May 15 2021 @ 15:51PM

ఢిల్లీలో ఆక్సిజన్ ఫ్రీ డెలివరీ: సోనుసూద్

కరోనా ఉదృతి ఎంత వేగంగా పెరుగుతుందో.. అంతకుమించి వేగంగా సేవలు అందిస్తున్నారు రియల్‌హీరో సోనూసూద్‌. వలస కార్మికుల నుంచి కరోనా బాధితులకు ఆక్సిజన్‌  కొరత వరకూ ప్రతి సమస్యలోనూ ఆయన భాగమై పేదలకు సహాయం అందిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కేసులు విపరీతంగా పెరగడం, అక్కడ ఆక్సిజన్‌ కొరత ఎక్కువగా ఉండడంతో మరో అడుగు ముందుకేసి సోనూ సేవలందిస్తున్నారు. తుష్టి ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో ఢిల్లీలో కరోనా బాధితులకు ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్‌లు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఓ కాల్‌ సెంటర్‌ నంబర్‌ ఇచ్చారు. 02261403615  ఈ నంబర్‌కు మిస్‌ కాల్‌ ఇస్తే ఆక్సిజన్‌  కాన్‌సెంట్రేటర్‌  మీ ఇంటి ముందు ఉంటుందని సోనూసూద్‌ ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేసి తెలియచేశారు. ఇదంతా ఉచితంగా చేయడం విశేషం. ‘‘ఢిల్లీలో కేసులు మరిన్ని పెరుగుతున్నాయి. అక్కడి నుంచి చాలామంది సాయం కోసం సంప్రదించారు. అందుకే మీ ఇంటికే ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్‌  వచ్చేలా ఏర్పాటు చేస్తున్నాం. మేమిచ్చిన నంబర్‌కి ఫోన్‌ చేసి వివరాలు తెలియజేస్తే మా సిబ్బంది ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్‌  మీ ఇంటి ముందు ఉంచుతారు. దీనికి ఎవరూ పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ మీ పని అయిన తర్వాత ఖాళీ కాన్‌సెంట్రేటర్‌ ను తిరిగి పంపండి. అది మరొకరికి ఉపయోగపడుతుంది. రెండు ఫౌండేషన్‌లతో కలిసి మీ నగరం కోసం చేస్తున్న చిన్న సాయమిది. అవసరంలో ఉన్న వారికి అండగా నిలబడడం చాలా పెద్ద విషయమని పెద్దలు చెబుతారు. అదే నేను చేస్తున్నా’’ అని సోనూసూద్‌ పేర్కొన్నారు.