కార్మిక యోధుడు నారాయణస్వామి

ABN , First Publish Date - 2020-11-22T09:55:52+05:30 IST

టీడీపీ కార్మిక నేత, దివంగత పి.నారాయణస్వామి తన జీవితాంతం.. కార్మికుల సమస్యలపై, వారి హక్కుల పరిరక్షణకు పోరాడిన యోధుడని ..

కార్మిక యోధుడు నారాయణస్వామి

టీడీపీ అధినేత చంద్రబాబు

వర్చువల్‌ విధానంలో విగ్రహావిష్కరణ


మహబూబ్‌నగర్‌, నవంబరు 21(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): టీడీపీ కార్మిక నేత, దివంగత పి.నారాయణస్వామి తన జీవితాంతం.. కార్మికుల సమస్యలపై, వారి హక్కుల పరిరక్షణకు పోరాడిన యోధుడని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన మార్గాన్ని అనుసరిస్తూ.. అసంఘటిత కార్మికులు, పేదల ఉన్నతికి కృషి చేయడమే ఆయనకు మనమిచ్చే అసలైన నివాళని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌లో ఏర్పాటు చేసిన నారాయణస్వామి విగ్రహాన్ని వర్చువల్‌ విధానం ద్వారా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తకోట దయాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో.. వీడియో కాన్ఫరెన్సు ద్వారా చంద్రబాబు ప్రసంగించారు. గల్ఫ్‌లో ఉన్న కార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా నారాయణ స్వామి తక్షణమే స్పందించి అవసరమైన సహాయం అందించేవారని గుర్తు చేశారు.


ఆ క్రమంలో పలుమార్లు అక్కడికి వెళ్లి కూడా సమస్యలు పరిష్కరించారని తెలిపారు. కొన్ని సమస్యలపై బాధితుల పక్షాన నిలిచి కోర్టుల ద్వారా న్యాయం జరిగేలా చూశారని చెప్పారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీని వెన్నంటే నారాయణ ఉన్నారన్నారు. ఇటీవలే పార్టీ మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత కొద్ది కాలానికే అకాలమరణం చెందడం తనను బాధించిందన్నారు.  వెనుకబడిన మహబూబ్‌నగర్‌, అనంతపురం జిల్లాలను బాగు చేయాలని తన హాయాంలో పలు పథకాలు అమలు చేశామని చంద్రబాబు తెలిపారు. అందులో భాగమే శంషాబాద్‌ విమానాశ్రయమని చెప్పారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ మాట్లాడుతూ.. భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా ఉన్నతాశయాలతో నారాయణ స్వామి జీవించారని కొనియాడారు. బడుగు, బలహీనవర్గాలు, వలస కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడిన మహనీయుడు నారాయణస్వామి అని టీటీడీపీ ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని  అన్నారు. ఆయన మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.  

Updated Date - 2020-11-22T09:55:52+05:30 IST