తిరుపతి ఆర్డీవో ఆఫీసులో ఆక్సిజన్‌ వార్‌రూమ్‌

ABN , First Publish Date - 2021-05-12T07:13:14+05:30 IST

రుయా ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో ఆక్సిజన్‌ వార్‌రూమ్‌ (కంట్రోల్‌రూమ్‌) ఏర్పాటు చేశారు.

తిరుపతి ఆర్డీవో ఆఫీసులో ఆక్సిజన్‌ వార్‌రూమ్‌

 తిరుపతి, మే11 (ఆంధ్రజ్యోతి): రుయా ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో ఆక్సిజన్‌ వార్‌రూమ్‌ (కంట్రోల్‌రూమ్‌) ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్‌ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ అవసరాలు, సరఫరా, వాడకం పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులను నియమించారు. వీరితో మంగళవారం జేసీ వీరబ్రహ్మం సమీక్షించారు. తమకు కేటాయించిన ఆస్పత్రుల్లో పడకల సంఖ్య, ఆక్సిజన్‌ అవసరాలు గుర్తించి ఎప్పటికప్పుడు సమాచారమిచ్చి ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచాలని నోడల్‌ అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఏర్పేడు వద్ద శ్రీకృష్ణ రీఫిల్లింగ్‌ నుంచి ఆక్సిజన్‌ వస్తోందని, త్వరలో వడమాలపేటలో రాఘవేంద్ర, చిత్తూరు సప్తగిరి రీఫిల్లింగ్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. వీరికి విశాఖ నుంచి వచ్చే ఆక్సిజన్‌ ట్యాంకును జిల్లా పరిశ్రమల అధికారి ప్రతాప్‌రెడ్డి మానిటర్‌ చేస్తారని, అసిస్టెంట్‌ కలెక్టర్‌ అభిషేక్‌కుమార్‌ పర్యవేక్షణ ఉంటుందని వివరించారు. వార్‌రూంలో విధులు కేటాయించిన తహసీల్దారులు, సివిల్‌ సప్లయ్‌ డీటీలు 24 గంటలూ అందుబాటులో ఉండాలని, రియల్‌టైమ్‌ ఫిగర్స్‌ ఉండాలని తహసీల్దార్లు, సివిల్‌ సప్లయ్‌ డీటీలకు తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి సూచించారు. రోగులకు ఆక్సిజన్‌ అందలేదని సమస్య వస్తే డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్టు మేరకు చర్యలు ఉంటాయన్నారు. ఈ సమీక్షలో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కీర్తన, తహసీల్దారు పుల్లారెడ్డి, సీఎస్‌డీటీలు శ్యామ్‌ప్రసాద్‌, సురేంద్ర, మల్లికార్జునరావు, గంగయ్య, మురళిమోహన్‌, యుగంధర్‌, మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-12T07:13:14+05:30 IST