాధితులకు మాత్రమే ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు అవకాశం ఉంటే అదనంగా మరో 40మందిని చేర్చుకోవడంతో పైపులపై ఒత్తిడిపెరిగి లీకేజీ ఏర్పడిపగిలిపోతున్నట్టు తెలుస్తోంది. 


ప్రైవేటుకు చాలీ చాలని ఆక్సిజన్‌

ఏర్పేడు సమీపంలో మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఓ కంపెనీ నిర్వహిస్తోంది. అక్కడనుంచి సిలిండర్ల ద్వారా (ఒక్కోసిలిండర్‌ 7.10క్యూబిక్‌ మీటర్‌ సామర్థ్యం) జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సరఫరా చేస్తోంది. అయితే డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో చిన్నచిన్న ఆస్పత్రులకు సరఫరా చేయలేనని చేతులెత్తేసినట్టు తెలిసింది. దీంతో ఆ ఆస్పత్రులు ఆక్సిజన్‌ కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినట్టు సమాచారం.




Updated Date - 2021-05-04T06:45:12+05:30 IST