బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా..

ABN , First Publish Date - 2020-11-22T09:10:49+05:30 IST

కెరీర్‌లో అండగా నిలిచిన తండ్రి మృతితో తీవ్ర విషాదంలో మునిగినా.. పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ మాత్రం జట్టు ప్రయోజనాల గురించే ఆలోచించాడు

బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా..

జట్టు కోసం ఆసీ్‌సలోనే ఉండిపోయిన సిరాజ్‌

న్యూఢిల్లీ: కెరీర్‌లో అండగా నిలిచిన తండ్రి మృతితో తీవ్ర విషాదంలో మునిగినా..  పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ మాత్రం జట్టు ప్రయోజనాల గురించే ఆలోచించాడు. క్రికెటర్‌గా రాణించాలనే తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు జట్టుతో పాటు ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు. అయితే ఈ కష్ట సమయంలో కుటుంబసభ్యుల వద్ద సమయం గడిపేందుకు సిరాజ్‌ను స్వదేశానికి పిలిపించాలనుకున్నామని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. కానీ జట్టుతో పాటు ఉండేందుకే అతడు మొగ్గు చూపాడని చెప్పాడు. సిరాజ్‌ తండ్రి మహ్మద్‌ గౌస్‌ అనారోగ్యంతో శుక్రవారం మరణించిన విషయం తెలిసిందే. ‘ఈ విషయమై సిరాజ్‌తో బీసీసీఐ మాట్లాడింది. ఈ కష్టకాలంలో కుటుంబంతో ఉండేందుకు అతడికి అనుమతి ఇచ్చాం. అయితే సిరాజ్‌ టీమిండియా తరఫున ఆడేందుకే మొగ్గు చూపాడు. ఈ గడ్డు పరిస్థితిలో అతడికి మేం మద్దతుగా నిలుస్తాం’ అని షా తెలిపాడు. అటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కూడా సిరాజ్‌ను కొనియాడాడు. ‘సిరాజ్‌ది అద్భుతమైన వ్యక్తిత్వం. జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితిని అధిగమిస్తాడని ఆశిస్తున్నా. ఈ టూర్‌లో అతడు విజయం సాధించాలి’ అని దాదా ట్వీట్‌ చేశాడు.

Updated Date - 2020-11-22T09:10:49+05:30 IST