Abn logo
Apr 19 2021 @ 00:20AM

ధాన్యం బస్తాలు.. రిక్తహస్తాలు

కేంద్రాలలో గోనె సంచులు కరువు

వాతావరణంలో మార్పులతో రైతుల్లో భయం

దళారులను ఆశ్రయిస్తున్న వైనం

ఇదే అదునుగా దోచుకుంటున్న తీరు

పట్టించుకోని సంబంధిత అధికారులు

కరకగూడెం, ఏప్రిల్‌ 18: ‘రైతులు దళారులను నమ్మొద్దు. వారికి అమ్మి నష్టపోవద్దు. అందుకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం.’ ప్రజాప్రతినిధుల నుంచి అధికారుల దాకా వల్లె వేస్తున్న మాటలివి. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది వేరు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం చేతి కొచ్చే వేళ అమ్ముకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు మాత్రం ఏ-గ్రేడ్‌ రకం ధాన్యం క్వింటాళ్‌కు 1,888, కామన్‌ రకం క్వింటాళ్‌కు రూ.1.868 చెల్లిస్తున్నారు.  ఇంత వరకు బాగానే ఉన్నా కేంద్రాలలో గోనె సంచులు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీంతో రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. మరో వైపు వాతావరణంలో మార్పుల వల్ల గాలిదుమారాలు, వర్షాల వల్ల ధాన్యం తడిచిపోతోంది. ఇప్పటికే ఇటీవల కురిసిన వర్షాల వల్ల రైతులు పడ్డ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కరకగూడెం మండలంలో ఇటీవల ఉమ్మడి పినపాక మండలం సహకార సంఘం ఆధ్వర్యంలో కరకగూడెంలో 2, పినపాకలో 3 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కానీ గోనె సంచులు లేక రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఆర పోసి రాసులుగా చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో బస్తాలు లేక పోవడం, వాతావరణంలో మార్పుల వల్ల రైతులు దశారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా చూస్తున్న వ్యాపారులు అడ్డంగా దోచుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే గోనె సంచులు అందుబాటులో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

త్వరలోనే గోనె సంచులు అందజేస్తాం:  రవి శేఖర్‌ వర్మ, సొసైటీ చైర్మన్‌

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో గోనె సంచులు లేని విషయంపై సొసైటీ చైర్మన్‌ రవి శేఖర్‌ వర్మను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. ‘అధికారుల ఆదేశాల మేరకు ఉమ్మడి పినపాక మండలంలో ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. మిల్లర్ల వద్ద ట్యాగింగ్‌ అవుతున్నాయని.. రెండు రోజుల్లో ఆయా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గోనెసంచులు అందజేస్తామని’ వివరించారు.

Advertisement
Advertisement