సత్ఫలితాలనిస్తున్న ఆక్సిజన్‌ థెరపీ

ABN , First Publish Date - 2020-07-05T07:48:29+05:30 IST

శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఆక్సిజన్‌ థెరపీతో త్వరితగతిన కోలుకుంటున్నారు.

సత్ఫలితాలనిస్తున్న ఆక్సిజన్‌ థెరపీ

  • త్వరితగతిన కోలుకుంటున్న పాజిటివ్‌ రోగులు..
  • హైదరాబాద్‌లో సిలిండర్లకు పెరిగిన డిమాండ్‌


హైదరాబాద్‌ సిటీ, జూలై 4 (ఆంధ్రజ్యోతి):  శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఆక్సిజన్‌ థెరపీతో త్వరితగతిన కోలుకుంటున్నారు. దీంతో ఈ చికిత్సకు డిమాండ్‌ పెరిగింది. అయితే ఆక్సిజన్‌ కొరత కారణంగా రోగులు విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న ఘటనలూ లేకపోలేదు. ఆస్పత్రులతో పాటు ఇళ్లల్లో క్వారంటైన్‌లో ఉన్న కరోనా పాజిటివ్‌ రోగుల సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. వీరికి సరిపడా ఆక్సిజన్‌ యంత్రాలు మాత్రం అందుబాటులో లేవు. అధికారిక లెక్కల ప్రకారం ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటెడ్‌ సిలిండర్లు(ఆక్సిజన్‌ రీఫిల్లింగ్‌ అవసరం లేని) హైదరాబాద్‌లో రోజు కు వెయ్యి కావాల్సి ఉండగా 250 వరకే అందుబాటులో ఉన్నాయి. ఇక ఇళ్లల్లో సంపన్నులు మాత్రమే ఏర్పాటు చేసుకునే (ధర సుమారు రూ.50వేలు) వీలుండటంతో పేదలు ఆస్పత్రులపైనే ఆధారపడాల్సి వస్తోంది. 


90కి తగ్గితే ప్రమాదమే

హైదరాబాద్‌లో  పాజిటివ్‌ రోగులు, కాంటాక్ట్‌ కేసులను పరిశీలిస్తే.. వారిలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గడం గమనించారు. సాధారణ స్థాయి - 90 పల్స్‌కి తగ్గితే అది ప్రమాద సంకేతమే. అలాంటి సమయంలో వెంటనే ఆక్సిజన్‌ థెరపీ అందిస్తున్నారు. రోగులు త్వరితగతిన కోలుకుంటుడటంతో ఆక్సిజన్‌ థెరపీపై ప్రభుత్వం దృష్టి సారించింది. గాంధీ ఆస్పత్రిలో 1600 మందికి ఆక్సిజన్‌ థెరపీ అందించగా.. 1400 మంది కోలుకోవడం విశేషం. మరణించిన 200 మందిలో కేన్సర్‌, డయాబెటిస్‌, కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులున్నారని ఓ వైద్యుడు తెలిపారు. గత నెలలో కొ విడ్‌ కేసుల తీవ్రతను పరిశీలించిన ప్రభుత్వ యం త్రాంగ, వైద్యాధికారులు ఆక్సిజన్‌ ఆవశ్యకతను గుర్తించారు. ఉస్మానియా, గాంధీ, టిమ్స్‌ ఆస్పత్రుల్లో నేరుగా పేషెంట్‌ బెడ్‌ వరకు ఆక్సిజన్‌ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సన్‌ట్రేటెడ్‌ ఆక్సిజన్‌ కొరత ఉన్నప్పటికీ.. ఆ కొరతను అధిగమించేందుకు ప్రభు త్వం ఆక్సిజన్‌ సరఫరా దారుల నుంచి టెండర్లు కూడా ఆహ్వానించినట్టు సమాచారం. 


కాన్సన్‌ట్రేటెడ్‌ ఆక్సిజన్‌కు గిరాకీ

సాధారణ సిలిండర్లు కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఆక్సిజన్‌ అందజేస్తాయి. ఆ తర్వాత వాటిని రీఫిల్లింగ్‌ చేయడం పెద్ద సమస్యగా మారినందున కాన్సన్‌ట్రేటెడ్‌ సిలిండర్లకు గిరాకీ పెరిగింది. ఈ సిలిండర్ల ధర సుమారు రూ.50వేలు కాగా.. ప్రస్తుతం ఇవి అందుబాటులో లేవని ఓ డీలర్‌ చెప్పాడు. కాన్సన్‌ట్రేటెడ్‌ సిలిండర్లు అమెరికా, చైనా నుంచి దిగుమతి అవుతాయని మరో డీలర్‌ చెప్పాడు. అమెరికా నుంచి వాటి దిగుమతులు నిలిచిపోగా.. ప్రస్తుతం చైనా నుంచి మాత్రమే సిలిండర్లు దిగుమతి అవుతున్నాయని చెప్పా రు. కేసుల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా మరో  సిలిండర్లకు డిమాండ్‌ మరింతగా పెరిగే అవకాశం ఉంది. 

Updated Date - 2020-07-05T07:48:29+05:30 IST