Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఊరూరా తిరుగుతూ.. ఉద్యమం రగుల్చుతూ..!

మహా పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు

అడుగడుగునా మంగళహారతులు, పూలవర్షం

గూడూరు నియోజకవర్గంలోకి యాత్ర

వెంకటగిరి సీఐ తీరుపై నిరసన 


ఆంధ్రప్రదేశ రాజధానిగా అమరావతే ఉండాలని కోరుతూ ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరిట మహా పాదయాత్ర చేపట్టిన రైతులకు జిల్లా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి గ్రామంలో వెంకటేశ్వరస్వామి రథానికి పూజలు చేసి, రైతులకు మంగళహారతులు పట్టారు. అంతేగాక వారిపై పూలవర్షం కురిపించి, తమ సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. యాదవుల వీరతాళ్లు, జింజరమేళం నృత్యాలు, తీనమార్‌ బ్యాండ్లతో అమరావతి రైతులను ఉత్సాహపరిచారు. 34వ రోజు శనివారం 14 కిలోమీటర్ల పొడవున యాత్ర సాగింది. 


గూడూరు, డిసెంబరు 4 : 

శనివారం ఉదయం 9.30 గంటలకు సైదాపురం  నుంచి యాత్ర ప్రారంభమై తూర్పుకూన్ల రోడ్డు మీదుగా ఉదయం 11 గంటలకు గూడూరు మండలంలోకి ప్రవేశించింది. తిప్పవరప్పాడు చేరుకోగానే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పాశిం సునీల్‌కుమార్‌, నెలవల సుబ్రహ్మణ్యం, కురుగొండ్ల రామకృష్ణ, పరసారత్నం, టీడీపీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌, తెలుగు మహిళ అధ్యక్షురాలు ఉషారాణి తదితరులు ఘన స్వాగతం పలికారు. తిప్పవరప్పాడు నుంచి పుట్టంరాజుకండ్రిగ వరకు యాత్ర కొనసాగింది. రైతులకు సంఘీభావంగా టీడీపీ, బీజేపీ, వామపక్ష నాయకులు, స్థానిక రైతులు, మహిళలు పెద్దఎత్తున హాజరై పాదయాత్రలో పాల్గొన్నారు. నాయుడుపాళెం, కందలి, చెమెర్తి, కొమ్మనేటూరు, తిరువెంగలాయపల్లి, తిరుపతిగారిపల్లి గ్రామాలకు వెళ్లే మార్గాల్లో ప్రజలు పాదయాత్ర చేస్తున్న రైతులపై పూలవర్షం కరిపించి హారతులు పట్టారు.  యాదవుల వీరతాళ్లు, జింజరమేళం నృత్యాలు, తీనమార్‌ బ్యాండ్లతో పాదయాత్ర రైతులను ఉత్సాహపరిచారు. అయితే ఈ యాత్రలో అడుగడుగునా వెంకటగిరి సీఐ నాగమల్లేశ్వరరావు అండ్డంకులు సృష్టిస్తున్నాడని పాదయాత్ర రైతులు ఆరోపించారు. 


సీఐ తీరుపై నిరసన


తిరుపతిగారిపల్లి సమీపంలో స్థానికులు పూలవర్షం కురిపిస్తుండగా వెంకటగిరి సీఐ  నాగమల్లేశ్వరరావు దురుసుగా ప్రవర్తించి రోప్‌ గార్డు శివపై చేయి చేసుకున్నారు. దీంతో సీఐకు, మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌, పాదయాత్ర రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. సీఐ తీరును నిరసిస్తూ రైతులు, మహిళలు రోడ్డుపై బైఠాయించి జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ నిరసన  తెలిపారు.  అనంతరం పోలీస్‌ అధికారులు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అక్కడ నుంచి పుట్టంరాజుకండ్రిగ వరకు సజావుగా సాగింది. పాదయాత్రలో టీడీపీ నాయకులు నెలబల్లి భాస్కర్‌ రెడ్డి, గణపర్తి కిషోర్‌నాయుడు, మట్టం శ్రావణి, బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, ఆరికట్ల మస్తాననాయుడు, దుద్దా రాఘవరెడ్డి, సర్వోత్తమరెడ్డి, జలీల్‌, మల్లికార్జుననాయుడు, గోపాల్‌నాయుడు, లీలావతి, కీరవాణి, బీజేపీ నాయకులు బైరప్ప, సురేంద్రనాథ్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, వామపక్ష నాయకులు యాదగిరి, కాలేషా, సీవీఆర్‌కుమార్‌, ప్రభార్‌, శివకుమార్‌, మణి, రమణయ్య, మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. 


దాడి అమానుషం 


ప్రశాంతంగా జరుగుతున్న పాదయాత్రలో వెంకటగిరి సీఐ  అడుగడగునా అటంకాలు కలిగించడమే కాకుండా పాదయాత్రకు రోప్‌గార్డు శివ అనే యువకుడిపై దాడిచేయడం అమానుషం. నా నియోజకవర్గంలో పాదయాత్రను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మాజీ ఎమ్మెల్యేగా నాపై ఉంది. దళిత ఎమ్మెల్యే కావడంతో చిన్నచూపుతో వ్యహరిస్తూ ఎస్సీలను అవమాన పరచడం మంచి పద్ధతి కాదు. వైసీపీ కార్యకర్తగా, రౌడీలా ఓ అధికారి వ్యవహరించడం దారుణం. ఎస్సీలను అవమానపరిచిన సీఐపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసేలా ఎస్పీ దృష్టి తీసుకువెళుతాం.

- పాశిం సునీల్‌, గూడూరు మాజీ ఎమ్మెల్యే


దురుసుగా ప్రవర్తించడం దారుణం


పాదయాత్ర చేపట్టిన రైతులు, మహిళలపై వెంకటగిరి సీఐ నాగమల్లేశ్వరరావు దురుసుగా ప్రవర్తించడం దారుణమని అమరావతి పాదయాత్ర జేఏసీ చైర్మన శివారెడ్డి అన్నారు. శనివారం పుట్టంరాజుకండ్రిగలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కోర్టు, డీజీపీ అనుమతులు తీసుకుని పాదయాత్రను సాగిస్తున్నట్లు చెప్పారు. తమ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరఽథం పడుతున్నారని తెలిపారు.  అయితే వెంకటగిరి సీఐ రోప్‌గార్డు సభ్యుడు శివపై దాడి చేయడం, యాత్రకు అడ్డంకులు కలిగించడం అధికార పార్టీ కార్యకర్తనా!? గుండానా లేదా పోలీస్‌ అధికారా అని గ్రహించాలన్నారు. ఎంతో క్రమశిక్షణతో పాదయాత్ర చేస్తున్న సీఐ కులంపేరుతో దూషించడం, ఆటంకాలు కల్పించడం మానుకోవాలని సహనంతో నమష్కరిస్తున్నామన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే రాష్ట్రం మొత్తం దిగ్బంధం చేసేలా పోరాటాలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో జేఏసీ ప్రతినిధులు రాయిపాటి శైలజ, తిరుపతిరావు, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

- పాదయాత్ర జేఏసీ చైర్మన శివారెడ్డి

పూలవర్షం కురిపిస్తున్న స్థానికులు


రోడ్డుపై బైఠాయించి మహిళా రైతుల నిరసన


Advertisement
Advertisement