వినియోగమే వృద్ధి మంత్రం

ABN , First Publish Date - 2021-09-04T05:55:39+05:30 IST

ఆర్థికవ్యవస్థ కోలుకోవడానికి ప్రభుత్వం వాస్తవిక నిర్ణయాలు తీసుకోవాలి, సాహసోపేత చర్యలు చేపట్టాలి. పిరికితనంతో వ్యవహరిస్తే పురోగతి ఎలా సాధ్యమవుతుంది? ప్రభుత్వం ఖర్చు చేయాలి. ఆర్థికవనరులు లేని పక్షంలో అప్పుతీసుకుని...

వినియోగమే వృద్ధి మంత్రం

ఆర్థికవ్యవస్థ కోలుకోవడానికి ప్రభుత్వం వాస్తవిక నిర్ణయాలు తీసుకోవాలి, సాహసోపేత చర్యలు చేపట్టాలి. పిరికితనంతో వ్యవహరిస్తే పురోగతి ఎలా సాధ్యమవుతుంది? ప్రభుత్వం ఖర్చు చేయాలి. ఆర్థికవనరులు లేని పక్షంలో అప్పుతీసుకుని, మరీ ఖర్చు చేయాలన్న సలహాను నేను ఆమోదిస్తున్నాను. కుదేలయిన ఆర్థికవ్యవస్థ శీఘ్రగతిన కోలుకోవడానికి అదే సరైన, కచ్చితమైన మార్గం.


కేంద్రగణాంకాల కార్యాలయం (సిఎస్ఓ) గత నెల 31న మన జాతీయ ఆదాయంపై అంచనాలను ప్రకటించింది. స్థూలదేశీయోత్పత్తి సంఖ్య, నిజంగా ఆకట్టుకునే విధంగా ఉంది. ఇదిగో, ఆ గణాంకం---– 20.1 శాతం! అంకెల ఆకర్షణ చెప్పతరమా! ఈ వృద్ధిరేటును ప్రజలు విశ్వసిస్తారని పాలకులు భావిస్తున్నట్టుగా ఉంది. వారు వెల్లడించే ‘సత్యాలు’ కల్పనలు కానిదెప్పుడు?


నిప్పులాంటి నిజాలను ఎవరు దాచగలరు? అందునా ప్రజల నుంచి. మన ఆర్థికాభివృద్ధి తీరుతెన్నుల గురించి ప్రజలకు బాగా తెలుసు. అందుకే ప్రభుత్వ గణాంకాలను వారు విశ్వసించడం లేదు. వారికి అభినందనలు. అలాగే మీడియాకు కూడా. సిఎస్ఓ అంచనాలను మీడియా నిశితంగా విశ్లేషించింది. 202౧-–22 ఆర్థికసంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 20.1 శాతం అట ఏ ప్రాతిపదికన ఈ అంచనాకు వచ్చారు? 2020–21 ఆర్థికసంవత్సరం మొదటి త్రైమాసికం వృద్ధిరేటును ప్రాతిపదికగా తీసుకున్నారు. మరి అది (-–) 24.4 శాతం. ఏడాది కాలంలో మన ఆర్థికవ్యవస్థ 20.1 శాతం వృద్ధిరేటును సాధించిందని పాలకుల అంచనా. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ నెలల క్రితమే మన ఆర్థికాభివృద్ధిని ‘గణితాత్మక పెరుగుదల’గా అభివర్ణించారు. 


సరే, మన సంశయాలను అలా ఉంచి సిఎస్ఓ ప్రకటించిన వృద్ధిరేటును స్వాగతిద్దాం. ప్రభుత్వ విధానాలు ఎంత అసమంజసంగా ఉన్నా భారత్ లాంటి దేశం సాధించగల అభివృద్ధిని ఆ జీడీపీ అంకె చూపించింది. ప్రస్తుత ఆర్థికసంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–-జూన్ 2021) తొలి వారాల్లో కొవిడ్-–19 రెండో ఉద్ధృతితో నెలకొన్న సంక్షోభాన్ని లాక్‌డౌన్ అమలుపరచకుండానే అధిగమించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు సఫలమయ్యాయి. మరి మోదీ ప్రభుత్వం మాటేమిటి? రెండో ఉద్ధృతిని సమర్థంగా ఎదుర్కోవడంలో కేంద్రం ఘోరంగా విఫలమయింది. ఇది నిష్ఠుర సత్యం. వారాల తరబడి ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా కొరవడింది. ఫలితంగా కొవిడ్ రోగులు ఎంతో మంది మరణించారు. రికార్డయిన ప్రతి కొవిడ్ మరణానికి కనీసం పది కొవిడ్ మరణాలు రికార్డు కాలేదు.


ప్రజల వ్యక్తిగత తుది వినియోగవ్యయాల వల్లే 20.1 శాతం వృద్ధిరేటు సాధ్యమయింది. వివిధ వస్తుసేవలను వినియోగించుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేశారు. 2020–21 ఆర్థికసంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ వినియోగవ్యయాలు రూ.14,94,524 కోట్లు కాగా అవి 2021–22 ఆర్థికసంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.17,83,611 కోట్లకు పెరిగాయి.


 ప్రజల వినియోగవ్యయాలతో పాటు మరో తుది వినియోగవ్యయం కూడా ఉంది. అది ప్రభుత్వానిది. ప్రజలవ్యయాల రీతిలో ప్రభుత్వ వ్యయం కూడా ఉన్నట్టయితే పరిస్థితులు ఎలా ఉండేవి? ప్రజల వినియోగవ్యయాలు గత ఆర్థికసంవత్సరపు మొదటి త్రైమాసికంలో రూ.4,42,618 కోట్ల నుంచి ప్రస్తుత ఆర్థికసంవత్సరపు మొదటి త్రైమాసికంలో రూ.4,21,471 కోట్లకు తగ్గిపోయాయి. మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు పెరుగుదలకు ప్రభుత్వ దోహదం ప్రతికూలంగా ఉందని చెప్పక తప్పదు. అభివృద్ధి చోదక శక్తులలో ఒకటైన ఎగుమతులరంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రభావశీల చర్యలు చేపట్ట లేదు. నికర ఎగుమతులు గత ఆర్థికసంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.34,071 కోట్ల నుంచి ప్రస్తుత ఆర్థికసంవత్సర మొదటి త్రైమాసికంలో (–-) 62,084 కోట్లకు తగ్గిపోయాయి. మరి 20.1 శాతం వృద్ధిరేటు గణితాత్మకమైనదే అయినప్పటికీ మన కృతజ్ఞతలు ప్రజలకే గానీ ప్రభుత్వానికి ఎంత మాత్రం కాదు. 


అవును, పాలకులకు ధన్యవాదాలు చెప్పవలసిన అవసరంలేదని నేను భావిస్తున్నాను. ఖర్చు చేయడంలో ప్రభుత్వం ధైర్యం చూపలేక పోయింది. డబ్బు కొరతా? అయినప్పుడు అప్పు తీసుకుని వ్యయపరిచే సాహసం చేయలేకపోయింది. ఆర్థికంగా అట్టడుగుస్థాయిలో ఉన్న 20 లేదా 25 శాతం మంది ప్రజలకు నగదు బదిలీ చేసి ఉండాల్సింది. నిరుపేదలకు నగదు సమకూర్చితే ‘వ్యక్తిగత తుది వినియోగవ్యయం’ భారీగా పెరిగి ఉండేది. దానికి తోడు ప్రభుత్వ వ్యయం కూడ పెరిగిఉంటే ఆర్థికవ్యవస్థ 25 శాతం వృద్ధిరేటును సాధించి ఉండేదనడంలో సందేహం లేదు. గత ఏడాది ఘోరంగా పడిపోయిన వృద్ధిరేటు (–-24.4శాతం) లోటును భర్తీచేయడం సాధ్యమయ్యేది.


2021–22 ఆర్థికసంవత్సర మొదటి త్రైమాసికానికి సంబంధించిన గణాంకాలు మన ఆర్థికవ్యవస్థ తీవ్ర బలహీనతలను కూడా వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత అంచనాలకు నిజమైన ప్రమాణంగా 2020–21ని కాకుండా 2019–-20ను తీసుకుని ఉండాల్సి ఉంది. 2019–-20లో వార్షికఉత్పత్తి స్వల్పస్థాయిలోనే ఉన్నా అది కచ్చితంగా పెరుగుదలలో ఉంది. మరి మనం ఇప్పుడు కనీసం ఆ స్థాయిలోనైనా ఉన్నామా? సమాధానం స్పష్టమే. పారిశ్రామిక ఉత్పత్తులు, అటవీఉత్పత్తులు, గనులతవ్వకం, తయారీరంగం, నిర్మాణరంగం వాణిజ్యం, రవాణా, కమ్యూనికేషన్లు , సేవల రంగాలలో మన ప్రస్తుత ఉత్పత్తి 2019–20 నాటి స్థాయిలో లేదు. మరింత ఘోరమైన విషయమేమిటంటే ఆయా రంగాలలో ప్రస్తుత ఉత్పత్తిస్థాయి 2018–19 కంటే కూడా తక్కువగా ఉంది. ఒక్క వ్యవసాయరంగం మాత్రమే ఇందుకు మినహాయింపు.


 ఆర్థికవ్యవస్థలోని వివిధ రంగాలకు సంబంధించి సిఎమ్ఐఇ మొదలైన సంస్థల నివేదికలు వెల్లడించిన అంకెలకు ప్రభుత్వ అంచనాలు విరుద్ధంగా ఉన్నాయి. ఉద్యోగాల నష్టం అంశాన్నే తీసుకోండి. ఆర్థికవ్యవస్థ నిర్వహణలో అవకతవకల వల్ల 2019–-20లో లక్షలాది ఉద్యోగాలను నష్టపోయాము. 2020–-21లో కరోనా మహమ్మారి ఫలితంగా మరింత భారీసంఖ్యలో ఉద్యోగాలను నష్టపోయాం. ఆ ఉద్యోగాలు 2021–-22లో తిరిగి వచ్చాయా? ఇంతవరకు రాలేదు. ఇక ముందు వప్తాయని కచ్చితంగా చెప్పలేము. మరో వాస్తవాన్ని కూడా మనం విస్మరించకూడదు. ఉద్యోగితలో అధికభాగం అనియత రంగం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా రంగాలలో మాత్రమే ఉంది. ప్రస్తుత ఆర్థికసంవత్సరానికి సంబంధించి సిఎస్ఓ తాజా అంచనాలు ఆ రంగాల వాస్తవాలను ప్రతిబింబించడం లేదు. 


ఆర్థికవ్యవస్థ కోలుకోవడానికి ప్రభుత్వం ఎంతో చేయవలసి ఉంది. అయితే నేను తరచు చెబుతున్నట్టుగా ప్రభుత్వం వాస్తవిక దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవడం లేదు. అంతకంటే ముఖ్యమైన విషయమమేమిటంటే ఆర్థికవ్యవస్థను పునరుద్ధరించేందుకు అవసరమైన సాహసోపేత చర్యలు సైతం చేపట్టడం లేదు. పిరికితనంతో వ్యవహరిస్తే పురోగతి ఎలా సాధ్యమవుతుంది? ప్రభుత్వం ఖర్చుచేయాలి. ఆర్థికవనరులు లేని పక్షంలో అప్పు తీసుకుని, మరీ ఖర్చు చేయాలని ఈ నెల 1న ఒక జాతీయ దినపత్రిక నరేంద్రమోదీ ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. ఈ సలహాను నేను ఆమోదిస్తున్నాను. ఎందుకంటే అది సంపూర్ణంగా సబబైనది. కుదేలయిన ఆర్థికవ్యవస్థ శీఘ్రగతిన కోలుకోవడానికి అదే సరైన, కచ్చితమైన మార్గం.



పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2021-09-04T05:55:39+05:30 IST