Advertisement
Advertisement
Abn logo
Advertisement

హోరు వర్షంలోనూ అదే జోరు!

వానకు పోటీగా నగరవాసుల పూలవర్షం

మహాపాదయాత్రకు అడుగడుగునా నీరాజనం

బారాషహీద్‌ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు

రాజకీయ ప్రముఖుల సంఘీభావం


ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని...

జై అమరావతి.. జైజై అమరావతి..

అంటూ రైతులతోపాటు నగరవాసులు చేసిన నినాదం హోరెత్తిపోయింది. హోరున కురుస్తున్న వర్షంలోనూ తడుస్తూ పోరాటయోధుల నడకకు  ‘‘మేము సైతం మీ వెంటే’’నంటూ సింహపురీయులూ జతకట్టారు. రాజకీయ, స్వచ్ఛంద, ప్రజాసంఘాలు, మహిళలు, యువత, విద్యార్థులు ఇలా ఎవరికివారుగా పాదయాత్రలో పాల్గొన్నారు. అడుగడుగునా కర్పూరహారతులు పట్టి.. బెంగళూరు నుంచి తెప్పించిన ప్రత్యేక పూలను అమరావతి అన్నదాతలపై కురిపించారు. అభివృద్ధిని పూర్తిగా మరచిన రాష్ట్ర ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ అమరావతి రైతులు బారాషహీద్‌ దర్గాలో ప్రత్యేక పూజలు చేశారు. కాగా, మహాపాదయాత్ర 27వ రోజుకు చేరగా, 300 కిలోమీటర్లకు చేరుకుంది. కాగా శనివారం నగరంలో 12 కి.మీ పొడవున పాదయాత్ర సాగింది.


నెల్లూరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : అమరావతి రైతుల ఇన్నాళ్ల పోరాటానికి నెల్లూరు నగరంలో ఉప శమనం కలిగింది. శనివారం నగర ప్రజలు చూపించిన అభిమానం వారి వందల కిలోమీటర్ల పాదయాత్ర కష్టాన్ని మరపింపజేసింది. యాత్ర సాగిన దారులన్నీ ‘‘మాది నెల్లూరు.. మా రాజధాని అమరావతి’’ అనే నినాదాలతో హోరెత్తిపోయింది. ఉదయం 8గంటలకు జెట్టి శేషారెడ్డి కళ్యాణమండపం నుంచి యాత్ర మొదయ్యింది. అంతకుముందే ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, మాదాల వెంకటేశ్వర్లు, సీపీఎం కార్యకర్తలు కల్యాణమండపానికి చేరుకున్నారు. అమరావతి జేఏసీ నాయకులతో మాట్లాడారు. టీడీపీ నేతలు అబ్దుల్‌ అజీజ్‌, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తమ అనుచరులతో పాదయాత్రలో పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు చేవూరి దేవకుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ నాయకులు కార్యకర్తలతో కలిసి వచ్చి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. కిలారి సుబ్రహ్మణ్యం నాయుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, నగరానికి చెందిన పలువురు మాజీ కార్పోరేటర్లు, వివిధ సామాజికవర్గాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంఘీభావం తెలిపారు. రాజధాని రైతులకు స్వాగతం పలకడానికి ప్రత్యేకంగా బెంగళూరు నుంచి 2 టన్నుల పూలు తెప్పించి దారి పొడవునా వారిపై పూల వర్షం కురిపించారు. రైతులు నడిచే దారుల్లో జై అమరావతి అంటూ పూలతో రాసి స్వాగతం పలికారు. మధ్యాహ్నం బారాషాహీద్‌ దర్గా వద్దకు చేరుకోగానే  ముస్లిం మత పెద్దలు వారి మత సంప్రదాయాల ప్రకారం వారిని ఆహ్వానించారు. అమరావతి కోసం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాజధాని రైతులతోపాటు దేవినేని ఉమ మహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తదితరులు దర్గాలో ప్రార్థనలు తెలిపారు. అనంతరం రాజధాని జేఏసీ రైతులు మాట్లాడుతూ దర్గాలో చేసిన పూజలైనా ముఖ్యమంత్రికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. సాయత్రం గంటలకు నగర శివారులోని రాత్రి బస చేసే విడిది కేంద్రం శాలివాహన ఫంక్షన్‌ హాలుకు చేరుకున్నారు. టీడీపీ జాతీయ కార్యదర్శి బీద రవిచంద్ర, రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య,   తాళ్లపాక అనురాధ, కాంగ్రెస్‌ పారీ సిటీ ఇన్‌చార్జ్‌ ఫయాజ్‌, రూరల్‌ ఇన్‌చార్జ్‌ ఉడతా వెంకట్రావు, కిసాన్‌ సంఘ్‌ జిల్లా అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి, బీజేపీ నాయకులు కర్నాటి ఆంజనేయరెడ్డి, పి.సురేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


విరాళాల వెల్లువ


నెల్లూరు (సాంస్కృతికం) : అమరావతి రైతుల కోసం పలువురు విరాళాలు ప్రకటించారు. టీడీపీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తనయుడు కోటంరెడ్డి ప్రజయ్‌సేనారెడ్డి రూ.లక్ష నగదును జేఏసీ కో కన్వీనర్‌ తిరుపతి రాజుకు అందజేశారు. అలాగే అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన 40 మంది రైతులు రూ.65వేలు విరాళం ఇచ్చారు. ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడు తరపున మర్రిపాడుకు చెందిన గంగనేని కొండలరావు రూ.50,116, మాలేపాటి వెంకటేశ్వర్లు రూ.10వేలు అందజేశారు. 


 నేడు విరామం


జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆదివారం మహాపాదయాత్రకు విరామం ప్రకటించారు. సోమవారం ఉదయం యథావిధిగా పాదయాత్ర కొనసాగుతుందని జేఏసీ నాయకులు తెలిపారు.

వర్షంలోనూ ఆగని నినాదంAdvertisement
Advertisement